ఉద్యాన పంటలకు పెద్ద పీట
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:49 PM
కూటమి ప్రభుత్వం ఉద్యాన పంటలకు పెద్దపీట వేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా కలిసి వచ్చేలా చర్యలు తీసుకుంది
4500 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం లక్ష్యం
ఇప్పటికే 2400 ఎకరాల గుర్తింపు
ఈ నెల ఆఖరికి ఎంపిక పూర్తి
నంద్యాల, జూన్27(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఉద్యాన పంటలకు పెద్దపీట వేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా కలిసి వచ్చేలా చర్యలు తీసుకుంది. ఉపాధి హామీ పథకం 2025-26 కింద జిల్లాలో 4500 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలను పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల అదేశించింది. దీంతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) యంత్రాంగం సైతం ఆ దిశగా అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లాలో 2400 ఎకరాల పండ్ల తోటల పెంపకాన్ని గుర్తించారు. గతంలో కేవలం 2500 ఎకరాలు మాత్రమే సాగైనట్లు తెలుస్తోంది. కానీ 4500 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం ఉండాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. దీని కోసం ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రైతులకు అర్హతలు.. అందించే ఖర్చులు...
ఐదు ఎకరాలోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు అర్హులు.
రైతులకు తప్పనిసరిగా జాబ్ కార్డు ఉండాలి.
వర్షాధారిత, సాగునీటి వసతి ఉండాలి.
రైతులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా పంటల సంరక్షణ, నిర్వాహణ ఖర్చులు చెల్లింపు.
పండ్ల తోటల పెంపకం రైతులకు 2-3 సంవత్సరాల వరకు రైతులకు ఖర్చులు చెల్లిస్తారు.
ఏ పంటలంటే....
ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం మామిడి, జీడీ మామిడి, పెద్దరేగు, అవకాడో, దానిమ్మ, అంజూర, బత్తాయి, నిమ్మ, జామ, సీతాఫలం, తైవాన్‌జామ, సపోటా, కొబ్బరి, ఆల్లనేరడు, చింత, పనస, డ్రాగన్‌ప్రూట్, గులాబీ, మల్లెలు, మునగ, కోకో, జాఫ్రా, ఆయిల్‌ఫామ్ పంటలకు అవకాశం కల్పించింది.
2400 ఎకరాలు గుర్తింపు..
పండ్ల తోటల పెంపకానికి డ్వామా అధికారులు ఽరైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటికే లక్ష్యంలోని 4500 ఎకరాలకుగాను.. 2400 ఎకరాలకు రైతులను గుర్తించారు. మిగిలిన 2100 ఎకరాలను ఈ నెల ఆఖరిలోపు గుర్తించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో డోన్ నియోజకవర్గంలోని రైతులు ఎక్కువుగా పండ్ల తోటలకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
రైతులు ఆలోచించి ఎంపిక చేసుకోవాలి
ప్రభుత్వం పండ్ల తోటలకు అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న రైతులు తమ మండల పరిధిలో ఏపీవోల వద్ద దరఖాస్తు చేసుకోండి. ఇప్పటికే 50శాతం ఎంపిక చేశాం. ఈ నెల ఆఖరికి ప్రభుత్వ లక్ష్యానికి చేరుకుంటాం. రైతులు తమ భూముల్లో అనువైన పండ్ల తోటలు సాగు గురించి ఆలోచించి ఎంపిక చేసుకోవాలి.
-సూర్యనారాయణ, డ్వామా పీడీ