వాట్సాప్ మోసం
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:43 AM
వాట్సాప్ వేదికగా మరో నయా మోసం వేళ్లూనుకుంటోంది. ఓ ట్రస్టు పేరిట వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయడమే కాకుండా.. అందులో చాలామందిని యాడ్ చేసి, అదిరిపోయే ఆఫర్లంటూ డబ్బు పిండే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడతో పాటు జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న ఈ ఆన్‌లైన్ మోసం ఇప్పుడు కలవరపెడుతోంది.
గ్రూపులు క్రియేట్ చేసి ట్రస్ట్ పేరిట ఆఫర్లు
రూ.2 వేలు కడితే.. రూ.18,500 ఇస్తామని మెసేజ్‌లు
జిల్లాలోని వివిధ వర్గాలు టార్గెట్‌గా గ్రూపులో యాడింగ్
పంథా మారుస్తున్న సైబర్ నేరగాళ్లు
తక్కువ మొత్తాలే టార్గెట్‌గా నయా మోసాలు
పోలీసులు సుమోటాగా స్వీకరించాలనే డిమాండ్
(ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం) : ఓ ట్రస్ట్ పేరిట వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి, ఆఫర్ పేరుచెప్పి ‘రూ.2 వేలు కట్టండి.. రూ.18,500 మీ ఖాతాలో జమ చేస్తాం..’ అంటూ కేటుగాళ్లు అమాయకులకు ఎర వేస్తున్నారు. విజయవాడతో పాటు జిల్లావ్యాప్తంగా మహిళలు, అధికారులు, జర్నలిస్టులు, డాక్టర్లు, పోలీసులు, విద్యార్థులు ఇలా వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకుని వారికి తెలియకుండానే వాట్సాప్ గ్రూపులో యాడ్ చేస్తున్నారు. గ్రూప్ అడ్మిన్లుగా ఇమోతి, లవ్ అనే పేర్లతో పాటు మరో వ్యక్తి ఉంటున్నారు. మిగతా సభ్యులు చాటింగ్ చేయకుండా లాక్ చేసి, ఈ రూ.2 వేల ఆఫర్ వివరాలు అందులో పోస్టు చేస్తున్నారు. అంతేకాదు.. కొంతమందికి రూ.18,500 చెల్లించామంటూ స్ర్కీన్‌షాట్స్ పెడుతున్నారు. ఆఫర్ బాగుందంటూ పోలీసుల పేరుతో మెసేజ్‌లు పెట్టిస్తున్నారు. ఈ అవకాశం ఆరుగురికి మాత్రమే, నలుగురికి మాత్రమేనంటూ ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా జిల్లాలో ఎంతమంది మోసపోయారో తెలియని పరిస్థితి. సైబర్ పోలీసులు సుమోటోగా తీసుకుని కేటుగాళ్ల మోసాలకు కళ్లెం వేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
గతంలో ఇలాగే..
గతంలో.. ‘బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఏటీఎం పిన్ నంబరు గడువు అయిపోయింది. మీ పిన్ నంబరు చెప్పండి లేదా ఏటీఎం కార్డుపై ఉన్న 10 అంకెలు చెప్పండి.’ అని కాల్ చేసి మోసం చేసిన ఉదంతాలు జరిగాయి. ఇలా మాయమాటలు చెప్పి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు మాయం చేసేవారు. ఖాతాదారులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించేవారు. కానీ బాధితులకు న్యాయం మాత్రం జరిగేది కాదు. కాగా, ఇలాంటి సైబర్ నేరాలపై పోలీసులు, బ్యాంక్ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించడంతో చాలామంది మేలుకున్నారు. దీంతో ఆ విధానానికి సైబర్ నేరగాళ్లు స్వస్తి పలికారు. ఇప్పుడు కొత్తగా ట్రస్టుల పేరుతో మోసం చేయడం ప్రారంభించారు.
చిన్న మొత్తాలతో పెద్ద నేరాలు
ఇప్పుడు సైబర్ మోసగాళ్లు పంథా మార్చారు. పెద్ద మొత్తంలో దండుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. కేవలం రూ.20 వేలు, రూ.30 వేలను ఎక్కువ మంది వద్ద లాగేస్తున్నారు. అలాగే, ‘అర్జెంట్ పని ఉంది. ఇంటికి కాల్ చేసుకోవాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా..’ అని ఎవరైనా అపరిచితులు ఫోన్ అడిగితే ఇవ్వకపోవడమే మంచిది. ఫోన్ తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటన ఇటీవల జగ్గయ్యపేటలో జరిగింది.
తిరువూరు ఆర్డీవో పేరుతో..
ఇటీవల సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు తిరువూరు ఆర్డీవో పేరుతో ఒక ఫేక్ అకౌంట్‌ను క్రియేట్ చేసి 8553236906 నంబరుకు రూ.8 వేలు పంపాలని సందేశాన్ని పంపారు. సకాలంలో ఈ విషయాన్ని గమనించిన రెవెన్యూ అధికారులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె మైలవరం ఏసీపీ, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
నకిలీ యాప్‌లను నమ్మొద్దు
నకిలీ యాప్‌లను నమ్మవద్దు. ఇటీవల కొన్ని నకిలీ యాప్‌లలో రూ.2 వేలు జమచేస్తే.. రూ.18,500 తిరిగి ఇస్తామంటూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారిని నమ్మవద్దు. ఈ నకిలీ యాప్‌లన్నీ మల్టీ లెవల్ మార్కెటింగ్ తరహాలో మోసం చేస్తున్నాయి.
- గురుప్రకాష్, వన్‌టౌన్ సీఐ