Share News

అజ్ఞాతం వీడి..

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:47 AM

అనారోగ్య కారణాలంటూ గుడివాడకు కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్న మాజీమంత్రి, వైసీపీ నేత కొడాలి నాని శుక్రవారం ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. నాని ఆరోగ్యం విషమంగా ఉంద ని, హార్ట్‌రేట్‌ సగానికి సగం పడిపోయిందంటూ వైసీపీ నాయకులు చేసిన ప్రచారం తర్వాత ఆయనేం అయిపోయారోననే చర్చ జరిగింది.

అజ్ఞాతం వీడి..
గుడివాడ కోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలతో ఉత్సాహంగా మాజీమంత్రి కొడాలి నాని

గుడివాడకు వచ్చిన వైసీపీ నేత కొడాలి నాని

అనారోగ్యంపై ఇన్నాళ్ల ప్రచారం ఉత్తుత్తిదేనా?

గుండె వ్యాధి, పరిస్థితి విషమమని ప్రచారం

కానీ, హుషారుగానే వచ్చిన మాజీమంత్రి

గుడివాడ కోర్టు వద్ద నాయకులతో హడావిడి

కార్యకర్తలతో ఉత్సాహంగానే సెల్ఫీలు

అరెస్టు నుంచి తప్పుకొనేందుకే అతి ప్రచారమా?

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అనారోగ్య కారణాలంటూ గుడివాడకు కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్న మాజీమంత్రి, వైసీపీ నేత కొడాలి నాని శుక్రవారం ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. నాని ఆరోగ్యం విషమంగా ఉంద ని, హార్ట్‌రేట్‌ సగానికి సగం పడిపోయిందంటూ వైసీపీ నాయకులు చేసిన ప్రచారం తర్వాత ఆయనేం అయిపోయారోననే చర్చ జరిగింది. చాతీకి పట్టీతో ఉన్నప్పటికీ నడక, నడతలో ఏమాత్రం స్పీడ్‌ తగ్గలేదు. గుడివాడ కోర్టు ప్రాంగణం ముందు కారు దిగిన కొడాలి నాని వేగంగా నడుచుకుంటూ కోర్టులోకి వెళ్లిపోయారు. ఎవరి సాయం లేకుండానే కోర్టు మెట్లను అవలీలగా ఎక్కేశారు.

కావాలనే ప్రచారం చేశారా?

అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసం ఓ పథకం ప్రకారమే వైసీపీ నాయకులు.. కొడాలి నాని ఆరోగ్యం బాగోలేదని, హార్ట్‌ పంపింగ్‌ రేటు 60 నుంచి 30కి పడిపోయిందని ప్రచారం చేశారు. నియోజకవర్గానికి మరో నాయకుడిని చూసుకోమని కొడాలి నాని అధిష్ఠానానికి చెప్పారని, ఆయనకు అమెరికాలో అత్యున్నత వైద్యం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారాలన్నీ నిజమేనేమోనని చాలామంది ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ముంబయిలో ఆయన గుండెకు శస్త్రచికిత్స చేశాక ఈ ప్రచారానికి బలం చేకూరింది. నాని ఇప్పట్లో గుడివాడ రారని, వస్తే ఆయనకు ఇన్‌ ఫెక్షన్లు సోకే అవకాశం ఉంద ని స్థానిక నాయకులు ప్రచారం చేశారు. హైదరాబాద్‌లో ఆయన్ను కలిసేందుకు కూడా అనుమతించలేదు. అయితే, శుక్రవారం గుడివాడ వచ్చిన ఆయన్ను చూసి నియోజకవర్గ ప్రజలు షాక్‌ అయ్యారు. కారు నుంచి దిగుతూ వేగంగా ముందుకు కదలటం, మెట్లను కూడా అవలీలగా ఎక్కటంతో ఆయన ఆరోగ్యంపై అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కాగా, ఆయన్ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారితో నాని ఉత్సాహంగా మాట్లాడటంతో పాటు ఆయన సెల్ఫీలు కూడా దిగారు. దీనినిబట్టి వైసీపీ నాయకులు కావాలని ప్రచారం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

పోలీసులు అలెర్ట్‌

కొడాలి నాని గుడివాడకు రావటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తొలుత ఆయన ఇంటికి చేరుకుని, ఆ తర్వాత కోర్టుకు వెళ్లడంతో ఆయన కదలికలపై నిఘా పెట్టారు. కొడాలి నాని, ఆయన అనుచరులపై ఉన్న కేసుల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడికి పాల్పడ్డారన్న కేసులో పోలీసులు విచారణ చేపట్టడంతో కొడాలి నాని హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. స్థానిక కోర్టులో వేయాలని హైకోర్టు సూచించటంతో ఆయన శుక్రవారం గుడివాడ వచ్చారు.

Updated Date - Jun 28 , 2025 | 12:47 AM