ఆట మొదలైంది
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:07 AM
అంతర్జాతీయ క్రీడా పోటీల సంరంభం ఓవైపు.. జాతీయ క్రీడాకారుల సమరోత్సాహం మరోవైపు.. యోనెక్స్ సన్‌రైజ్ షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ పోటీల ప్రారంభోత్సవంతో నగరం కొత్తకళను సంతరించుకుంది. వారం పాటు జరిగే ఈ పోటీలకు సోమవారం అంకురార్పణ జరగడం, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత వంటి దిగ్గజాలు రావడంతో క్రీడోత్సాహం ఆకాశాన్నంటింది.
యోనెక్స్ సన్‌రైజ్ బ్యాడ్మింటన్ జాతీయ టోర్నీ ప్రారంభం
వారం పాటు జరిగే పోటీలకు 33 రాషా్ట్రలు, ఆరు సంస్థల ప్రాతినిధ్యం
500 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల రాక
మెరిసిన స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత
రాష్ట్ర మహిళల జట్టును ఫైనల్స్‌కు చేర్చిన పీవీ సింధు
తొలిరోజు హోరాహోరీగా ఇంటర్ జోన్ టీం చాంపియన్‌షిప్
నేటి నుంచి 87వ జాతీయ పోటీలు మొదలు
ఈనెల 28న ముగింపు ఉత్సవాలకు సీఎం చంద్రబాబు
విజయవాడ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : యోనెక్స్ సన్‌రైజ్ షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ పోటీలకు నగరం ఆతిథ్యమిచ్చింది. సీనియర్ సీ్త్ర, పురుషుల విభాగంలో ఏడు రోజుల పాటు జరిగే ఈ పోటీలు నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో సోమవారం ప్రారంభమయ్యాయి. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (ఏపీబీఏ) నిర్వహిస్తోంది. తొలిరోజు 78వ టీం చాంపియన్‌షిప్ విభాగంలో పోటీలు జరిగాయి. మంగళవారం నుంచి 87వ జాతీయ పోటీలు ప్రారంభమవుతాయి. 33 రాషా్ట్రలకు చెందిన ఆరు భారత సంస్థల జట్లు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన 500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. పోటీలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు. స్టార్ షెట్లర్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత ఈ పోటీల్లో పాల్గొన్నారు. తొలిరోజు హోరాహోరీగా జరిగిన పోటీలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండీ భరణి తిలకించారు. టీం చాంపియన్‌షిప్ పోటీలు క్వార్టర్స్‌తోనే ప్రారంభం కావడంతో సెమీస్‌లో ఆశలను నిలుపుకొనేందుకు జట్లు కష్టపడ్డాయి. క్వార్టర్స్‌లో ఐదు మ్యాచ్‌లకు మూడు గెలిస్తేనే సెమీస్‌కు ప్రవేశం ఉన్న నేపథ్యంలో సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో క్రీడాకారులు చెమటోడ్చారు.
మెరిసిన సింధు, శ్రీకాంత
రాషా్ట్రనికి చెందిన స్టార్ షట్లర్ పీవీ సింధు, అర్జున అవార్డీ కిడాంబి శ్రీకాంత సత్తా చాటారు. అంతర్జాతీయ, ఒలింపిక్ పోటీల్లో వీరు ఆడే తీరును ఇప్పటి వరకు కేవలం మాధ్యమాల్లోనే చూశామని, నేరుగా చూడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు తెలిపారు. సింధు సింగిల్స్ ఆటతోనే టీం చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి మధ్యాహ్నం డబుల్స్ విభాగంలో మెరిసి ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టును సెమీ ఫైనల్స్‌కు తీసుకెళ్లింది. మరో మహిళల సింగిల్స్‌లో విజయవాడ క్రీడాకారిణి టి.సూర్యచరిష్మ సైతం విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత సైతం టీం చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో తమిళనాడు టీమ్‌తో తలపడ్డాడు. టీం చాంపియన్‌షిప్ విభాగంలో స్టార్ షట్లర్ పీవీ సింధు మెరిసింది. డ్రా ప్రకారం తొలిగా మహిళల సింగిల్స్ విభాగంలో ఏపీ, ఉత్తరాఖండ్ తలపడ్డాయి. ఏపీకి ప్రాతినిధ్యం వహించిన సింధు, సూర్యచరిష్మ.. ప్రత్యర్థి ఉత్తరాఖండ్ క్రీడాకారులపై పైచేయి సాధించారు. మధ్యాహ్నం జరిగిన డబుల్స్‌లో సింధు-కవిప్రియ జోడి 21-11, 21-17 తేడాతో ఉత్తరాఖండ్ జోడిని ఓడించారు. 3-0 తేడాతో ప్రత్యర్థిపై నెగ్గిన ఏపీ టీం సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. సెమీ ఫైనల్‌లో గుజరాత జట్టుతో సింధు తలపడింది. పురుషుల విభాగంలో ఏపీ జట్టు తమిళనాడు చేతిలో ఓడి క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో అర్జున అవార్డీ కిడాంబి శ్రీకాంత ఏపీకి ప్రాతినిధ్యం వహించారు.
పకడ్బందీ ఏర్పాట్లు
దేశవ్యాప్తంగా ఉన్న షటిల్ దిగ్గజాలు హాజరైన ఈ పోటీలకు ఏపీబీఏ ప్రతినిధులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న 100 మంది రిఫరీల కనుసన్నల్లో పోటీలు జరుగుతున్నాయి. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. క్రీడా ప్రాంగణంతో పాటు పరిసరాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. టీం చాంపియన్‌షిప్‌కు దేశంలోని దక్షిణం, పశ్చిమం, తూర్పు, ఉత్తరం, ఈశాన్యం, సెంట్రల్ జోన్‌లు ప్రాతినిధ్యం వహించాయి. 87వ సీనియర్ నేషనల్స్‌కు 33 రాషా్ట్రల జట్లతో పాటు ఇండియన్ రైల్వేస్, భారత పెట్రోలియం కార్పొరేషన్, జీవిత భీమా సంస్థ (ఎల్‌ఐసీ), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), కంపో్ట్రలర్ ఆడిట్ జనరల్ (సీఏజీ) ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
అట్టహాసంగా ప్రారంభం
పోటీలను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవినాయుడు, ఎండీ భరణి, డైరెక్టర్ సంతోష్, ఏపీబీఏ అధ్యక్షుడు ద్వారకానాథ్, పి.అంకమ్మచౌదరి, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా డీఎస్‌డీవో కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ త్వరలో రాషా్ట్రనికి స్పోర్ట్స్ యూనివర్శిటీ రానుందన్నారు. దేశానికి కోచ్‌లను తయారుచేసే రాష్ట్రంగా ఏపీ మారబోతుందన్నారు. మరిన్ని జాతీయ స్థాయి పోటీలు విజయవాడలో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు శాప్ కృషి చేయాలన్నారు. బ్యాడ్మింటన్ జాతీయ పోటీల నిర్వహణ విజయవాడలో జరిగేందుకు కృషిచేసిన ఏపీబీఏ ప్రతినిధులను ఎంపీ అభినందించారు. ముగింపు వేడుకలకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని వేదికపై ప్రకటించారు.