వైకుంఠపురం-దాములూరు బ్యారేజీ ఎప్పుడు?
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:02 AM
వైకుంఠపురం-దాములూరు బ్యారేజీ కోసం నందిగామ, జగ్గయ్యపేట, పెదకూరపాడు నియోజకవర్గాల ప్రజలు, రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజధాని అమరావతి తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు ఈ మూడు నియోజకవర్గాల్లో తాగు, సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు గతంలో టీడీపీ హయాంలో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, వైసీపీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. తిరిగి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెట్టప్రాంతాలకు వరప్రదాయినిగా ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

జగ్గయ్యపేట, నందిగామ, పెదకూరపాడు నియోజకవర్గాలకు వరప్రదాయిని
సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం
గతంలో టీడీపీ హయాంలో శంకుస్థాపన
రూ.2,169 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం
వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులు
కూటమి ప్రభుత్వం రాకతో రైతుల్లో ఆశలు
(ఆంధ్రజ్యోతి, కంచికచర్ల) : భవిష్యత్తులో అమరావతికి తాగునీటి ఇబ్బందులు రాకుండా గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా వైకుంఠపురం, ఎన్టీఆర్ జిల్లా దాములూరు మధ్య కృష్ణానదిపై బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23 కిలోమీటర్ల దూరంలో, పులిచింతల ప్రాజెక్టుకు 60 కిలోమీటర్ల దిగువన పల్నాడు జిల్లా వైకుంఠపురం, ఎన్టీఆర్ జిల్లా దాములూరు మధ్య కృష్ణానదిపై దీనిని నిర్మించాలని యోచించారు. రూ.2,169 కోట్లతో 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ బ్యారేజీ నిర్మాణానికి 2018, ఫిబ్రవరి 13న వైకుంఠపురం వైపున శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పనులు కూడా ప్రారంభించింది. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ బ్యారేజీ నిర్మాణాన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బ్యారేజీ నిర్మాణంపై మెట్టప్రాంత ప్రజలు, రైతులు ఆశలు పెంచుకుంటున్నారు.
నీటి కష్టాలు తీరే దారి
ప్రకాశం బ్యారేజీ వద్ద కేవలం రెండు నుంచి మూడు టీఎంసీలకు మించి నీరు నిల్వ చేయటానికి వీలుపడట్లేదు. పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణానదిలో కలుస్తున్న మునేరు, పాలేరు, వైరాయేరు, కట్లేరు, యేనుగుగడ్డవాగు, పల్నాడు జిల్లాలో కలుస్తున్న బయ్యారం వాగు, మద్దూరు వాగు, ఇతరత్రా వాగులు, వంకల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని నిల్వ చేసి, రాజధానికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో గతంలో చంద్రబాబు.. ఈ బ్యారేజీ నిర్మాణానికి బీజం వేశారు. దీనివల్ల నందిగామ, జగ్గయ్యపేట, పెదకూరపాడు నియోజకవర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాంతాల్లో కృష్ణానది, మునేరుతో పాటు పలు వాగులు, వంకలు ప్రవహిస్తున్నప్పటికీ సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పట్లేదు. చందర్లపాడు, కంచికచర్ల మండలాల వైపు కృష్ణానదిలో నీటి ప్రవాహం ఉండట్లేదు. వరదలొచ్చినపుడు మాత్రమే నదిలో నీరు కనిపిస్తోంది. గుడిమెట్ల దాటిన తర్వాత నీటి ప్రవాహమంతా అమరావతివైపే వెళ్తుంది. దీనివల్ల నదిపై ఉన్న ఎత్తిపోతల పథకాల ఆయకట్టుకు సజావుగా సాగునీరు అందట్లేదు. రైతులు అధిక వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. కళ్ల ముందే మిర్చి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు, పశుగ్రాసం ఎండుతున్నా నీరందించలేని దుస్థితి. తాగునీటికి ఇబ్బందులు తప్పట్లేదు. సామూహిక రక్షిత పథకాల ద్వారా అరకొరగానే తాగునీరు అందుతోంది. ఇసుకలో కాల్వలు తీసి నీటి ప్రవాహాన్ని తాగునీటి పథకాల వద్దకు మళ్లించాల్సి వస్తోంది. పలు పథకాలకు ఊటనీరే దిక్కవుతోంది. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల అమరావతి తాగునీటి అవసరాలు తీరటంతో పాటు నందిగామ, జగ్గయ్యపేట, పెదకూరపాడు నియోజకవర్గాల్లో తాగు, సాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి.
పుష్కలంగా నీరు
ఈ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు కావటంతో ఎగువన 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు బ్యాక్ వాటర్ నిల్వ ఉంటుంది. దీనివల్ల ఇప్పటికే కృష్ణానది, మునేటిపై నందిగామ నియోజకవర్గంలో ఉన్న 51 సాగునీటి ఎత్తిపోతల పథకాల ద్వారా 63,438 ఎకరాల ఆయకట్టుకు, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 39 ఎత్తిపోతల పథకాల ద్వారా 21,742 ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. వేదాద్రి-కంచెల ఎత్తిపోతల పథకం ఆయకట్టు 15,366 ఎకరాలకు నీటి కొరత ఉండదు. తాగునీటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఏడాది పొడవునా నీరు పుష్కలంగా అందుతుంది. కృష్ణాడెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఇది దోహదపడుతుంది. రెండు రోజుల క్రితం చందర్లపాడు మండలం కాసరబాదలో జరిగిన ఎత్తిపోతల పథకాల చర్చావేదికలో వైకుంఠపురం-దాములూరు బ్యారేజీ నిర్మించాలని ప్రజలు, రైతులు ముక్తకంఠంతో కోరారు. ఎత్తిపోతల పథకాల మనుగడ ప్రశ్నార్థకంగా మారటంతో బ్యారేజీ నిర్మాణమే శరణ్యమంటూ ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు దృష్టి కేంద్రీకరించి, బ్యారేజీని సత్వరమే నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.