విద్యారంగానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:48 PM
కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ. భరత్ అన్నారు.

పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం
ఉస్మానియా కళాశాలలో నూతన భవనాలు ప్రారంభం
మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు అర్బన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి టీజీ. భరత్ అన్నారు. ఉస్మానియా డిగ్రీ కళాశాలలో రూసా నిధులతో నిర్మించిన భవనాలను శనివారం ఆయన ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉస్మానియా కళాశాలలో చదవి, కళాశాలకు మంత్రి హోదాలో రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ 1994-96 మధ్య ఎంఎస్సీ, బీఈడీ పరీక్షలు ఈ కళాశాలలోనే రాశానని తెలిపారు. ఈ కళాశాల పూర్వ విద్యార్ధి అయిన మంత్రి టీజీ భరత్ గదులు ప్రారంభ కార్యక్రమానికి రావడం ఒక అరుదైన అవకాశమన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు ఉస్మానియా కళాశాలలో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అజ్రా జావేద్, ప్రిన్సిపాల్ ఎస్‌ఎస్ ముజ్మామిల్, రూసా ఇన్‌చార్జి ఎస్ గజనీ, ప్రొఫెసర్ మండి అన్వర్, కార్పొరేటర్ కురవ పరమేష్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.