Share News

సుంకేసులకు 1.40 లక్షల క్యూసెక్కుల వరద

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:06 PM

తుంగభద్రకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

సుంకేసులకు 1.40 లక్షల క్యూసెక్కుల వరద
కర్నూలు నగరం అంచుల్లో ప్రవహిస్తున్న తుంగభద్ర. 1.35 లక్షల క్యూసెక్కులు ప్రవాహం ఉంది

ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర

శ్రీశైలానికి కొనసాగుతున్న 4,70,039 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కర్నూలు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తుంగభద్రకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్నూలు నగరానికి ఆనుకొని 1,35,402 క్యూసెక్కుల ప్రవాహంతో జల ప్రేమికులను తుంగభద్ర కనువిందు చేస్తోంది. సుంకేసుల బ్యారేజీకి శుక్రవారం 1.40 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 1.20 టీఎంసీలకు మించి అదనంగా నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. దీంతో జలాశయం భద్రత దృష్ట్యా వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగవన శ్రీశైలానికి వదిలేస్తున్నారు. 20 గేట్లెత్తి 1,35,402 క్యూసెక్కుల మేర వరదను నదికి విడుదల చేయగా, 2,375 క్యూసెక్కులు కేసీ కాలువకు వదులుతున్నారు. 290.20 మీటర్ల లెవల్‌లో 0.608 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశారు. రాయలసీమ జీవనాడి తుంగభద్ర డ్యాంకు 80,500 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు, పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, 1,624.54 అడుగుల లెవల్‌లో 74.96 టీఎంసీలు నిల్వ చేశారు. 85.351 క్యూసెక్కులు నదికి, 9,200 క్యూసెక్కులు వివిధ కాలువలకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలానికి పోటెత్తిన వరద

తెలుగు రాష్ట్రాల ప్రాణనాడి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగునవ సుంకేసుల బ్యారేజీ (తుంగభద్ర), జూరాల ప్రాజెక్టు (కృష్ణా నది) గేట్లు దాటి 7,70,039 క్యూసెక్కులు వరద వచ్చి చేరుతోంది. స్పిల్‌వే 10 క్రస్ట్‌గేట్ల 18 మీటర్లు పైకెత్తి 4,21,530 క్యూసెక్కులు, ఏపీ, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ద్వారా 64,953 క్యూసెక్కులు కలిపి 4,86,963 క్యూసెక్కులు దిగున నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 30 వేలు తీసుకోగా, మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హంద్రీనీవా కాలువకు 2,818 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 800 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:06 PM