Share News

మావో’ఇష్టులా?‘ పోలీసు ఇన్ఫార్మర్లా?

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:46 AM

మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌తో బెజవాడ వ్యాపారులకు సంబంధాలున్నాయన్న ఆ పార్టీ ప్రకటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరా వ్యాపారులు..? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. హిడ్మా అనారోగ్యానికి గురయ్యాడని, చికిత్స కోసం నిరాయుధుడై విజయవాడ వచ్చాడని, అందుకు ఆ ఇద్దరు వ్యాపారులు సహకరించారని, వీరితో పాటు తమ పార్టీ సభ్యుడు ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వటం వల్లే హిడ్మా విజయవాడలో పట్టుబడ్డాడని, హత్య చేసి మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌ అని చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. మావోయిస్టు పార్టీకి సహకరించిన ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరు? అనేది చర్చకు దారితీస్తోంది.

మావో’ఇష్టులా?‘ పోలీసు ఇన్ఫార్మర్లా?

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ వెనుక ఉన్న ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరు?

నగరానికి చెందిన ఇద్దరు వ్యాపారులకు సంబంధం ఉందని మావోయిస్టు పార్టీ ప్రకటన

చికిత్స కోసం హిడ్మాను నగరానికి తీసుకొచ్చిన వ్యాపారులు

ఇక్కడి నుంచి మారేడుమిల్లి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్‌ చేశారని ఆరోపణ

ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరనే విషయంపై తీవ్ర చర్చ

ఒకరు ఫర్నీచర్‌ వ్యాపారి.. మరొకరు సివిల్‌ కాంట్రాక్టర్‌

నగరంలో కలకలం రేపుతున్న మావోయిస్టు పార్టీ ప్రకటన

(ఆంధ్ర జ్యోతి, విజయవాడ) : మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. నగరానికి చెందిన కలప-ఫర్నీచర్‌ వ్యాపారి, బిల్డర్‌-సివిల్‌ కాంట్రాక్టర్‌లు హిడ్మా విజయవాడ రావటానికి కారణమని పేర్కొంది. ఈ వ్యాపారులిద్దరూ హిడ్మా గురించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేశారన్నది మావోయిస్టుల ఆరోపణ. అసలు ఈ వ్యాపారులిద్దరూ ఎవరు? పోలీసుల ట్రాప్‌లో ఉండి బలవంతంగా హిడ్మా సమాచారాన్ని అందించారా? మావోయిస్టులకు కొరియర్లుగా ఉంటూ పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

మావోయిస్టులతో సంబంధాలెలా?

బెజవాడ వ్యాపారులకు మావోయిస్టు అగ్రనేతలతో ఎలా సంబంధాలు కుదిరాయన్నది చర్చగా మారింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తమ కొరియర్లుగా ఉండేవారినే విశ్వసిస్తారు. అది కూడా కొద్ది సంవత్సరాలు వారికి వేరే బాధ్యతలు అప్పగించి, వారి పనితీరును గమనించిన తర్వాతే నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని కీలక సమాచారాన్ని పంచుకుంటారు. తమ కదలికలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇస్తుంటారు. దేశంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ హిడ్మా వంటి వారితో పరిచయాలు, సంబంధాలు అంటే ఆషామాషీగా ఉండదు. ఆ ప్రకటన మేరకు హిడ్మాను విజయవాడ తీసుకురావటంలో ఇద్దరు వ్యాపారులు కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. అలాంటపుడు మావోయిస్టులతో వీరికి ఎంతోకాలంగా పరిచయాలు, సంబంధాలు ఉండి ఉండవచ్చని తెలుస్తోంది. బిల్డర్‌-సివిల్‌ కాంట్రాక్టర్‌ ద్వారానే కానూరు ఆటోనగర్‌లో భవనం తీసుకుని ఉంటారా అనే.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో మాదిరిగానే..

నగరంలో 1990లో మావోయిస్టు సానుభూతిపరుడు, కొరియర్‌ అయినటువంటి సాయి ఉదంతం మూడున్నర దశాబ్దాల తర్వాత స్పురణకు వస్తోంది. సంచలనం సృష్టించిన ఎస్‌ఐబీ ఎస్‌ఐ ఇమ్మానియేల్‌ హత్య కేసును లోతుగా చూస్తే.. నక్సల్స్‌కు సానుభూతిపరుడిగా, కొరియర్‌గా ఉండి వారి చేతిలోనే సాయి చనిపోయాడు. నగరంలోని సాయి ఇంటికి వచ్చి ఎందరో నక్సల్స్‌ నేతలు భోజనం చేసి వెళ్లేవారు. కొందరు అక్కడే తలదాచుకునేవారు. అలా నక్సల్స్‌తో పరిచయం పెంచుకున్న సాయి ఆ పార్టీకి కొరియర్‌గా మారాడు. సాయిపై నమ్మకం పెంచుకోవటానికి నక్సల్స్‌ పార్టీకి రెండేళ్లు పట్టింది. సర్కార్‌ జిల్లాల కీలక నేత నిమ్మలూరి భాస్కరరావుకు కొరియర్‌గా సాయి పనిచేశాడు. ఆ నాలుగు నెలలకే నిమ్మలూరి పోలీసులకు పట్టుబడ్డాడు. దీనిపై పార్టీ విచారణ జరిపి సాయి ద్వారా సమాచారం వెళ్లిందని తెలుసుకుంది. అతడిని నల్లమల అడవులకు పిలిపించి వాస్తవాలు రాబట్టారు. విజయవాడ ఎస్‌ఐబీలో పనిచేసే ఎస్‌ఐ ఇమ్మానియేల్‌ రాజు.. సాయిని తన ఆధీనంలోకి తీసుకుని కొరియర్‌గా తాను చేరవేసే లేఖలన్నింటినీ చదివేవాడని, తనకు పలుమార్లు ఆర్థిక సహాయం చేశాడని, తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించటం వల్ల సమాచారం చెప్పాల్సి వచ్చిందని సాయి ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత నక్సల్స్‌.. సాయిని అడవుల్లోనే చంపేశారు. ఇమ్మానియేల్‌ రాజు దగ్గర ఉన్న కీలక సమాచారం వల్ల మనుగడకే ప్రమాదమని గ్రహించిన సర్కాల్‌ జిల్లాల కమిటీ విజయవాడకు ప్రత్యేక ఆపరేషన్‌ బృందాన్ని పంపించి ఆయన్ను హత్య చేయించింది. ఇమ్మినియేల్‌ రాజు పుష్పా హోటల్‌లో పేపర్‌ చదువుతుండగా, కాల్చి చంపారు. తాజాగా మావోయిస్టు పార్టీతో బెజవాడ వ్యాపారుల హస్తం ఉందని తెలియడం, హిడ్మా వంటి కీలక నేతను ఎన్‌కౌంటర్‌ చేయడంతో మరోసారి బెజవాడపై మావోయిస్టులు కన్నుపడిందని తెలుస్తోంది.

Updated Date - Dec 06 , 2025 | 12:46 AM