1,525 క్వింటాళ్ల ఉల్లి కొనుగోళ్లు
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:51 AM
ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు చేపట్టిన కార్యక్రమానికి స్పందన లభించింది. కర్నూలు మార్కెట్ యార్డుకు సోమవారం వచ్చిన 1,525 క్వింటాళ్ల ఉల్లిని ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటా రూ.1,200 చొప్పున రైతులకు చెల్లించి కొనుగోలు చేసింది.
ప్రభుత్వ మద్దతు ధర రూ.1200
హర్షం వ్యక్తం చేసిన రైతులు
కర్నూలు అగ్రికల్చర్, సెప్టెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు చేపట్టిన కార్యక్రమానికి స్పందన లభించింది. కర్నూలు మార్కెట్ యార్డుకు సోమవారం వచ్చిన 1,525 క్వింటాళ్ల ఉల్లిని ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటా రూ.1,200 చొప్పున రైతులకు చెల్లించి కొనుగోలు చేసింది. ఉమ్మడి జిల్లాలోని వివిద గ్రామాల నుంచి 1,607 క్వింటాళ్ల ఉల్లిని రైతులు అమ్మకానికి తెచ్చారు. ఇందులో 1,525 క్వింటాళ్ల ఉల్లిని మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాకు రూ.1,200 ప్రకారం కొనుగోలు చేశారు. 1,607 క్వింటాళ్లలో 554 క్వింటాళ్లను వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు టెండర్లు వేశారు. కిలో రూ.6 నుంచి కేవలం రూ.8లకు కొనుగోలు చేసేందుకు టెండర్లు వేశారు. అయితే రైతులు నష్టపోకూడదనే ఉద్ధేశంతో ఆ 554 క్వింటాళ్ల ఉల్లిని కూడా ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. 1,607 క్వింటాళ్లలో 82 క్వింటాళ్లను వ్యాపారులు రూ.1,329 ప్రకారం కొనుగోలు చేశారు.
రైతులకు అండగా ప్రభుత్వం
ఫ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు అగ్రికల్చర్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని, అందువల్ల రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం ఉదయం మంత్రి కర్నూలు మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో క్వింటం ఉల్లికి రూ.1,200 ధర అందించే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉల్లికి ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధరపై రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం సంతోషంగా ఉందని, ప్రస్తుతం అందిస్తున్న క్వింటానికి రూ.1,200తో పాటు మరికొంత సాయాన్ని అందించాలని రైతులు కోరారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను ఎప్పటి కప్పుడు గుర్తించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలి పారు. కష్టాల్లో ఉన్న రైతులు, అన్ని వర్గాల ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందేందుకు రైతులు అధికారులకు సహకరిం చాలన్నారు. కార్యక్రమంలో కడప జేడీ రామాంజనేయులు, డిప్యూటీ డైరెక్టర్ లావణ్య, ఏడీఎం నారాయణమూర్తి, కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి, యార్డు చైర్మన్ గోల్కొండ అజ్మిత్‌బీ, వైస్ చైర్మన్ శేషగిరిశెట్టి, డైరెక్టర్లు, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, నగేష్, శివన్న పాల్గొన్నారు.
కలెక్టర్ సందర్శన: కర్నూలు మార్కెట్ యారులో ఉల్లి విక్రయాలను కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. జేసీ నవ్యతో పాటు మార్క్‌ఫెడ్ అధికారులతో వెళ్లి ఉల్లి రైతులతో మాట్లాడారు.
56.50 క్వింటాళ్లు తీసుకొచ్చా
మార్కెట్ యార్డుకు 56.50 క్వింటాళ్ల ఉల్లిని తీసుకొచ్చా. క్వింటా రూ.517తో కొనుగోలు చేస్తామని వ్యాపారులు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 క్వింటా చొప్పున పంటను కొనుగోలు చేసింది. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు.
- చంద్రప్ప, పార్లపల్లె, ఎమ్మిగనూరు మండలం
సంతోషంగా ఉంది
ఉల్లి రైతుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే రూ.1200 మద్దతు ధరతో కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నేను 25 క్వింటాళ్ల ఉల్లిని తీసుకొచ్చాను. రూ.1200 మద్దతు ధరతో విక్రయించాను. చాలా సంతోషంగా ఉంది. - మద్దయ్య, ఎర్రగుడి గ్రామం, కృష్ణగిరి మండలం
క్వింటా ఉల్లి రూ.2,500కు కొనుగోలు చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
కర్నూలు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా ఉల్లిగడ్డలు క్వింటా రూ.2,500చొప్పున కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. జిల్లాలో దేవనకొండ, సి.బెళగల్, ఆస్పరి, గోనెగండ్ల, కోసిగి, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, వెల్దుర్తి మండలాల్లో ఉల్లి సాగు అధికంగా చేస్తున్నారని తెలిపారు. అత్యంత కరువు పీడిత ప్రాంతమైన ఈ జిల్లాలో బోరుబావుల కింద 15 శాతం ఉల్లి పంట సాగు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది అఽధిక వర్షాలకు భారీగా తగ్గిందని తెలిపారు. చేతి కొచ్చిన అరకొర పంటను మార్కెట్‌కు తీసుకెళితే క్వింటా రూ.500-600లకు మించి కొనుగోలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం క్వింటా రూ.1,200లకు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుందని, పెరిగిన పెట్టుబడి కారణంగా గిట్టుబాటు కావడం లేదని వివరించారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కమిటీ తరపున సీఎంకు లేఖ రాశామని రామకృష్ణ వివరించారు.