Share News

బదిలీ వార్‌

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:51 AM

జిల్లా పరిషతలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందా? ఈ ప్రభావం ఇటీవల జరిగిన ఉద్యోగుల బదిలీలపై పడిందా? నేరుగా బదిలీలు చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కౌన్సెలింగ్‌ పద్ధతిలోనే జరగాలని జడ్పీ సీఈవో పట్టుబట్టిన నేపథ్యంలో వార్‌ మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

బదిలీ వార్‌
మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయం

జడ్పీ చైర్‌పర్సన్‌ వర్సెస్‌ సీఈవో

ఇష్టానుసారంగా జరిగిన ఉద్యోగుల బదిలీలు

బదిలీ అయినా రిలీవ్‌ కాని వారెందరో..!

సస్పెండైన వారికి పోస్టింగ్‌.. మొదలైన విభేదాలు

ముడుపులు భారీగా అందాయన్న ఆరోపణలు

సంతకాలు చేయనంటున్న చైర్‌పర్సన్‌

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జడ్పీ చైర్‌పర్సన్‌, సీఈవో విభేదాల నడుమ ఈనెల 9న 104 మంది ఉద్యోగుల బదిలీలు జరిగాయి. వీరిలో ఎంపీడీవోలు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, ఇతర విభాగాల ఉద్యోగులు ఉన్నారు. బదిలీలు జరిగినా, వారిలో చాలామంది ఇంతవరకు రిలీవ్‌ కాలేదు. కౌన్సెలింగ్‌కు ముందే కొంతమంది ఉద్యోగులకు పదోన్నతి ఇచ్చి కీలక ప్రాంతాలకు బదిలీ చేయటం కూడా వివాదాస్పదంగా మారింది.

బదిలీ జరిగినా రిలీవ్‌ కాని ఉద్యోగులు

జిల్లా పరిషత యాజమాన్యంలో పనిచేసే ఉద్యోగులకు ఈ నెల 9న బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బదిలీ కోరుకున్న ఉద్యోగులు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తెచ్చుకున్నారు. శాసనసభ్యులు కొంతమంది ఉద్యోగులను తమ నియోజకవర్గంలో వద్దని కూడా లేఖలు ఇచ్చారు. వీటిలో మండల పరిషతలలో పనిచేసే ఎంపీడీవోలు, ఏవోలు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రజాప్రతినిధులు వద్దని సిఫార్సు చేసిన ఉద్యోగులను వేరే నియోజకవర్గాలకు బదిలీ చేసి, ఖాళీ అయిన స్థానాల్లో ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారిని నియమించలేదు. జడ్పీ అధికారుల చిత్తానుసారం వేరే ఉద్యోగులను మండలాలకు బదిలీ చేశారు. దీంతో ఈ బదిలీల జాబితాను పరిశీలించిన ఎమ్మెల్యేలు, మంత్రులు తాము సూచించిన వారిని కాకుండా వేరే ఉద్యోగులను బదిలీ చేయటంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో బదిలీ అయిన ఉద్యోగులు వారికి కేటాయించిన మండలాల్లో చేరేందుకు అవకాశం లేకుండాపోయింది. 18 రోజులుగా ఉద్యోగులు తాము ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

సంతకం పెట్టనన్న జడ్పీ చైర్‌పర్సన్‌

ఇష్టానుసారంగా బదిలీలు చేస్తే ఉత్తర్వులపై సంతకం పెట్టేది లేదని కౌన్సెలింగ్‌ జరిగే సమయంలోనే చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక చెప్పారు. అయినప్పటికీ జడ్పీ సీఈవో బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఈ బదిలీల అనంతరం పంచాయతీరాజ్‌ విభాగ కమిషనర్‌ ఆగిరిపల్లి మండలం పర్యటనకు రాగా, అక్కడకు వెళ్లిన జడ్పీ సీఈవో అన్ని విషయాలను ఆయనకు వివరించారు. చైర్‌పర్సన్‌ సంతకం లేకున్నా.. ఆ ఫైలును తనకు పంపాలని కమిషనర్‌ చెప్పినట్లు ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.

సస్పెండ్‌ అయిన ఇద్దరు ఏవోలకు పోస్టింగులు

ఇసుకకు సంబంధించిన వివరాలు సక్రమంగా చూపకపోవడం, ఇతరత్రా ఆరోపణలపై కంచికచర్ల మండల పరిషత కార్యాలయంలో పనిచేస్తున్న ఏవోను గతంలో సస్పెండ్‌ చేశారు. చాట్రాయి మండల పరిషత కార్యాలయంలో ఏవోగా పనిచేసే అధికారి ఒక్కరోజు ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఉండి మండల పరిషత నిధులు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు డ్రా చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో విచారణ చేసి అతడ్ని కూడా సస్పెండ్‌ చేశారు. ఈ ఇద్దరు ఏవోలకు ఇటీవల వేరే మండలాల్లో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ బదిలీలను చైౖర్‌పర్సన్‌ దృష్టికి తీసుకురాకుండానే నిర్వహించారు. తన దృష్టికి రాకుండా బదిలీ ఎలా చేశారని ఆమె ఫైల్‌పై సంతకం చేయలేదు. ఈ ఇద్దరు ఏవోలకు పోస్టింగ్‌లు ఇచ్చే విషయంలో నగదు చేతులు మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరెవరికి ఎంత నగదు ఇచ్చారో లిఖితపూర్వకంగా రాసిస్తే, విచారణ అనంతరం సంతకం పెడతానని చైర్‌పర్సన్‌ చెబుతున్నారు. అలాగే, కలిదిండి, రెడ్డిగూడెం మండలాల్లో ఖాళీలున్నా ఉద్యోగులను బదిలీ చేయలేదు. పమిడిముక్కల, మొవ్వ, విజయవాడ రూరల్‌ మండలాల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, ఇతర విభాగాల ఉద్యోగులు వేరే మండలాలకు బదిలీ అయినా వారిని రిలీవ్‌ చేయలేదు. ఈ పరిణామాలన్నీ ఎటువైపునకు దారితీస్తాయనే అంశంపై జడ్పీలో చర్చ జరుగుతోంది.

Updated Date - Jun 28 , 2025 | 12:51 AM