రైతు సమస్యలు పట్టని కేంద్రం
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:37 PM
ప్రజా, రైతు సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
ఆస్పరి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రజా, రైతు సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం ఆస్పరిలో సీపీఐ కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అధ్యక్షతన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. గ్రామాల్లోని నీటి సమస్యలు కేంద్రం చెవికి ఎక్కడం లేదని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో అధికంగా పండించే పత్తి, టమో టా, ఉల్లి, మిర్చి పంటలకు, ఇతర జిల్లాల్లో పండించే మామిడి, సపోటా, అరటి, దానిమ్మ పంటలకు గిట్టుటు ధరలు కల్పించలేదని విమర్శించారు. వేదవతి, గుండ్రేవుల, హంద్రీ నీవా పెండింగ్‌లో ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శులు లెనిన్ బాబు, రాజాసాహెబ్, మద్దిలేటి, కౌలు రైతుల జిల్లా సంఘం అధ్యక్షుడు తిమ్మయ్య, నాగేంద్రయ్య, మండల కార్యదర్శి విరుపాక్షి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు.