పెద్ద పండుగ
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:51 PM
సమాజంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
నేడు మెగా పీటీఎం 2.0
ప్రతి పాఠశాలలో సంబరాలకు సర్వం సిద్ధం
ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం దిశగా ప్రభుత్వం
కర్నూలు ఎడ్యుకేషన్, జులై 9 (ఆంధ్రజ్యోతి): సమాజంలో భాగస్వామ్యం ఉన్నప్పుడు ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. చేసిన మంచిని ప్రజలకు చెబుతూ.. చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 నిర్వహణకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 1,406 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పేరెంట్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రూ.3.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా, ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో, సమాజ అంశాలపై ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో పరస్పరం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం మంచి వేదిక అని ప్రభుత్వం భావించింది.
పీటీఎం నిర్వహణకు పాఠశాల కాంపోజిట్ గ్రాంట్
సమావేశానికి కావాల్సిన వస్తువులు, పరికరాలు, ఇతర అవసరాల కోసం పాఠశాలకు కేటాయించిన స్కూల్ కాంపోజిట్ గ్రాంట్‌నుంచి వి ద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఖర్చు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఖర్చులు, కొనుగోళ్లు, ఇతర వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని, దాతల సహకారం కూడా కోరవచ్చని జీవోలో పేర్కొన్నారు.
పాటించాల్సినవి
పాఠశాలలను మామిడి తోరణాలు, అరటి బోదెలు, రంగుల కాగితాలను ఉపయోగించి అందంగా అలంకరించాలి. పాఠశాల ఆహ్లాదకరంగా పచ్చదనంగా ఉండేలా మొక్కలు నాటాలని ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులతో కలిసి కనీసం ఒక్క మొక్క అయినా నాటేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది. తల్లుల కోసం ముగ్గుల పోటీలు, మ్యూజికల్ ఛైర్స్, లెమన్ అండ్ స్పూన్, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీల నిర్వహణ. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులను కలిపి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతంలో కంటే భిన్నంగా నిర్వహిస్తాం
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ను గతంలో కంటే భిన్నంగా ఆదర్శవంతంగా నిర్వహిస్తాం. విద్యార్థులను వారి తల్లిదండ్రులను, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పండుగలా నిర్వహిస్తాం. బనగానపల్లె ప్రభుత్వ బాలికల పాఠశాలలో మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి, నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌లు పాల్గొంటున్నారు.
- జనార్దన్‌రెడ్డి, డీఈవో, నంద్యాల
స్కూల్ కాంపోజిట్ నిధుల నుంచి ఖర్చు
మెగా పీటీఎంను గ్రాండ్‌గా నిర్వహించేందుకు దాతలతో పాటు స్కూల్ కాంపోజిట్ నిధుల నుంచి ఖర్చు చేసేవిధంగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించడం జరిగింది. ఎక్కడా ఏ మాత్రం రాజీపడకుండా ఈవెంట్‌ను నిర్వహించాలని సూచించాము. అన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు ఉండే విధంగా కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొనాలని కోరుతున్నాము.
- ప్రేమంత్‌కుమార్, ఏపీసీ సర్వశిక్షా అభియాన్, నంద్యాల జిల్లా
అద్భుతంగా మెగా పీటీఎం ఏర్పాట్లు
కర్నూలు జిల్లాలో మెగా పీటీఎం కార్యక్రమాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నాము. ఇలాంటి సమావేశాల ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సంబంధాలు బలపడి పాఠశాలల అభివృద్ధికి దోహదపడుతాయి. గురువారం కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కలెక్టర్ రంజిత్ బాషా, కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపి బస్తిపాటి నాగరాజు, బీ.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల, పాఠశాలలో కార్యక్రమాల్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జాయింట్ కలెక్టర్లు హాజరవుతారు.
- శామ్యూల్ పాల్, డీఈఓ, కర్నూలు