నగ..రవనం
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:41 AM
మూలపాడు నగరవనంతో పాటు కొండపల్లి రిజర్వు ఫారెస్టు అందాలను వీక్షించేందుకు జిప్‌లైన్ అడ్వెంచర్ రెడీ అవుతోంది. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సౌజన్యంతో పర్యాటక, అటవీశాఖ అధికారులు దీనిని ఏర్పాటు చేశారు.
మూలపాడు నగరవనంలో జిప్‌లైన్ అడ్వెంచర్
ట్రయల్ రన్ సక్సెస్.. డిసెంబరుకు అందుబాటులోకి..
దొంగమర్ల బావి వద్దకు వెళ్లేందుకు రెండు సఫారీలు
(ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం) : మూలపాడు నగరవనంతో పాటు కొండపల్లి రిజర్వు ఫారెస్టు అందాలను వీక్షించేందుకు జిప్‌లైన్ అడ్వెంచర్ రెడీ అవుతోంది. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సౌజన్యంతో పర్యాటక, అటవీశాఖ అధికారులు దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నగరవనంలోని రెండో గేటుకు 50 మీటర్ల ముందు ఉన్న మొదటి వ్యూ పాయింట్ కుడి, ఎడమ కొండల మధ్య ఈ జిప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఎడమ నుంచి కుడివైపు వరకు ఉన్న ఎత్తయిన కొండ మీదకు 170 మీటర్లు, కుడి నుంచి ఎడమ వరకు ఉన్న మరో ఎత్తయిన కొండ మీదకు 180 మీటర్లు జిప్‌లైన్ ఏర్పాటు చేశారు. మొత్తం కలిపి 350 మీటర్ల మేర ప్రయాణం చేయవచ్చు. నగరవనంలోని అందమైన ప్రదేశాలతో పాటు దట్టమైన, సుందరమైన కొండపల్లి రిజర్వు ఫారెస్టు అందాలను వీక్షించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. డిసెంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సఫారీ వాహనాలు సిద్ధం
నగరవనం నుంచి కొండపల్లి రిజర్వు ఫారెస్టులోని దొంగమర్ల బావితో పాటు అక్కడ ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, పలు జలపాతాలను పర్యాటకులు కుటుంబ సమేతంగా, స్నేహితులతో కలిసి వీక్షించేందుకు మొదటి గేటు వద్ద రెండు సఫారీ వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. అక్కడి నుంచి దొంగమర్ల బావి ప్రాంతం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అధిక వర్షాల వల్ల జలపాతాలు రహదారిపై పారడంతో ఘాట్‌రోడ్డు బురదమయంగా మారింది. పర్యాటకులు సొంత వాహనాల్లో వీల్లేని పరిస్థితి. పర్యాటకుల సౌలభ్యం కోసం రెండు సఫారీ వాహనాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. ఒక్కోదానిలో సుమారు 15 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. ఇప్పటికే నేరేడు వనంలో సైకిల్ ట్రాక్స్ ఏర్పాటుచేసి పర్యాటకులకు ఆరు సైకిళ్లను సిద్ధంగా ఉంచారు.