అద్విక ఆస్తులెక్కడ?
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:56 AM
లక్ష రూపాయలు ఇస్తే.. నెలకు రూ.6 వేల వడ్డీ చెల్లిస్తానని మాయమాటలు చెప్పి.. కోట్ల రూపాయల పెట్టుబడులను స్వీకరించి.. బోర్డు తిప్పేసిన అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆస్తులను జప్తు చేయడానికి సిట్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఆ సంస్థకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో గుర్తించే పనిలో అధికారులు పడ్డారు.
జప్తు చేసేందుకు రంగం సిద్ధంచేస్తున్న సిట్
వివరాల కోసం తెలంగాణ రిజిసే్ట్రషన్ శాఖకు లేఖ
ఆస్తుల క్రయవిక్రయాలు జరపొద్దని నోటీసులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : లక్ష రూపాయలు ఇస్తే.. నెలకు రూ.6 వేల వడ్డీ చెల్లిస్తానని మాయమాటలు చెప్పి.. కోట్ల రూపాయల పెట్టుబడులను స్వీకరించి.. బోర్డు తిప్పేసిన అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆస్తులను జప్తు చేయడానికి సిట్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఆ సంస్థకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆస్తుల వివరాలపై సిట్ అధికారులు తెలంగాణ రిజిసే్ట్రషన్ శాఖకు లేఖ రాశారు. ఈ వివరాలు రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక బృందం విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా వెళ్లి ఈ లేఖను అందజేసింది. సిట్ ఏర్పాటు చేయడానికి ముందు సాగిన దర్యాప్తులో హైదరాబాద్‌లో అద్విక కిరణ్‌కు కొన్ని ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. వాటిపై ఎలాంటి క్రయవిక్రయాలు చేయరాదని ఇప్పటికే ఆయా అధికారులకు పోలీసులు నోటీసులు అందజేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో ఉంటున్న సంస్థ ఎండీ తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య సోదరులను పోలీసులు విచారణ చేశారు. ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు చెప్పినట్టు తెలిసింది.
ఖబానాను ఏం చేద్దాం?
ఖాతాదారులు, ఏజెంట్ల నుంచి సేకరించిన మొత్తంలో రూ.3 కోట్లను ఆదిత్య దుబాయిలోని ఖబానా సంస్థలో పెట్టుబడిగా పెట్టాడు. ఈ మొత్తం నగదును హవాలా మార్గంలో పంపించాడు. ఫారెక్స్‌లో షేర్లు కొన్నాడు. ఇప్పుడు ఈ నగదు విషయంలో ఏం చేయాలో పోలీసులకు పాలుపోవట్లేదు. ఈ మొత్తం షేర్లను రద్దు చేస్తే నగదంతా హవాలా మార్గంలో తిరిగి వస్తుంది. ఇది చట్టరీత్యా నేరం. అలా చేసి నగదును రప్పించి బాధితులకు న్యాయం చేద్దామంటే లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రాంతాలవారీగా ఉన్న ఏజెంట్లు, వారి కింద ఉన్న ఖాతాదారులను పోలీసులు పిలిపిస్తున్నారు. వారి నుంచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. బ్యాంక్ స్టేట్‌మెంట్ల వివరాలను అడుగుతున్నారు. వీలైనంత త్వరగా అద్వికలో అరెస్టులను అధికారికంగా చూపించాలన్న యోచనలో సిట్ అధికారులు ఉన్నారు.