Share News

బియ్యం మాయం..!

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:54 PM

ఆదోని పట్టణ శివారున శిరుగుప్ప సర్కిల్‌ సమీపంలో ఉన్న ఓ గోదాములో రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ చేశారు.

 బియ్యం మాయం..!

ఆదోని శివారులోని ఓ గోదాములో రేషన్‌ బియ్యం అక్రమ నిల్వ

ఏపీ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహేశ్‌నాయుడు దాడులు

పట్టుబడిన 1,500-1,800 బస్తాలు

రాత్రికి రాత్రే మాయం చేసిన రేషన్‌ మాఫియా

ఇంతకూ నిందితులెవరు?

ఆదోని పట్టణ శివారున శిరుగుప్ప సర్కిల్‌ సమీపంలో ఉన్న ఓ గోదాములో రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ చేశారు. ఏపీ సిపిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహేశ్‌నాయుడు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆకస్మికంగా దాడులు చేశారు. 1,500-1,800 (ఒక్కో బస్తా 50 కిలోలు) బస్తాలు పట్టుకున్నారు. పట్టుబడిన పేదల బియ్యాన్ని స్వాధీనం చేసుకోమని సబ్‌ కలెక్టర్‌ భరత్‌కుమార్‌ సహా పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. తెల్లారేసరికి రేషన్‌ బియ్యాన్ని మాఫియా మాయం చేసింది. శనివారం ఉదయం తీరిగ్గా వెళ్లిన రెవెన్యూ అధికారులు గోదాములో 109 బస్తాలు సీజ్‌ చేశామని సెలవిచ్చారు. అర్ధరాత్రి గోదాములోని రేషన్‌ బియ్యం తెల్లారే సమయానికి ఏమయ్యాయి..? నిందితుల వెనుక ఉన్నది ఎవరు..? సివిల్‌ సప్లయ్‌ డైరెక్టరే నేరుగా రేషన్‌ బియ్యానికి కాపలా పెట్టమని సూచించినా పోలీసులు రక్షణ ఏర్పాటు ఎందుకు చేయలేదు? దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

కర్నూలు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏపీ ప్రభుత్వ ప్రజా పంపిణీ (సివిల్‌ సప్లయ్‌) విభాగం పర్యవేక్షణలో 2,437 నిత్యావసర సరుకుల పంపిణీ దుకాణాలు ఉన్నాయి. 12.05 లక్షల రేషన్‌ కార్డుదారులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రతినెల 20 వేల మెట్రిక్‌ రేషన్‌ బియ్యం ఉచితంగా సరఫరా చేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 6.72 లక్షల రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెల సగటున 11 వేల మెట్రిక్‌ టన్నులు, నంద్యాల జిల్లాలో 5.34 లక్షల రేషన్‌ కార్డుదారులకు 9 వేల మెట్రిక్‌ టన్నులు బియ్యం పంపిణీ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలనెలా రూ.వేల కోట్లు వెచ్చిస్తూ ఉచితంగా రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నాయి. ప్రతి వ్యక్తికి 5 కిలోలు చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తున్నారు. అయితే కొందరు రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా సరిహద్దులు దాటించి ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడుతున్నారు. గత వైసీపీ హయాంలో ఉచిత బియ్యాన్ని అక్రమార్కులు పందికొక్కుల్లా తినేశారు. ఆదోని కేంద్రంగా జగన్‌ ప్రభుత్వ హయాంలో ఆనాటి వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి తనయుడు ఆధ్వర్యంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సాగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ వైసీపీ నాయకులు అధికార కూటమిలోని బీజేపీలో చేరి బియ్యం మాఫియా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది.

దాడుల్లో బయటపడిన రేషన్‌ బియ్యం డంప్‌:

ఆదోని పట్టణ శివారున శిరుగుప్ప సర్కిల్‌ సమీపంలో ఓ ప్రైవేటు గోదాము అడ్డాగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సా గిస్తున్నారు. సివిల్‌ సప్లయ్‌ డీలర్లు, కార్డుదారుల నుంచి కిలో రూ.9-10లకు కొనుగోలు చేసిన బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా ఆ గోదాముకు చేర్చి.. అక్కడి నుంచి రాత్రికి రాత్రే సరిహద్దులు దాటించి కర్ణాటక రాష్ట్రం శిరుగుప్పకు చేర వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల ఒకటో తారీఖు నుంచి ప్రభుత్వం ఎండీయూ వాహనాలు రద్దు చేసి.. డీలర్ల ద్వారానే కార్డుదారులకు బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. పంపిణీ చేసిన బియ్యాన్ని వివిధ మార్గాలు ద్వారా ఆదోని శివారులోని రహస్య గోదా ముకు చేర్చారు. ఒక్కొక్క బస్తా 50 కిలోల చొప్పున తూకం వేసి రవాణాకు సిద్ధం చేస్తున్నారు. సమాచారం రావడంతో ఏపీ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహేశ్‌నాయుడు శుక్రవారం రాత్రి ఆదోనికి చేరుకు న్నారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డీఎస్పీ హేమలత దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. కల్లుబావి వీఆర్‌ఓ రాజశేఖర్‌గౌడ్‌, ఒకటో పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను మహేశ్‌నాయుడుతో పాటు పంపించారు. గోదాము తాళాలు తీసి చీకట్లో.. సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో పరిశీలిస్తే.. గోదాం మొత్తం ఎటువైపు చూసినా తూకం వేసిన రవాణాకు సిద్ధం చేసిన రేషన్‌ బియ్యం బస్తాలే కనిపించాయి. దాదాపు 1,500-1,800లకు పైగా (ఒక్కో బస్తా 50 కిలోల చొప్పున 750-900 క్వింటాళ్లు) ఉంటాయని మహేశ్‌నాయుడు తెలిపారు. గోదాములో అక్రమంగా నిల్వ చేసిన బస్తాలు వీడియో తీసుకొని వీఆర్‌ఓ రాజశేఖర్‌గౌడ్‌, పోలీస్‌ కానిస్టేబుళ్ల సమక్షంలో తాళం వేసి.. రేషన్‌ బియ్యం వీడియోలు సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌కు పంపించారు.

రాత్రికి రాత్రే మాయం

శుక్రవారం అర్ధరాత్రి ఏపీ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహేశ్‌నాయుడు సమక్షంలో వీఆర్‌వో రాజశేఖర్‌గౌడ్‌ తాళం వేసిన గోదామును శనివారం ఉదయం తెరిచారు. అక్రమంగా నిల్వ చేసిన 109 బస్తాలు రేషన్‌ బియ్యం సీజ్‌ చేశామని, 6ఏ కేసు నమోదు చేస్తామని డిప్యూటీ తహసీల్దారు బాబు వివరించారు. అర్ధరాత్రి తనిఖీల్లో 2 వేలకు పైగా బస్తాల రేషన్‌ బియ్యం ఉన్నాయని డైరెక్టర్‌ మహేశ్‌నాయుడు సబ్‌ కలెక్టర్‌కు వీడియోలు పెట్టారు. తెల్లారే సమయానికి 109 బస్తాలే ఉన్నాయి. రాత్రికి రాత్రి రేషన్‌ బియ్యం ఎట్లా మాయమయ్యాయి? దీని వెనుక ఉన్నది ఎవరు? సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశాల మేరకు వెళ్లిన వీఆర్‌ఓ వేసిన తాళం తీసి రేషన్‌ బియ్యం తరలించడం వెనుకు ఆంతర్యమేమిటి..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ హయాంలో ఆదోని కేంద్రంగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మాఫియాను పెంచిపోషించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వైసీపీ నాయకులు కొందరు బీజేపీలో చేరారు. వైసీపీ నుంచి కూటమి పార్టీలో చేరిన మండల స్థాయి ప్రజాప్రతినిధి తనయుడు రేషన్‌ బియ్యం దందా సాగిస్తున్నారనే ఆరోపణులు బలంగా ఉన్నాయి. ఆయనే ఈ భాగోతం నడిపించాడా..? దీని వెనుక మరొకరు ఉన్నారా..? రహస్య గోదాములో భారీ ఎత్తున రేషన్‌ బియ్యం నిల్వలు ఉన్నాయని, అక్కడ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహేశ్‌నాయుడు సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, ఆదోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శ్రీరాం దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు ఏర్పాటు చేయలేదు..? అనే ప్రశ్నలు తెలుత్తున్నాయి.

నాడు బేతంచర్లలో..

నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో వైసీపీ హయాంలో చక్రం తిప్పిన అప్పటి ఓ కీలక మంత్రి సమీప బంధువులకు చెందిన గోదాములో రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహేశ్‌నాయుడు తనిఖీ చేయగా 1,200 బస్తాలు బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. ఆ గోదాం నిర్వాహకులకు రూ.60 లక్షలు ఫైన్‌ వేసినట్లు తెలిసింది. ఆ తరువాత పాణ్యంలో దాడులు చేసి ఒక గోదాంలో 750 బస్తాలు, మరో గోదాంలో 217 బస్తాలు పేదల బియ్యం సీజ్‌ చేశారు. నందికొట్కూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో తనిఖీలు చేస్తే.. వివిధ దాడుల్లో పట్టుబడి సీజ్‌ చేసిన దాదాపు 900 బస్తాలు బియ్యం మాయం చేసినట్లు గుర్తించారు. కర్నూలు జిల్లాలో కర్నూలు రూరల్‌ మండలం పంచలింగాల గ్రామం సమీపంలో పేదల బియ్యం అక్రమ రవాణా చేస్తున్న లారీని సీజ్‌ చేసి 135 బస్తాలు (54 క్వింటాళ్లు) బియ్యం, తుగ్గలి మండలం రాంపల్లి సమీపంలో అక్రమ రవాణా చేస్తున్న లారీ, ఓ కారును సీజ్‌ చేసి 1,100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పోలీసులు సీజ్‌ చేశారు. వెలుగు చూసిన సంఘటనలు కొన్ని. నిఘా కళ్లకు గంతలు కట్టి నెలనెల వందల లారీల రేషన్‌ బియ్యం సరిహద్దులు దాటికి కర్ణాటకకు తరలిపోతున్నాయనే ఆరోపణులు బలంగా ఉన్నాయి.

సివిల్‌ సప్లయ్‌ మంత్రికి ఫిర్యాదు చేస్తాను

మా తనిఖీలో 50 కిలోలు చొప్పున తూకం వేసి రవాణాకు సిద్ధం చేసిన దాదాపు 1,500-1,800 బస్తాలు ఉన్నట్లు గుర్తించాం. తెల్లారాక 109 బస్తాలే ఉన్నాయని డిప్యూటీ తహసీల్దారు బాబు చెప్పారు. రాత్రి వీఆర్‌ఓ సమక్షంలోనే సీజ్‌ చేశాం. దీనిపై సివిల్‌ సప్లయ్‌ శాఖ మంత్రి నాదెండ్ల మనోహన్‌, ఏపీ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ ఎండీ మంజీర్‌ జిలానీసమూన్‌కు ఫిర్యాదు చేస్తాను.

- రమేశ్‌నాయుడు, డైరెక్టర్‌, ఏపీ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌

విచారణ చేయిస్తాం

ఆదోనిలోని ఓ గోదాంలో రహస్యంగా నిల్వ చేసిన 109 బస్తాల రేషన్‌ బియ్యం సీజ్‌ చేసినట్లు మండల అధికారుల నుంచి మాకు సమాచారం వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తాం. అంతకుమంచి మాకు సమాచారం లేదు.

రాజారఘువీర్‌, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి, కర్నూలు

Updated Date - Jun 14 , 2025 | 11:54 PM