మూడు రోజుల్లో25,250 మంది ప్రయాణం
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:43 PM
స్త్రీశక్తి పేరిట ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సక్సెస్ అవుతోంది.
స్త్రీశక్తికి పెరుగుతున్న ఆదరణ
ప్రభుత్వంపై ఏడాదికి ఉచిత బస్ రూపంలో రూ.45 కోట్లకు పైగా భారం
కర్నూలు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): స్త్రీశక్తి పేరిట ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సక్సెస్ అవుతోంది. మహిళల నుంచి ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఇన్నాళ్లు చార్జీల రూపంలో ఎంత ఖర్చు చేశాం.. ఫ్రీ బస్ వల్ల ఎంత ఆదా అవుతుంది..! బేరీజు వేసుకుంటున్న మహిళల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రూట్లలోనూ రైట్.. రైట్ అంటూ మహిళలు సందడి చేస్తున్నారు. కౌతాలం మండలం ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణమాసం ఉత్సవాలు సోమవారంతో పూర్తి కావడంతో ఉరుకుంద క్షేత్రానికి చేరుకోవడానికి ఆదివారం ఎమ్మిగనూరు, ఆదోని ఆర్డీసీ బస్టాండ్లలో మహిళలు రద్దీ కనిపించింది. ఫ్రీబస్ సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15న స్త్రీశక్తి పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కర్నూలు-1, 2, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ఆర్టీసీ డిపోల పరిధిలో వివిధ రూట్లలో తొలి రోజు శుక్రవారం దాదాపుగా 2,500 మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. రెండో రోజు శనివారం ఏకంగా 20,300 మంది మహిళలు వివిధ రూట్లలో ఉచిత బస్సు ప్రయాణం చేశారు. మూడు రోజుల సెలవులు పూర్తి కావడం వల్ల ఆదివారం 25,250 మంది ప్రయాణించినట్లు అధికారిక సమాచారం. స్త్రీశక్తి పథకం ప్రారంభానికి ముందు వరకు రోజుకు సరాసరి రూ.60 లక్షలకు పైగా చార్జీల రూపంలో ఆర్టీసీకి ఆదాయం వచ్చేంది. ఫ్రీ బస్ సౌకర్యం వల్ల దాదాపు రూ.12-13 లక్షల వరకు రాబడి తగ్గింది. ఈ మొత్తాన్ని రాయితీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే ఒక్క కర్నూలు జిల్లా నుంచి నెలకు రూ.3.60-4 కోట్లు.. ఏడాదికి రూ.45-48 కోట్లకు పైగా ఫ్రీ బస్ రూపంలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాయితీ బరించాల్సిందే. ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లను ఆ సంస్థ ఆర్‌ఎం టి.శ్రీనివాసులు పరిశీలించారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం సద్వినియోగంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్లు, కండక్లర్లకు సూచనలు చేశారు.
సెల్‌ఫోన్లలో గుర్తింపు కార్డులు చూపించినా ఓకే
స్త్రీశక్తి పథకం ప్రారంభించి రెండు రోజులు అవుతోంది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు.. వంటి గుర్తింపు కార్డులు సెల్‌ఫోన్లో చూపించినా అనుమతిస్తారు. ఈమేరకు కండక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి.
- టి.శ్రీనివాసులు, రీజినల్ మేనేజరు, ఏపీఎస్ ఆర్టీసీ, కర్నూలు
మూడు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలు
ఏపీఎస్ ఆర్టీసీ డిపో 15న 16న 17న
కర్నూలు - 1 350 3,150 3,500
కర్నూలు - 2 650 6000 6,750
ఆదోని 600 4,250 5,750
ఎమ్మిగనూరు 550 4,350 5,750
పత్తికొండ 350 2,550 3,500
మొత్తం 2,500 20,300 25,250