మళ్లీ మట్టి దందా
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:50 AM
పోలవరం కుడి కాల్వకట్ట వెంబడి మట్టిపై మళ్లీ వైసీపీ గద్దల కన్నుపడింది. ఇసుక అక్రమ దందాలో ఆరితేరిన మాజీమంత్రి కొడాలి నానీకి సన్నిహితమైన ఓ సంస్థ, ఆయన అనుచరులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. పోలవరం కుడికాల్వ కట్ట మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ తవ్వకాలపై ఇటీవలే విజిలెన్స్ విచారణ జరగ్గా, మళ్లీ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. కూటమి ప్రభుత్వంలోనే కాంట్రాక్టులను పొంది యథేచ్ఛగా విక్రయించుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వంలోనూ చెలరేగుతున్న వైసీపీ మాఫియా
పోలవరం కాల్వగట్టును తవ్వేస్తున్న కొడాలి నాని అనుచరులు
ఇసుక అక్రమ దందాలో ఆరితేరిన సంస్థ నిర్వాకం
బుడమేరు కట్ట పనుల పేరిట అనుమతులు
పాతపాడులోని రియల్ వెంచర్‌కు మట్టి తరలింపు
నానాటికీ ప్రమాదకరంగా మారుతున్న కాల్వకట్ట
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ప్రభుత్వం మారినా వైసీపీ అక్రమార్కుల మట్టి దోపిడీ మాత్రం ఆగట్లేదు. వైసీపీ నేత, మాజీమంత్రి కొడాలి నానీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ కంపెనీ ఇటీవల మళ్లీ రంగంలోకి దిగింది. అనుమతులు ఉన్నాయన్న పేరుతో విజయవాడ రూరల్ మండల పరిధిలోని పోలవరం కుడికాల్వ వెంబడి అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు. భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోవట్లేదు. మొదట్లో అనుమతులు ఉన్నాయనిబుకాయించారు. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేవని వెలుగుచూసింది. కాల్వగట్టు వెంబడి మట్టితో పాటు కొండ దిగువన గ్రావెల్‌నూ తవ్వేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతమంతా గోతులమయంగా మారింది. పోలవరం కట్టకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఏర్పడింది. కట్ట కుంగితే, గోతుల వెంబడి పోలవరం నీరు పొలాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. కట్ట తెగితే విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని గ్రామాలకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. కాగా, కొత్తూరు రిజర్వు ఫారెస్టులోకి కూడా వెళ్లి గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు.
బుడమేరు కట్టరోడ్డు పనుల పేరుతో తవ్వకాలు
బుడమేరు కట్టరోడ్డు పేరు చెప్పి ఈ సంస్థ పోలవరం కట్ట వెంబడి మట్టిని తోడేస్తోంది. కవులూరు నుంచి ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ వరకు జరుగుతున్న బుడమేరు కాల్వగట్టు పనులకు మట్టి వేయటానికి అని చెప్పి పెద్దసంఖ్యలో లారీల్లో తరలిస్తున్నారు. కాల్వగట్టుపై పలుచోట్ల ఎక్స్‌కవేటర్లు పెట్టి తవ్వుతున్నారు. ఈ కట్ట మీదుగానే లారీలు బుడమేరు కట్టకు చేరుకుని మట్టిని నింపుతున్నాయి. పగటి సమయంలో బుడమేరు కట్టరోడ్డుకు, రాత్రిపూట పాతపాడులోని శ్రీసిటీకి మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్నా, ఇరిగేషన్, ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. కొడాలి నానీకి అత్యంత సన్నిహితమైన కంపెనీ, ఆయన అనుచరులకు ఈ పనులు చేసుకునే అవకాశం ఎలా వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. బుడమేరు పనుల కాంట్రాక్టును ఎలా పొందారన్నది చర్చనీయాంశమైంది. అత్యవసర పనులు కావటంతో నామినేషన్ విధానంలో అప్పగించినట్టు తెలుస్తోంది.