వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:34 PM
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
కర్నూలు ఎడ్యుకేషన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక మెంటర్లుగా నియమించిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆదోని డివిజన్‌లో డ్రాపౌట్ల శాతం ఎక్కువగా ఉందని, తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లిన విద్యార్థులను వెనక్కి రప్పించి వసతి గృహాల్లో చేర్పించాలని సూచించారు. రోజూ 20 మార్కులకు స్లిప్‌టెస్టులు నిర్వహిస్తున్నామని, ఇందులో యావరేజ్ పర్సంటేజ్ 15 శాతానికి మించాలని కలెక్టర్ తెలిపారు. 14 మండలాల యావరేజ్ పర్సంటేజీలో వెనుకబడి ఉన్నాయని, ఈ మండలాలపై దృష్టి పెట్టాలని డీఈవోను, సమగ్ర శిక్ష ఏపీసీలను ఆదేశించారు. ఆర్డీవోను కూడా తమ డివిజన్ వెనుకబడిన పాఠశాలలో పురోగతి సాదించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ జిల్లాలో అక్షరాస్యత శాతం 57 శాతం మాత్రమే ఉందని, వంద శాతం ఉత్తీర్ణత సాదించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో వెంకటనారాయణమ్మ, డీఈవో సుధాకర్, సమగ్ర శిక్ష ఏపీసీ డా.లోక్‌రాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్డీవోలు సందీప్ కుమార్, భరత్ నాయక్, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, హౌసింగ్ పీడీ చిరంజీవి, అనూరాధ, సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.