హంద్రీ నీవా కాలువకు గండి
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:19 AM
హంద్రీ నీవా ప్రధాన కాలువ 108.100 కిలోమీటర్ వద్ద గండి పడింది. పత్తికొండ మండల పరిధిలోని పందికోన గ్రామ సమీపంలో గండి పడటానికి పక్కనే ప్రవహిస్తున్న చిన్నవోణివంక ఉధృతే కారణమని అధికారులు చెబుతున్నారు.
పందికోన వద్ద 108.100 కిలోమీటర్ సమీపంలో ..
చిన్నవోణి పొంగి పొర్లడంతో కోతకు గురైన కాలువ గట్టు
కొట్టుకుపోయిన కాలువ నూతన కాంక్రీట్ లైనింగ్
పత్తికొండ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): హంద్రీ నీవా ప్రధాన కాలువ 108.100 కిలోమీటర్ వద్ద గండి పడింది. పత్తికొండ మండల పరిధిలోని పందికోన గ్రామ సమీపంలో గండి పడటానికి పక్కనే ప్రవహిస్తున్న చిన్నవోణివంక ఉధృతే కారణమని అధికారులు చెబుతున్నారు. హంద్రీ నీవా కాలువలో నీటిప్రవాహం లేకపోవడంతో భారీనష్టం తప్పిందని పందికోన గ్రామస్థులు చెబుతున్నారు. కాలువలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు గండిపడి ఉంటే హంద్రీ నీవా నీరు బయటకు వచ్చి పంట పొలాలు మునిగిపోయి తీవ్రనష్టం వాటిల్లేదని వారు చెబుతున్నారు.
గండికి కారణాలు ఏమిటి?
పందికోన అటవీ ప్రాంతంలో కురిసే వాన నీటిని కింది ప్రాంతాలకు తరలించే చిన్నవోణి వంక ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడమే గండికి కారణమని తెలుస్తోంది. వంకకు అటువైపుగా ఉన్న పొలాలకు దారి ఏర్పాటు చేసుకోవడానికి రైతులు వేసుకున్న మట్టి దారులే వంకలో నీటి ప్రవాహానికి అడ్డంగా మారాయి. దీనికి తోడు చిన్నవోణిలో ముళ్లకంపలు పెరిగిపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల వంకకు చేరిన నీరు వెళ్లడానికి దారిలేక పక్కనే ఉన్న హంద్రీనీవా కాలువ గట్టును కోతకు గురిచేయడంతో గండి పడినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా చిన్నవోణి ప్రవాహం వల్ల పదేళ్లక్రితం కూడా ఈ ప్రాంతంలో హంద్రీ నీవా కాలువకు గండిపడినట్లు గ్రామస్థులు తెలిపారు.
కాలువ లైనింగ్ నాణ్యతపై అనుమానాలు
పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ 87 కిలోమీటర్లు ఉంది. కాలువ విస్తరణ పనులు ఇప్పటికి 40శాతం మేర పూర్తి చేసి నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు నీటి ప్రవాహం ధాటికి కాలువ కోతకు గురికాకుండా 100 ఎంఎం మందంలో ఏర్పాటు చేస్తున్న కాంక్రీట్ సైడ్‌వాల్ పనులు 10శాతం పూర్తిచేసినట్లు వారు చెబుతున్నారు. అయితే కాలువ కోతకు గురికాకుండా 100 ఎంఎంతో నూతనంగా కాలువకు రెండు వైపుల నిర్మిస్తున్న సైడ్‌వాల్ నాణ్యతపై గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నవంక ప్రవాహం వల్ల ఏర్పడ్డ గండికి 100ఎంఎంతో కాలువ భద్రతకు నిర్మించిన సైడ్‌వాల్ కొట్టుకు పోయిందని, ఇక హంద్రీనీవా నీటి ప్రవాహానికి సైడ్‌వాల్ తట్టుకుం టుందా అనే అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు.
చిన్నవోణి ఆక్రమణల వల్లే గండి
హంద్రీనీవా గతంలో 10.5 మీటర్లు వెడల్పుతో ఉండేది. దాన్ని 19.55 మీటర్లకు విస్తీర్ణం పెంచుతూ ప్రభుత్వం ఈ ఏడాది పనులు చేపట్టింది. కాలువ విస్తీర్ణం పనులు 40శాతం పూర్తికాగా లైనింగ్ పనులు 10శా తం పూర్తిచేశాం. పందికోన సమీపంలో 108.100 కిలోమీటర్ వద్ద ఏర్పడ్డ గండికి పక్కనే ప్రవహిస్తున్న చిన్నవోణి వంక ప్రవాహమే కారణంగా గుర్తించాం. వంకపై రైతులు పొలాలకు వెళ్లేందుకు దారులు ఏర్పాటు చేసుకోవడానికి ఆక్రమించారు. దీంతో నీరు వెళ్ల్లేందుకు దారిలేక కాలువను కోతకు గురిచేసింది. - ప్రసాద్, డీఈ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్