టీబీ డ్యాంలో 67.47 టీఎంసీలు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:27 AM
ఎల్లెల్సీ ఆయకట్టు రైతులకు తీపి కబురు. తుంగభద్ర జాలశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది.
ఎగువ నుంచి 65,187 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జూలై 10న నుంచి ఎల్లెల్సీ సాగునీటి కోసం కర్ణాటక ఇండెంట్
ఆ రోజు నుంచే ఏపీకి కూడా ఇచ్చే అవకాశం
వచ్చే నెల మొదటి వారంలో ఐఏబీ సమావేశంలో కీలక నిర్ణయం
ఎల్లెల్సీ ఆయకట్టు రైతులకు తీపి కబురు. తుంగభద్ర జాలశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే 67.47 టీఎంసీలు వరద చేరింది. 65,187 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గతేడాది కొట్టుకుపోయిన గేటు మరమ్మతులు, మిగిలిన 32 గేట్లు కూడా బాగా దెబ్బతినడంతో ఈ నీటి సంవత్సరంలో 80 టీఎంసీలు నిల్వ చేయాలని నిపుణుల కమిటీ సూచనతో టీబీపీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 10న నుంచి సాగునీరు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం జరిగిన ఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదే రోజు నుంచే ఏపీ వాటా కూడా తీసుకోవడానికి ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు వచ్చే నెల మొదటి వారంలో జరిగే జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
కర్నూలు, జూలై 29(ఆంధ్రజ్యోతి): జిల్లా పశ్చిమ ప్రాంతం కరువు పల్లెసీమలకు తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) జీవనాడి. ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగ నూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్ లో 43,519 ఎకరాలు, రబీలో 1,07,615 ఎకరా లు కలిపి 1,51,134 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టులో 19వ నంబరు గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ గేటు స్థానంలో నూతన గేటు ఏర్పాటు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అదే క్రమంలో మిగిలిన 32 గేట్లు కూడా అధ్వానంగా మారాయని, 45-50 శాతానికి పైగా తుప్పు పట్టాయని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ గేట్లను కూడా మార్చేసి కొత్త గేట్లు ఏర్పాటు కోసం రూ.60 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అదే క్రమంలో 2025-26 నీటి సంవత్సరంలో 80 టీఎంసీలకు మించి నిల్వ చేస్తే డ్యాం భద్రతమే ముప్పు తప్పదని నిపుణుల కమిటీ సూచన మేరకు 80 టీఎంసీలే నిల్వ చేయాని తుంగభద్ర బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త గేట్లు ఏర్పాటు కోసం డిసెంబరు ఆఖరు నాటికి డ్యాం 1616 అడుగుల (సిల్ లెవల్) దిగువకు నీరు తగ్గించాల్సి ఉంది. దీంతో ఈ నీటి సంవత్సరంలో 120 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉందని ఈ నెల 11న జరిగిన టీబీపీ వాటర్ రివ్యూ కమిటీ వర్చువల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆమేరకు కేడబ్ల్యూడీటీ-1 అవార్డు దమాషా ప్రకారం మూడు రాష్ట్రాలకు పంపిణీ చేశారు.
జూలై 10 నుంచి ఎల్లెల్సీ సాగునీరు:
తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ద్వారా ఎగువన కర్ణాటక, దిగువన ఎల్లెల్సీ వాటాను కలిపి తీసుకోవాలి. 0/0 నుంచి 130 కిలో మీటర్లు వరకు పూర్తిగా కర్ణాటకలో ప్రవహిస్తుంది. దీంతో ఆ రాష్ట్రం ఇండెంట్ ఇవ్వకుండా మన నీటివాటాను తీసుకుంటే ఆ నీరంతా కర్ణాటక రైతులే వాడేసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే మనం నష్టపోతాం. దీంతో కర్ణాటక ఇండెంట్‌తో పాటుగానే ఎల్లెల్సీకి ఏపీ వాటా ఇండెంట్ ఇంజనీర్లు ఇస్తున్నారు. జూలై 10 నుంచి డ్యాం నుంచి నీటిని ఇవ్వాలని శుక్రవారం జరిగిన కర్ణాటక ఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో పాటు టీబీపీ బోర్డుకు ఇండెంట్ కూడా ఇచ్చినట్లు బోర్డు అధికారులు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో జరిగే ఐఏబీ సమావేశంలో నీటి విడుదలపై నిర్ణయం తీసుకొని 10వ తేది నుంచే ఎల్లెల్సీకి నీటి విడుదలకు ఇండెంట్ ఇచ్చేందుకు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. 7న ఐఏబీ సమావేశం జరగవచ్చని అంటున్నారు. మంత్రి, ఎమ్మెల్యేల నిర్ణయం నిర్ణయం మేరకు వాయిదా పడితే.. సాగు, తాగునీటి అవసరాలు దృష్ట్యా ఇండెంట్ ఇవ్వమని జిల్లా కలెక్టరు పి. రంజిత్‌బాషా జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది.
డ్యాంలో చేరిన 67.47 టీఎంసీలు
తుంగభద్ర డ్యాం గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 105.782 టీఎంసీలు కాగా.. ఆదివారం నీటి లెక్కలు పరిశీలిస్తే 67.47 టీఎంసీలు వరద చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు 65,187 క్యూసెక్కులు (రోజుకు సగటున 5.5 టీఎంసీలు) వరద వచ్చి చేరు తుంది. ఈ వరద పెరిగే అవకాశం ఉందని డ్యాం ఇంజనీర్లు తెలిపారు.
ఐఏబీ సమావేశం నిర్ణయం మేరకు ఇండెంట్ ఇస్తాం
తుంగభద్రకు ఆశాజనకంగా వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే 67.47 టీఎంసీలు చేరింది. వచ్చే నెల 10 నుంచి ఎల్లెల్సీకి నీటి విడుదల కోసం కర్ణాటక ఇండెంట్ ఇప్పటికే ఇచ్చింది. ఆ రోజు నుంచే మనం కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే.. జూలై మొదటి వారంలో జరిగే ఐఏబీ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు ఇండెంట్ ఇస్తాం.
- బాలచంద్రారెడ్డి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ, కర్నూలు సర్కిల్