21 వరకు బీఆర్టీఎస్ రోడ్డులో ‘యోగాంధ్ర’
ABN , Publish Date - May 23 , 2025 | 01:45 AM
విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
రోజూ ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమాలు
విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపు
కలెక్టరేట్, మే 22(ఆంధ్రజ్యోతి): మాసోత్సవాల్లో భాగంగా యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు నిర్వహిస్తోందని, అందులో భాగంగా విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీఆర్టీఎ్‌స రోడ్డు సత్యనారాయణపురం వద్ద నిర్వహించిన ప్రత్యేక యోగాభ్యాస కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని యోగాసనాలను సాధన చేశారు. ఇతివృత్తం ఆధారిత యోగా సెషన్లతో పాటు వివిధ పర్యాటక ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. ట్రైనర్లు, పౌరుల రిజిస్ర్టేషన్‌కు ఏర్పాటు చేస్తున్నామని, ఈనెల పాటు యోగాసనాల అభ్యసనతో పాటు ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కార్, ప్రాణాయామ ప్రదర్శన, గ్రూప్ యోగా, ఆర్టిస్టిక్ యోగా...ఇలా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథరెడ్డి, ఇన్‌చార్జి మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్లు రమ్య కీర్తన, కె.ప్రభుదాస్, కె.షమ్మీ పాల్గొన్నారు.