Share News

నున్న.. నేడు.. రేపు..

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:00 AM

నగర నడిబొడ్డున ఉన్న కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌ తరలింపు ప్రహసనంగా మారింది. కొందరి స్వార్థ ప్రయోజనాల కారణంగా 3 లక్షల మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నున్నలో పండ్ల మార్కెట్‌ నిర్మించుకున్నా.. కొన్ని శక్తులు మార్కెట్‌ తరలింపును అడ్డుకుంటున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యను జిల్లా యంత్రాంగం, కార్పొరేషన్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు గాలికొదిలేయగా, సమస్యలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి.

నున్న.. నేడు.. రేపు..
కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌ రోడ్లో ట్రాఫిక్‌ జాం

కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌ తరలింపు ఎప్పుడు?

దశాబ్దాలుగా తరలిపోక నగరంలో ట్రాఫిక్‌ సమస్య

ప్రధాన రహదారి ఆక్రమించుకుని వ్యాపారాలు

భారీ కంటైనర్లు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌తో అవస్థలు

నున్నలో కొత్త మార్కెట్‌ నిర్మించుకున్నా వెళ్లరు..!

కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలకు ఇక్కట్లు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఏళ్ల తరబడి ట్రాఫిక్‌ ఇబ్బందులు, పారిశుధ్యం అధ్వానం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : 50 ఏళ్ల కిందటే కేదారేశ్వరపేటలో పండ్ల మార్కెట్‌ ఏర్పడింది. అంతకుముందు కొన్ని ఏళ్ల పాటు కాళేశ్వరరావు మార్కెట్‌లో ఉండేది. అప్పట్లో కాళేశ్వరరావు మార్కెట్‌లో ఉండే 20 మంది పండ్ల వ్యాపారులు కేదారేశ్వరపేటలో 4.50 ఎకరాలు కొని పండ్ల మార్కెట్‌ను స్థాపించారు. ఈ మార్కెట్‌కు అసోసియేషన్‌ ఉంది. కానీ, ఈ అసోసియేషన్‌లో స్థల యజమానులే నాయకులు. మొదట్లో వారే దుకాణాలు నిర్వహించారు. కాలక్రమంలో ఇతరులకు ఇవ్వటం ప్రారంభించారు. ప్రస్తుతం పండ్ల మార్కెట్‌లో 300 మంది వరకు వ్యాపారులున్నారు. ఇక్కడ వ్యాపారం చేసే వారంతాషాపులు కట్టించిన స్థల యజమానులకు సంవత్సరానికి సరిపడా అద్దె ముందే చెల్లించాలి. ప్రస్తుతం నెలకు రూ. లక్ష చొప్పున సంవత్సరానికి రూ.12 లక్షల చొప్పున వ్యాపారులు అద్దె కడుతున్నారు. స్టాల్స్‌ కట్టించిన స్థల యజమానులకు కోట్లాది రూపాయల అద్దెలు వస్తున్నాయి. ఎవరు అద్దె ఎక్కువ ఇస్తే వారికే షాపులు అన్నట్టుగా కేటాయింపులు జరుగుతున్నాయి. దీనికి తోడు అనధికారిక దుకాణాలు వెలిశాయి. రోడ్లపైకి వచ్చేశాయి. ప్రధాన రోడ్డుపైన కూడా హ్యాకర్లకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీనికి కూడా డబ్బు వసూలు చేస్తున్నారు.

ట్రాఫిక్‌ చక్రబంధం

కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌ వల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య ఎక్కువైంది. కళాశాలలు, పాఠశాలలు, రైతుబజార్‌, సచివాలయం, పండ్ల మార్కెట్‌ వంటి వాటికి ప్రధానమైన రహదారి ఇదొక్కటే. ఈ రోడ్డుపైన కూడా వ్యాపారాలు చేసేస్తుండటంతో ట్రాఫిక్‌ కష్టాలకు అంతే లేకుండాపోయింది. మార్కెట్‌కు వచ్చే భారీ కంటైనర్లు, ట్రక్కులు, లారీలు, వ్యాన్ల లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కూడా రోడ్డు మీదే జరగటం, అనధికార దుకాణాలు, హ్యాకర్ల విక్రయాల వల్ల ట్రాఫిక్‌ ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. అసలే ఇరుగ్గా ఉన్న ఎర్రకట్ట మీదుగా లారీలు, ట్రక్కులు వస్తున్నాయి. రోజూ 300 పైబడి లారీలు అన్‌లోడింగ్‌కు వచ్చి రోడ్లపైనే నిలిచి ఉంటున్నాయి. వీటివల్ల ట్రాఫిక్‌ పెరుగుతోంది. కళాశాలలు, పాఠశాలలు, ఆఫీసులకు సకాలంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతినెలా 5 నుంచి 10 వరకు ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవేకాకుండా ఈ ప్రాంతంలో పారిశుధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

నున్న తరలించరెందుకు?

కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌ ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకోవటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు మార్కెట్‌కు రావటం తగ్గిపోయారు. వ్యాపారాలు కూడా తగ్గిపోతున్నాయి. దీంతో పండ్ల మార్కెట్‌లో వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు 120 మంది వరకు కలిసి 1998లో నున్న మ్యాంగో మార్కెట్‌ను ఆనుకుని 23 ఎకరాలు కొన్నారు. ఇక్కడ షాపులతో పాటు 100 అడుగుల రోడ్లు నిర్మించారు. 2001 నుంచి ఇక్కడ మామిడి సీజన్‌లో వ్యాపారాలు చేసేవారు. ఏడాదిలో 3 నెలలు ఇక్కడ మామిడి వ్యాపారాలు, మిగిలిన 9 నెలలు కేదారేశ్వరపేటలో వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. నున్న మార్కెట్‌లో కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌ యజమానులు కూడా భాగస్వాములుగా ఉన్నా.. వ్యాపారులెవరినీ కదలనివ్వడం లేదు. కోట్లాది రూపాయల అద్దెలు పోతాయనే భయంతోనే అలా చేస్తున్నారు. సగంమంది వ్యాపారులు వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నా.. మిగతా వారిని యజమానులు బలవంతంగా ఉంచేస్తున్నారు.

అర్జీలు బుట్టదాఖలు

మార్కెట్‌ తరలింపు కోసం వ్యాపారులు 20 ఏళ్లుగా మున్సిపల్‌ కమిషనర్లు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా వారి గోడు వినే పరిస్థితి లేకుండాపోయింది. వేలసంఖ్యలో అర్జీలు వచ్చినా సమస్య పరిష్కారం కావట్లేదు. మార్కెట్‌ను తరలించాలని కార్పొరేషన్‌ నోటీసులు ఇస్తే.. యజమానులు గడువు కోరడం పరిపాటిగా మారింది. ఈ మార్కెట్‌కు భారీ వాహనాలు రాకుండా అడ్డుకోవటానికి కార్పొరేషన్‌ అధికారులు నలువైపులా గడ్డర్లు ఏర్పాటుచేసినా ధ్వంసం చేశారు.

Updated Date - Jul 27 , 2025 | 01:00 AM