Kurnool District : కర్నూలు కాంగ్రెస్‌లో ‘కార్యాలయ కబ్జా’ కల్లోలం!
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:34 AM
కర్నూలు జిల్లా కాంగ్రె్‌సలో ‘పార్టీ కార్యాలయం కబ్జా’ వ్యవహారం కల్లోలం రేపుతోంది. కొండారెడ్డి బురుజు సమీపంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం (కళా వెంకట్రావ్ భవన్) ఉంటుంది. ఆఫీస్ ఉండే 33 సెంట్ల స్థలం విలువ రూ.16 కోట్లు పైమాటే. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు పరిగెల

కళావెంకటరావు భవన్ పేరిట
ప్రైవేట్ సొసైటీ రిజిస్ట్రేషన్ అధిష్ఠానం అనుమతి లేకుండానే వ్యవహారం
కబ్జా కుట్రలో భాగమే: నంద్యాల డీసీసీ అధ్యక్షుడు
కర్నూలు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కాంగ్రె్‌సలో ‘పార్టీ కార్యాలయం కబ్జా’ వ్యవహారం కల్లోలం రేపుతోంది. కొండారెడ్డి బురుజు సమీపంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం (కళా వెంకట్రావ్ భవన్) ఉంటుంది. ఆఫీస్ ఉండే 33 సెంట్ల స్థలం విలువ రూ.16 కోట్లు పైమాటే. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణ అధ్యక్షుడిగా ఏడుగురితో ప్రైవేటు సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించడం ఆ పార్టీలో కల్లోలానికి కారణమైంది. దీనిపై విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశించారు. దీంతో ఆ పార్టీ నేతలు గురువారం కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అటెండర్, స్వీపర్లకు సొసైటీలో పదవులు!
ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్న కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో కాంగ్రె్‌సలో చేరారు. గత ఐదు నెలలుగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. డీసీసీ కార్యాలయ పరిధిలోని 15 దుకాణాల ద్వారా నెలకు రూ.1.80 లక్షలు ఆదాయం వస్తోంది. ఏఐసీసీ, పీసీసీ అనుమతులు లేకుండా, జిల్లా కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేయకుండానే ప్రైవేటు సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడం, ఆఫీసు ఆస్తులను దాని పరిధిలోకి తీసుకొచ్చి కబ్జా చేయాలనే కుట్రలో భాగంగానే మురళీకృష్ణ ఈ ఎత్తుగడ వేసినట్లు పార్టీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. కార్యాలయంలో పనిచేసే అటెండర్, స్వీపర్లకు కార్యదర్శి, ట్రెజరర్ వంటి కీలక పదవులు ఇస్తూ రిజిస్ట్రేషన్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. కబ్జా ఆరోపణలపై విచారణ బాధ్యతలను షర్మిల ఆ పార్టీ నేత గిడుగు రుద్రరాజుకు అప్పగించారు. మురళీకృష్ణ పార్టీ ఆస్తులను సొంతవిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని, అక్రమాలకు పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిందని షర్మిల పేర్కొన్నారు.
కబ్జా కుట్రలో భాగమే..: లక్ష్మినరసింహ
కబ్జా కుట్రలో భాగంగానే మురళీకృష్ణ సొసైటీ రిజిస్ట్రేషన్ చేశారని నంద్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జె.లక్ష్మినరసింహ యాదవ్, పలువురు ఇతర నేతలు గురువారం ఆరోపించారు. కాంగ్రెస్ ఆస్తులకు తానే యాజమానిగా ప్రకటించుకునే కుట్ర పన్నారని, గుమాస్తా, స్వీపర్లను సొసైటీలో సభ్యులుగా చేర్చారన్నారు. పీసీసీ, డీసీసీలకు సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, సొసైటీ రిజిస్ట్రేషన్ రద్దుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఈకేవైసీ కోసమే సొసైటీ: మురళీకృష్ణ
ఈ కేవైసీ కోసమే సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించానని, ఆ సొసైటీని రద్దు చేసుకున్నామని మురళీకృష్ణ పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పరువు తీసేలా కొందరు వ్యవహరిస్తున్నారన్నారు. తన కుటుంబం ఆర్థికంగా బాగుందని, కాంగ్రెస్ ఆస్తులు తనకు అవసరం లేదని తెలిపారు. గతేడాది సెప్టెంబరు 14న జిల్లా కాంగ్రెస్ కమిటీ తీర్మానం మేరకే సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించామని తెలిపారు.