Share News

పశ్చిమ పల్లెలకు అదనపు జలాలు

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:47 PM

హంద్రీనీవా విస్తరణ పనులు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ.2,647కోట్లతో ఈపనులు చేపట్టారు.

పశ్చిమ పల్లెలకు అదనపు జలాలు
చురుగ్గా హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు

హంద్రీనీవా విస్తరణతో అదనంగా కృష్ణా జలాలు

చెక్‌ డ్యాంలు, ఎత్తిపోతలు నిర్మాణాలకు ప్రతిపాదన

అదనంగా 20,500 ఎకరాలు సాగు

హంద్రీనీవా విస్తరణ పనులు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ.2,647కోట్లతో ఈపనులు చేపట్టారు. కాలువ ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్కు లకు పెంచి ఈనెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యం. అదేజరిగితే కృష్ణా వరద జలాలు అదనంగా మరో 20 టీఎంసీలకు పైగా ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. నిత్యం కరువు, వలసలతో తల్లడిల్లే పశ్చిమ ప్రాంతం కరువు పల్లెసీమలకు అదనపు జలాలు మళ్లించి సస్యశామలం చేసేలా ఇంజనీర్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో రెండు ఎత్తిపోతల పథకాలు, పత్తికొండ నియోజకవర్గంలో ఐదు చెక్‌డ్యాంలు, పుచ్చకాయలమడ ఎత్తిపోతల పథకం నిర్మాణా లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.110.50కోట్లు నిధులు ఇస్తే పల్లెసీమలు సస్యశామలం చేయవచ్చని ఇంజనీరింగ్‌ నిపుణుల సూచనలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాయల సీమ ప్రాంతానికి కృష్ణా జలాలు మళ్లించడంతో కరువు, వలసలతో తల్లడిల్లే వర్షాధారంపై ఆధార పడిన మెట్టపొలాలను సస్యశ్యామలం చేయవచ్చు. రైతు ఇంట ధాన్యం రాశులు నింపవచ్చు అనే లక్ష్యంగా హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) శ్రీకారం చుట్టారు. శ్రీశై లం ఎగువన నందికొట్కూరు మండలం మాల్యాల ప్రధానలిఫ్టు ద్వారా 40 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు డిజైన్‌ చేశారు. ఉమ్మడి కర్నూలు, అనంత పురం, చిత్తూరు జిల్లాల్లో 6.025లక్షల ఎకరాల్లో సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 35ఏళ్లు దాటింది. రూ.వేల కోట్లు ప్రజాధనం ఖర్చు చేశారు. ఈనా టికి లక్ష్యం నెరవేరలేదనే చెప్పాలి. 2012లో తొలి సారిగా హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణాజలాలు ఎత్తిపోసి కరువు సీమకు మళ్లించారు. పదేళ్ల నీటి ఎత్తిపోతల రికార్డులు పరిశీలిస్తే 2018-19, 2019- 20, 2020-21లో ఒక్కటే 43నుంచి 47 టీఎంసీల వరకు కృష్ణాజలాలు ఎత్తిపోశారు. మిగిలిన ఏడేళ ్లలో సరాసరి 26-28టీఎంసీలు తీసుకున్నారు. కాలు వ ప్రవాహ సామర్థ్యం 2వేల క్యూసెక్కులకు మిం చకపోవడమేనని కారణం. సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలుదీరగానే రూ.2,647 కోట్లలో హంద్రీనీవా కాలువను 3,850 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి విస్తరణ, లైనింగ్‌ పనులు చేపట్టారు. పనులు పూర్తైతే అద నంగా మరో 20-25 టీఎంసీలు కృష్ణా వరద ఎత్తిపోసుకునే అవకాశం ఉంది.

ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదన

హంద్రీనీవా విస్తరణ ద్వారా ఎత్తిపోసే అదనపు కృష్ణా వరద జలాలు పశ్చిమ ప్రాంతం కరువు నేలకు మళ్లిస్తే మెట్టచేలు పచ్చని పైర్లతో సస్యశ్యామలం చేయవచ్చని నిపుణులు అంటున్నారు. నందికొట్కూరు మండలం దిగువపాడు వద్ద 0.264 టీఎం సీలు ఎత్తిపోసేసి 4,200 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని ఎత్తిపోతల పథకం నిర్మాణా నికి ప్రతిపాదించారు. రూ.54 కోట్లు నిధులు కావాలి. కలమందలపాడు, పారమంచాల, జలకనూరు గ్రామాల రైతులకు జల ప్రయోజనం కలుగుతుంది. 0.264 టీఎంసీలు వాడుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఉంది. పాణ్యం నియోజకవర్గంలో నాయకల్లు, లద్దగిరి గ్రామాలవద్ద ప్రధానకాలువకు స్లూయిస్‌ ఏర్పాటుచేస్తే 600ఎకరాలు సాగునీరు ఇవ్వవచ్చు. విస్తరణలో భాగంగానే ఈ పనులు చేపట్టవచ్చు. పత్తికొండ మం డలం పుచ్చకాయలమడ గ్రామం వద్ద 0.03టీఎంసీలు ఎత్తిపోసుకునే లిఫ్టు నిర్మా ణానికి ప్రతిపాదించారు. సీఎం చంద్రబాబు ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ఆగ్రామానికి వచ్చినప్పుడు స్పష్టమైన హామీఇచ్చారు. రూ.6.50కోట్లు నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

భూసేకరణే సమస్య

సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలంటే భూ సేక రణ సమస్య ప్రధానంగా వేధిస్తుంది. పత్తికొండ ని యోజకవర్గంలో హంద్రీనీవా కాలువ పరిధిలో వాగు లు, వంకలకు స్లూయి స్‌ ఏర్పాటుచేసి చెక్‌డ్యాంలు నిర్మిస్తే.. ఒక్క ఎకరం కూడా భూ సేకరణ లేకుండా 12,700 ఎకరాలు అదనంగా సాగులోకి తీసుకు రావ చ్చు. ఇందుకోసం రూ.40కోట్లు నిధులు కావాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హంద్రీనీవా కాలువ 61.5 కి.మీలు, 67.50 కి.మీలు, 113.615 కి.మీలు, 123.40 కి.మీలు, 130.032 కి.మీలు, 134.602 కి.మీలు, 136.755 కి.మీలు, 141.275 కి.మీ వద్ద వంకలు, వాగులకు స్లూయిస్‌(తూములు) ఏర్పాటుచేయాలి. ఆవంకలకు చెక్‌డ్యాంలు నిర్మిం చాలి. దీంతో భూగర్భజలాలు పెరిగి పరిసరాల్లోని 760-850 బోరు బావులకు పైగా రీచార్జ్‌ అవుతాయి. ప్రత్యేక్షంగా, పరోక్షంగా 12,700 ఎకరాలకు పైగా అదనంగా సాగు లోకి వస్తుందని నిపుణులు అంటున్నారు. కాలువ విస్తరణ చేపట్టడంతో అదనంగా 20-25టీఎంసీలకు పైగా ఎత్తి పోసుకునే అవకాశం ఉండడంతో నీటి సమస్య కూడా తలెత్తదని అంటున్నారు.

పత్తికొండలో హంద్రీనీవా కాలువకు అనుబంధంగా చెక్‌ డ్యాంల ప్రతిపాదన, ఆదనపు అయకట్టు (ఎకరాలు), రీచార్జ్‌ అయ్యే బోర్లు, లబ్దిపొందే గ్రామాలు:

స్లూయిస్‌ ప్రతిపాదిత చెక్‌డ్యాంలు ఆదనపు రీచార్జయ్యే లబ్ధిపొందే

వంక/కి.మీలు అంచనా ఆయకట్టు బోరుబావులు గ్రామాలు

పెద్దవంక/61.5 3 1,000 100 4

ఎస్‌హెచ్‌ ఎర్రగుడి/67.50 4 3,000 200 4

కొంటోని వంక/113.615 2 1,200 100 4

పీతేరువంక/123.40 4 1,500 60 5

కుమ్మరవాని/130.032 1 800 100 3

ఉప్పుడు వంక/134.602 2 700 50 3

కుక్కలవంక/136.755 4 2,500 80 5

ఎద్దుల వంక/141.275 4 2,000 70 4

మొత్తం 24 12.700 760 32

Updated Date - Jun 22 , 2025 | 11:47 PM