స్థాయి మరిచారా?
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:35 AM
జిల్లాలో వైసీపీ ప్రజాప్రతినిధుల పోకడ వివాదాస్పదంగా మారింది. రైతులు, ప్రజల సమస్యలపై గళమెత్తాల్సిన వైసీపీ ప్రజాప్రతినిధులు జడ్పీ సర్వసభ్య సమావేశాలను వాకౌట్ చేయడం, స్థాయీసంఘాల సమావేశాలకు గైర్హాజరుకావడం ఇటీవల రివాజుగా మారింది. మే 25న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సభ్యులు తమకు గౌరవ వేతనం ఇవ్వడం లేదనే కారణంతో సమావేశం నుంచి వాకౌట్ చేసి నిరసన తెలిపారు. శుక్రవారం జరగాల్సిన సమావేశానికీ గైర్హాజరయ్యారు. జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారనే కారణం చూపి చైర్‌పర్సన్ సహా సభ్యులు డుమ్మాకొట్టారు. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన అధికారులు కోరం లేక సమావేశాన్ని వాయిదా వేశారు.
స్థాయీసంఘ సమావేశానికి వైసీపీ జడ్పీటీసీ సభ్యుల డుమ్మా
జడ్పీ చైర్‌పర్సన్ సహా 45 మంది వైసీపీ సభ్యులు గైర్హాజరు
కోరం లేక సమావేశాన్ని వాయిదా వేసిన అధికారులు
ఖాళీగా కూర్చుని వెళ్లిపోయిన ఉమ్మడి జిల్లా యంత్రాంగం
చైర్‌పర్సన్ హారికపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారనే సాకు
పరిష్కారానికి నోచుకోని రైతులు, ప్రజల సమస్యలు
ఆంద్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నంలోని జడ్పీ సమావేశపు హాల్లో జరిగే జడ్పీ సర్వసభ్య సమావేశాలకు మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, వివిధ కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లు హాజరవుతారు. జిల్లాలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించి, అవసరమైతే తీర్మానంచేసి ప్రభుత్వానికి పంపుతారు. జిల్లాస్థాయి అధికారులు కూడా ఈ సమావేశానికి హజరవుతారు. కాబట్టి కొన్ని సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. జడ్పీ సర్వసభ్య సమావేశం మాదిరిగానే జడ్పీ స్థాయీసంఘాల సమావేశాలు కూడా ప్రతి మూడు నెలలకోసారి నిర్వహిస్తారు. ఈ సమావేశాలకు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరై మండలస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరుతుంటారు. పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత, పాఠశాలల నిర్వహణ, సాగు, తాగునీటి ఎద్దడి, అధికారుల పనితీరు, జడ్పీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు.. ఇతర అంశాలపై చర్చిస్తారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను సభ్యులు కోరతారు. గతంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం నుంచి వాకౌట్ చేసిన జడ్పీటీసీ సభ్యులు.. శుక్రవారం నాటి స్థాయీసంఘాల సమావేశాలకు అసలు హాజరుకాకపోవడం గమనార్హం.
డీఆర్వోకు వినతిపత్రం
జడ్పీ స్థాయీసంఘాల సమావేశాలకు డుమ్మాకొట్టిన వైసీపీ జడ్పీటీసీ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరించి, గన్నవరం జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెతరాణితో శుక్రవారం డీఆర్వో చంద్రశేఖరరావుకు వినతిపత్రం ఇప్పించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలైన చైర్ పర్సన్ ఉప్పాల హారికపై గత శనివారం గుడివాడలో టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, ఈ ఘటనలో పాల్గొన్న వారిని నేటికీ అరెస్ట్ చేయలేదని ఆమె వినతిలో పేర్కొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలను పాటిస్తున్న జడ్పీ సీఈవో కన్నమనాయుడు.. జడ్పీ చైర్‌పర్సన్ ఆదేశాలను, సభ్యుల వినతులను పట్టించుకోవడం లేదని, చులకనగా మాట్లాడుతున్నారని, ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరారు.
కోరం లేక వాయిదా
జడ్పీ స్థాయీసంఘాల సమావేశాలు శుక్రవారం జరుగుతాయని వారం క్రితమే జడ్పీ సీఈవో కన్నమనాయుడు ఉమ్మడి జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులకు, అధికారులకు సమాచారం పంపారు. జిల్లాలో 47 మంది జడ్పీటీసీ సభ్యులు ఉండగా, వారిలో 45 మంది వైసీపీకి చెందినవారే. మోపిదేవి, పెడన జడ్పీటీసీలు మినహా అన్ని మండలాల్లో వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులే ఉన్నారు. ఒకటి నుంచి ఏడు జడ్పీ స్థాయీసంఘాల సమావేశాల్లో వీరు సభ్యులుగా ఉంటారు. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ల అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయి. శుక్రవారం వైసీపీకి చెందిన చైర్‌పర్సన్‌తో పాటు మిగిలిన సభ్యులెవరూ హాజరు కాలేదు. జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈవో ఆనంద్‌కుమార్, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే, పాలకవర్గ సభ్యులైన జడ్పీటీసీ సభ్యులు హాజరుకాకపోవడంతో కోరం లేనందున ఈ సమావేశాలను నిర్ణీత సమయం వరకు వేచిచూసి వాయిదా వేస్తున్నట్లు సీఈవో ప్రకటించారు. టీడీపీకి చెందిన పెడన మండల జడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేష్ ఒక్కరే హాజరయ్యారు.