Share News

హైడ్రామా..!

ABN , Publish Date - May 21 , 2025 | 12:51 AM

తిరువూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక రద్దే లక్ష్యంగా వైసీపీ డబుల్‌ గేమ్‌ ఆడింది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లను బయటకు రానీయకుండా నగరంలోని ఓ హోటల్‌లో దాచి ఉంచిన నాయకులు.. తమ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పోలీసులు అమలు చేయట్లేదంటూ మంగళవారం హైకోర్టులో కేసు వేసి విషయాన్ని పక్కదారి పట్టించారు. ఓవైపు ఎన్నిక జరగనివ్వట్లేదని ఆరోపిస్తూనే, మరోవైపు ఎన్నిక రద్దయ్యేలా మైండ్‌గేమ్‌ ఆడారు.

హైడ్రామా..!
వైసీపీ కౌన్సిలర్లను నగరం నుంచి తిరువూరు పంపిస్తున్న పోలీసులు

తిరువూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో వైసీపీ మైండ్‌గేమ్‌

ఎన్నిక రద్దు కావడానికి శతవిధాలా ప్రయత్నాలు

వైసీపీ కౌన్సిలర్లను విజయవాడలో దాచి కట్టుకథలు

పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఈసీకి ఫిర్యాదు

ఈసీ ఆదేశాలు పట్టించుకోవట్లేదంటూ హైకోర్టులో కేసు

వైసీపీ నేత అవినాశ్‌ ఆధ్వర్యంలో తిరువూరులో హడావిడి

ఎక్కడికక్కడ అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

ఈ తతంగంతో ముగిసిన ఎన్నిక సమయం.. రద్దు

చివరి నిమిషంలో వైసీపీ కౌన్సిలర్ల సమాచారం లీక్‌

ఎస్కార్టుతో తిరువూరు తరలించిన పోలీసులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : తిరువూరు మున్సిపాలిటీలో సంఖ్యాపరంగా వైసీపీకి-17, టీడీపీకి-3 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే, వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీకి టచ్‌లోకి వచ్చారు. దీంతో వైసీపీ బలం 12కు పడిపోయింది. మరో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు బయటకు రాకపోయినా టీడీపీకే మద్దతు ప్రకటిస్తామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో టచ్‌లో ఉన్నారు. దీంతో వైసీపీకి పదిమంది మద్దతు మాత్రమే ఉంది. ఈ పదిమందిలో ఒక కౌన్సిలర్‌ అమెరికాలో ఉన్నారు. ఎన్నికకు రాలేదు. దీంతో ఆ పార్టీ బలం 9. టీడీపీ బలం.. ముగ్గురు కౌన్సిలర్లతో పాటు మద్దతు వచ్చిన ఐదుగురితో కలిపి మొత్తం 8కి చేరింది. మరో ఇద్దరు సభ్యులు టచ్‌లో ఉండటంతో టీడీపీకి 11 మంది సభ్యుల మద్దతు లభించినట్టైంది. ఫలితంగా తిరువూరు మున్సిపల్‌ పీఠం టీడీపీ వశమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఎన్నికను నిలుపుదల చేయాలని వైసీపీ నాయకులు మైండ్‌గేమ్‌ ఆడారు. సమావేశం ఉంది.. రమ్మనిచెప్పి కౌన్సిలర్లకు ఆహ్వానం పలికి, నగరంలోని ఓ హోటల్‌లో ఉంచారు. వారి సెల్‌ఫోన్లు తీసుకుని మరీ కమ్యూనికేషన్‌ లేకుండా చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో టచ్‌లోకి వచ్చిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఇక్కడే ఉండిపోయారు.

నిన్న అలా : తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను టీడీపీ నాయకులు పోలీసుల సహాయంతో అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నాయకులు సోమవారం డ్రామా సృష్టించారు. ఎన్నికల సంఘం అధికారిణి నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని, వారిని కౌన్సిల్‌ లోపలి వరకు పోలీసు భద్రత నడుమ తీసుకెళ్లాలని ఆమె సోమవారం ఉద యమే ఆదేశాలిచ్చారు. కానీ, సోమవారం వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికకు రాలేదు. దీంతో కోరం లేక ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. కౌన్సిలర్లు అందరినీ విజయవాడలోనే ఓ హోటల్‌లో ఉంచి, ఏమీ తెలియనట్టుగా సోమవారమే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ తిరువూరు వెళ్లి హడావిడి చేశారు.

నేడు ఇలా : దేవినేని అవినాశ్‌ మంగళవారం మరో ఎత్తుగడ వేశారు. ఎన్నికల సంఘం అధికారిణి నీలం సాహ్ని ఆదేశాలను పోలీసులు అమలు చేయలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఓవైపు హైకోర్టులో పిటిషన్‌ వేస్తూనే, మరోవైపు నగరంలోని శిబిరంలో కౌన్సిలర్లను బయటకు రానీయకుండా చూశారు.

తిరువూరులో ఉద్రిక్తత

ఓవైపు విజయవాడలో కౌన్సిలర్లను దాచి ఉంచిన దేవినేని అవినాశ్‌.. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, మరికొందరు అనుచరులతో కలిసి మంగళవారం తిరువూరు బయల్దేరారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారన్న కసి ఒకవైపు, ఎన్నిక సందర్భంగా అల్లర్లు సృష్టించటానికి వస్తున్నాడన్న కసి మరోవైపు.. కలగలసి టీడీపీ శ్రేణులు అవినాశ్‌ తిరువూరు రాకుండా అడ్డుకున్నాయి. బాడవ టోల్‌ప్లాజా వద్ద ఆ పార్టీ నాయకులు కాపు కాశారు. ఈ విషయాన్ని పసిగట్టిన అవినాశ్‌.. రెడ్డిగూడెం మీదుగా తిరువూరు వెళ్లే ప్రయత్నం చేసినా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ తతంగంతో ఎన్నిక సమయం ముగిసిపోయింది. ఎన్నిక సమయం ముగిసే వరకు విజయవాడలో దాచి ఉంచిన వైసీపీ కౌన్సిలర్లు.. తిరువూరులోని కౌన్సిల్‌కు రాలేదు. హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలతో వైసీపీ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులు విచారణ చేయగా, విజయవాడలో ఉన్నారని తెలిసింది. ఎన్నిక ముగిసే సమయానికి ఫలానా హోటల్‌లో ఉన్నారంటూ అవినాశ్‌ వర్గీయులు సమాచారాన్ని లీక్‌ చేశారు. దీంతో పోలీసులు ఆ హోటల్‌కు వచ్చి వైసీపీ కౌన్సిలర్లను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అప్పటికే ఎన్నికకు గడువు ముగియటం, ఎన్నిక రద్దు కావటంతో ఎస్కార్టుతో ఒక బస్సులో వారిని తిరువూరు తీసుకెళ్లారు.

Updated Date - May 21 , 2025 | 12:51 AM