మెగా డీఎస్సీలో2,590 పోస్టులు భర్తీ
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:07 AM
మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా తుది జాబితాలో మొత్తం 2,590 ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఉమ్మడి జిల్లాలో అర్హులు లేక భర్తీ కాని పోస్టులు 88
కర్నూలు ఎడ్యుకేషన్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా తుది జాబితాలో మొత్తం 2,590 ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందులో అర్హత గల అభ్యర్థులు లేక 88 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 2,678 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆన్‌లైన్ పరీక్ష అనంతరం గతనెల 23న ప్రభుత్వం ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటించింది. యాజమాన్యాల వారీగా పోస్టుల భర్తీ ఇలా ఉంది.. ప్రభుత్వ యాజమాన్యాల విభాగంలో నోటిఫై చేసిన పోస్టులు 2,547 కాగా, భర్తీ చేసిన పోస్టులు 2483. అర్హత గల అభ్యర్థులు లేక 64 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. మున్సిపల్ కార్పొరేషన్ విభాగం లో నోటిఫై చేసిన పోస్టులు 58 కాగా, 51 భర్తీ అయ్యాయి. 7 పోస్టులు అభ్యర్థులు లేక మిగిలిపోయాయి. అలాగే మున్సిపాలిటీలో 40 పోస్టులకు గానూ 28 పోస్టులు భర్తీ చేయగా.. 12 పోస్టులు మిగిలిపోయాయి. ట్రైబల్ చెంచు విభాగాలకు సంబందించి 33 పోస్టులకు గానూ 28 పోస్టులు భర్తీ అయ్యాయి. అభ్యర్థులు లేక 5 పోస్టులు మిగిలిపోయాయి. అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వలన ఆయా కేటగిరిలో మిగిలిన 88 పోస్టులను వచ్చే ఏడాది డీఎస్సీలో భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థుల ప్రశ్నల నివృత్తికి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తాత్కాలిక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. హెల్ప్‌డెస్క్ నెంబర్.9440589315, 9440561831, 998504 7704ను సంప్రదించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు ఈనెల 19న విజయ వాడలో నియామక పత్రాలు అందజేస్తామన్నారు. జిల్లాలో ఎంపికైన అభ్యర్థులందరూ గతంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేసుకున్న సెంటర్లకు ఈనెల 18న ఉదయం 7 గంటలకు రిపోర్టు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా విజయవాడకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులతో పాటు తోడుగా ఒకరిని విజయవాడకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అభ్యర్థులు 18వ తేదీన ఉదయం 7 గంటలకు తప్పక రిపోర్టు చేసుకోవాలని పేర్కొన్నారు.