ప్రకృతితో అను‘బంధం’
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:10 PM
నల్లమల అంటేనే ఆదివాసీ మూలాలు ఇంకా మిగిలివున్న చెంచు అరణ్య ప్రాంతం.
నానాటికీ అంతరించిపోతున్న గిరిజన సంతతి
కాగితాలకే పరిమితమైన సంక్షేమం
ఐటీడీఏలకు నిధులపై స్పష్టత లేదన్న విమర్శలు
నేటికీ అందని వైద్య సదుపాయాలు
అడవి నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నాలు
ఆధునిక పోకడలతో సంస్కృతిని కాలరాస్తున్న వైనం
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
నల్లమల అంటేనే ఆదివాసీ మూలాలు ఇంకా మిగిలివున్న చెంచు అరణ్య ప్రాంతం. ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటి సారిగా ఉదయించిన మానవజాతి జీవ పరిమాణ క్రమంలో నదులు, సముద్రాలు, అడవులు దాటుతూ ఆసియా ఖండంలో ప్రవేశించి అక్కడి నాగరికత వైపు ప్రయాణించారు. ఆదివాసి మూల సంతతి అయిన నల్లమల చెంచుల్లో ఇప్పటికి ఆజాతి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంలో మార్పు లేకపోయినప్పటికి ఆదివాసి అసలైన వారసులుగా చరిత్రలో మిగిలిపోయారు. మానవుడి జీవన పరిణామ క్రమం ఆదివాసి గిరిజన తెగ నుంచే ఆరంభమైందన్న వాస్తవ చరిత్ర ఉన్నప్పటికీ ఆదిమ గిరిజన జాతులపై పాలకులకు చిత్తశుద్ధ్ది సన్నగిల్లుతోంది. నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి‘ ప్రత్యేక కథనం.
ఆత్మకూరు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ప్రకృతితో గిరిజనుల అనుబంధం వెలకట్టలేనిది. ప్రకృతిలో మమేకమై జీవనం సాగిస్తుంటారు. ప్రపంచంలోనే అతి త్వరగా అంతరించిపోతున్న ఆదివాసి చెంచు తెగ ఈనల్లమలలోనే ఇంకా ఊపిరిపీల్చుకుంటూ మనుగడ సాగిస్తోంది. నానాటికీ గిరిజన సంతతి తగ్గుతున్నప్పటికీ గిరిపుత్రుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. గిరిజన సంక్షేమం కోసం కేటాయించిన నిధులు దారిమళ్లితున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆదివాసీ తెగలు ఉన్నప్పటికీ మనదేశంలోని నల్లమల అడవుల్లో ఆదివాసి చెంచు గిరిజన తెగమూలాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ప్రకృతితో మమేకమై వైవిధ్యమైన జీవనాన్ని నల్లమలలోని పలు గూడేంల గిరిజనులు సాగిస్తున్నారు.
1982లో కమిషన్ ఏర్పాటు..
ఆదివాసి గిరిజన సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని 1982లో తొలిసారిగా ఐక్యరాజ్యసమితి(ఐరాస) నడుంబిగించి ఓ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. గిరిజన జాతులను సంరక్షించాలన్న నేపథ్యంలో వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు సాగించి 1996 ఆగస్టు 9న ఆదివాసీ గిరిజన హక్కుపై ఐరాస కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు ఐరాస సభ్యత్వం వున్న సుమారు 80శాతం దేశాల ప్రతినిధులు ఆమోదం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రతిదేశంలో కొత్త సవరణలతో ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పించారు. మనదేశ రాజ్యాంగంలో 5షెడ్యూల్‌లో 244(1) అర్టికల్, 6వ షెడ్యూల్డ్‌లో 244(2) ఆర్టికల్‌ను రూపొందించి వాటికి సంబంధించిన విశేష, విశిష్ట అధికారులను ఆయా రాష్ట్రాల గవర్నర్లకు కల్పించింది. అలాగే రాష్ట్రాల శాసనసభలతో కూడా సంబంధం లేకుండా ఏకపక్ష తీర్మానం చేసే అధికారాన్ని సైతం గవర్నర్లకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఈ విషయంలో ఇప్పటి వరకు నల్లమల గిరిజనుల సంక్షేమానికి ఏ ఒక్క గవర్నర్ చొరవ తీసుకోకపోవడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి సూచన మేరకు 1982లోనే మనదేశంలోని శ్రీశైలం ఐటీ డీఏ ఆవిర్భవించినప్పటికీ చెంచుల జీవన ప్రమాణాలు ఏమాత్రం మెరుగుపడలేదు. అసలు ఐటీడీఏలకు కేటాయించిన నిధులు ఏవిధంగా ఖర్చుచేస్తున్నారో కూడా స్పష్టత లేదన్న విమర్శలు ఉన్నాయి.
10వేల జనాభా ఉంటుందని..
నల్లమల గిరిజనుల్లో పోషకాహారలోపం, రక్తహీనత, క్షయవ్యాధి, శిశుమరణాలు సంభవించడంతో చెంచుల సంతతి క్షీణించి పోతోంది. నంద్యాల జిల్లా పరిధిలో 14 మండలాల్లో 48 చెంచుగూడేంలు ఉన్నాయి. వాటిలో సుమారు 2951 గిరిజన కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 10వేల గిరిజన జనాభా ఉంటుందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీటికి కేవలం 12 చెంచుగూడేంలకు మాత్రమే పూర్తిస్థాయిలో ఆరోగ్య సదుపాయం కల్పిస్తుండగా మిగతా గూడేలకు అంతంతమాత్రంగానే ఆరోగ్య సేవలు అందుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రత్యేకించి గిరిజనులు రక్తహీనత టీబీ, కుష్టు, మలేరియా, సీజనల్ జ్వరాలు, చర్మవ్యాధులు వంటి రోగాలతో బాధపడుతున్నారు.
నల్లమల గిరిజన గూడేంల్లో విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. ఆత్మకూరు ప్రాంతం పరిధిలోని బైర్లూటి, శివపురం, కొట్టాలచెరువు, పాలెంచెరువు ప్రాంతాల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు అధ్వానంగా ఉన్నాయి. ప్రత్యేకించి వసతిగృహాలన్నింటిలో పర్యవేక్షణాధికారుల పనితీరుపై అనేక ఆరోపణలున్నాయి. గిరిజనుల కోసం వసతిగృహాలు, పాఠశాలల నిర్మాణానికి కోట్లాది రూపాయాలు కేటాయిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత వాటి పర్యవేక్షణ గాలికి వదిలేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2008నుంచి2014 వరకు 848 మంది గిరిజన బాలబాలికలు డ్రాపౌట్స్‌గా మిగిలిపోయారు. ఐటీడీఏ అధికారిక గణాంకాల్లో మాత్రం విద్యా ప్రమాణాలు సక్రమంగా అమలవుతున్నట్లు రికార్డులు ఉండటం గమనార్హం.
ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా..
నల్లమలలో నేటికీ అనేక గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వాటికి చిల్లుపడుతున్నాయి. గిరిజనులకు భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణ చట్టాన్ని నిషేధించింది. వారికి కు.ని. ఆపరేషన్లు చేస్తే. వారిపై శాఖపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అయితే ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లోపంతో చెంచులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నేటికీ చేయించుకుంటూనే ఉన్నారు.
అటవీ శాఖ కూడా చెంచుల జీవన ప్రమాణాలను అడ్డుకునేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నిస్తుంది. పలు ప్రలోభాలకు గురిచేస్తూ అడవి నుంచి బయటకు పంపించేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటుంది.
చెంచుల నృత్యాలు, ఆటపాటలు సాంప్రదాయబద్ధంగా ఉండేవి. అయితే ఆధునిక పోకడలతో వారి సంస్కృతిని కాలరాసేందుకు ప్రభుత్వ శాఖలే ముందుండి చొరవ తీసుకోవడం బాధాకరం. నల్లమల అంతర్భాగంలోని పెచ్చె ర్వు చెంచుగూడేంలో మాత్రంలో నేటికీ గిరిజన ఆచారాలు అమలవుతున్నాయి. వీరిని కూడా అడవిలో నుంచి బయటకు తీసుకురావాలని అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ వారు అడవిని వదిలి బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈఅంశంపై ఇటీవల కలెక్టర్ రాజకుమారిని కూడా చెంంచులు సంప్రదించారు.
గిరిజనుల అరణ్య రోదన..
ఐటీడీఏల ద్వారా నిధులను కేటాయిస్తున్నప్పటికి ఆ నిధులు గిరిజనుల దరికి చేరడం లేదు. పలు గూడేంలకు రహదారి సదుపాయాలు లేకపోవడంతో పాటు మౌలిక వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కనీసం విద్యా, వైద్యం, ఉపాధి సౌకర్యాలు కూడా గిరిజనులు అరణ్య రోదనతో కాలం వెల్లదీస్తున్నారు.
జిల్లాలో గిరిజన వివరాలు పరిశీలిస్తే..
చెంచుగూడేంలు : 48
జనాభా : సుమారు 10వేలు
కుటుంబాలు : 2951
గిరిజన ఆశ్రమ పాఠశాలలు : 20
గిరిజన జూనియర్ కళాశాలలు : 03