Share News

అర్ధరాత్రి తవ్వకాలు

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:37 AM

అక్టోబరు 15 వరకు క్వారీల్లో ఇసుక, బుసక తవ్వకాలు జరపకూడదని జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను ఓ వైసీపీ నేత ఉల్లంఘించాడు. రొయ్యూరులోని ఎస్సీ సొసైటీ భూముల్లో ఏకంగా రెండు అక్రమ క్వారీలను తెరిచాడు. వారం నుంచి రెండు ఎక్స్‌కవేటర్ల ద్వారా రాత్రిపూట ఇసుక, బుసక తవ్వకాలు జరుపుతున్నారు. పగలు ఎక్స్‌కవేటర్లను పక్కనే ఉన్న ముళ్లపొదల్లో దాచి, రాత్రిపూట యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నా.. తమకేం తెలియదని అధికారులు తప్పించుకోవడం గమనార్హం.

అర్ధరాత్రి తవ్వకాలు
రొయ్యూరు సొసైటీ భూముల్లో నీరు ఉబికివచ్చేలా జరిగిన తవ్వకాలు

రొయ్యూరు ఎస్సీ సొసైటీ భూముల్లో వైసీపీ నేత అక్రమ క్వారీ

వారం నుంచి రాత్రి తవ్వకాలు, పగలు గప్‌చుప్‌

భారీ లారీలు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు

గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు బేఖాతరు

రెవెన్యూ శాఖలోని ఓ అధికారి అండతోనే..

తోట్లవల్లూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : రొయ్యూరు ఎస్సీ సొసైటీ భూముల్లో ఇసుక, బుసక మేటలు భారీగా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన ఓ వీఆర్వోకు కూడా ఈ సొసైటీలో భూమి ఉంది. సదరు వీఆర్వో.. ఓ వైసీపీ నేతతో బుసక తవ్వకాలకు డీల్‌ కుదుర్చుకున్నాడు. రూ.2.5 లక్షల వరకు అందుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ వైసీపీ నేతకు కొందరు టీడీపీ నేతలు కూడా అండగా నిలవటంతో గత మే నెలలో భారీ ఏర్పాట్లతో క్వారీ ఏర్పాటు చేశాడు. దీనిని కొందరు టీడీపీ నాయకులు విమర్శించారు. ఈ నేపథ్యంలో మే 30న ‘దర్జాగా బుసక దందా’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. దీంతో ఆ వైసీపీ నేత బుసక తవ్వకాలు నిలిపివేశాడు. గుట్టుగా వచ్చిన మైనింగ్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలేశారు. ఈ వైసీపీ నేతకు రెవెన్యూ శాఖలో ముఖ్యమైన అధికారి మద్దతు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అధికారి అండతోనే తాజాగా వారం రోజుల నుంచి బుసక, ఇసుక క్వారీలు తెరిచారు.

రాత్రి తవ్వకాలు.. పగలు గప్‌చుప్‌

రొయ్యూరు ఎస్సీ సొసైటీకి చెందిన రైతు బందెల కోటేశ్వరరావు శుక్రవారం విలేకరులను తీసుకెళ్లి సొసైటీ భూముల్లో జరుపుతున్న ఇసుక, బుసక అక్రమ క్వారీలను చూపారు. రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రెండు ఎక్స్‌కవేటర్లతో లారీల్లోకి లోడింగ్‌ చేస్తూ అక్రమ రవాణా సాగిస్తున్నారని, ఈ అక్రమ తవ్వకాలకు అధికారుల సహకారం ఉన్నట్టు కోటేశ్వరరావు ఆరోపించారు. రాత్రిపూట తవ్వకాలు జరుపుతూ పగలు ఏమి జరగనట్టు మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. ఒక ఎక్సకవేటర్‌తో బుసక, మరో ఎక్సకవేటర్‌తో ఇసుక లోడింగ్‌ జరుపుతున్నారు. రాత్రివేళల్లో భారీగా లారీలు తిరుగుతున్నా కనీసం రెవెన్యూ సిబ్బంది తమకు తెలియదని చెప్పడం ఆశ్చర్యకరం. నీటి ఊటలు బయట పడేలా ఇసుక, బుసక తవ్వకాలు సాగిస్తూ.. గ్రీన్‌ టిబ్యునల్‌ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నా.. అధికారులు గుడ్డిగా వ్యవహరిస్తున్నారు.

తప్పించుకునే ధోరణి

రొయ్యూరు, నార్తువల్లూరు క్వారీల్లో గతంలో అనుమతులు పొంది స్టాక్‌యార్డులకు ఇసుక తోలిన కాంట్రాక్టర్లు ఇప్పుడు రాత్రి సమయాల్లో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. అక్టోబరు 15 వరకు క్వారీల్లో తవ్వకాలు జరపకూడదని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలివ్వటంతో స్టాక్‌యార్డుల్లో ఇసుకను మాత్రమే వినియోగదారులకు అందించాలి. స్టాక్‌యార్డుల మాటున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతుండడాన్ని పసిగట్టిన ఈ వైసీపీ నేత కూడా తాను అదే బాటలో నడిచేందుకు సిద్ధమై, అధికారులను మచ్చిక చేసుకుని రొయ్యూరు సొసైటీ భూముల్లో క్వారీలు తెలిచినట్టు సమాచారం. వారు చేస్తున్నదే తాను చేస్తున్నట్టు వైసీపీ నేత వాదించడం గమనార్హం.

ఎక్స్‌కవేటర్లను బయటకు పంపిస్తా : తహసీల్దార్‌ కుసుమకుమారి

రొయ్యూరు ఎస్సీ సొసైటీ భూముల్లో ఇసుక, బుసక అక్రమ క్వారీల విషయమై తహసీల్దార్‌ ఎం.కుసుమకుమారిని వివరణ కోరగా, ఈ క్వారీలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. క్వారీలు నడుస్తున్నట్టు తనకు తెలియదన్నారు. క్వారీల వద్ద ఉన్న రెండు ఎక్సకవేటర్లను బయటకు పంపిస్తానని, అవసరమైతే సీజ్‌ చేయిస్తానని చెప్పారు.

Updated Date - Jul 19 , 2025 | 12:37 AM