Share News

పశ్చిమ బైపాస్‌.. మరో 6 నెలలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:40 AM

ఎప్పుడెప్పుడా.. అని ఆశగా ఎదురుచూస్తున్న విజయవాడ పశ్చిమ బైపాస్‌ నిర్మాణం నెమ్మదిగా ముందుకు కదులుతోంది. డిసెంబరు లేదా జనవరిలో అందుబాటులోకి వస్తుందని అందరూ భావించగా, ఇప్పటి వరకు జరిగిన పనులను ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా, మరో 6 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్యాకేజీ 3, 4 మిగులు పనుల్లో కూడా కదలిక రావడంతో మార్చి నాటికి ఈ బైపాస్‌కు మార్గంసుగమం అయ్యేందుకు ఆస్కారం ఉంది.

పశ్చిమ బైపాస్‌.. మరో 6 నెలలు
ప్యాకేజీ-3లో అంబాపురం వద్ద మిగిలిన పనులు

మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం

ఎన్‌ హెచ్‌-16కు అనుసంధాన పనులు కీలకం

చిన్న అవుటపల్లి దగ్గర ఇంకా ప్రారంభం కాలేదు

కాజ దగ్గర ఇప్పుడిప్పుడే మొదలు

ప్యాకేజీ-3, 4లో అక్కడక్కడ మిగిలిన పనులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పశ్చిమ బైపాస్‌ పనులు పూర్తి కావటానికి మరో 6 నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది. మార్చి నాటికి సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్యాకేజీ-3, 4 పనులకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ప్యాకేజీ-3 పనులు 96 శాతం, గొల్లపూడి, సూరాయపాలెం, కృష్ణానది మీదుగా కాజ వరకు ప్యాకేజీ-4 పనులు 88 శాతం పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కావటానికి గరిష్టంగా 6 నెలల సమయం పట్టే అవకాశం కనిపించింది. కాజ-విజయవాడ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా చేపట్టారు. ఇందులో ప్యాకేజీ-1, 2 పనులు ఇప్పటికే అందుబాటులోకి రాగా, ప్యాకేజీ-3, 4 పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ పనులు తుదిదశకు చేరుకున్నప్పటికీ కొన్ని పనులు మిగిలే ఉన్నాయి.

ప్యాకేజీ-3లో మిగిలిన పనులు

ప్యాకేజీ-3 పనుల్లో పశ్చిమ బైపాస్‌ మొదలయ్యే చిన్న అవుటపల్లి దగ్గర ఎన్‌హెచ్‌-16 అనుసంధాన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇవి కాలాతీతమైనవి. ట్రాఫిక్‌ను మళ్లించి జాతీయ రహదారికి అనుసంధానించాలి. ఈ పనులు చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సూరంపల్లి దగ్గర ఆర్వోబీపై క్రాష్‌ బ్యారియర్స్‌ పనులు జరుగుతున్నాయి. ఇవి పక్షం రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. నున్న వద్ద ట్రాన్స్‌కో విద్యుత లైన్లు డౌన్‌లో ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో 350 మీటర్ల మేర రోడ్డు పోర్షన్‌ పనులు మిగిలి ఉన్నాయి. ట్రాన్స్‌కో టవర్ల ఎత్తు పెంచితే ఈ పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. కేంద్రం నుంచి అనుమతులు వస్తే.. దీనికి సంబంధించి రైతులు హైకోర్టులో వేసిన మూడు కేసులు వీగిపోతాయి కాబట్టి ఆ తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అంబాపురం దగ్గర ఆర్వోబీ శ్లాబ్‌ పోర్షన్‌ పనులు చేపట్టలేదు. ల్యాంకో హైటెన్షన్‌ విద్యుత లైన్ల కారణంగా ఈ పని జరగలేదు. ఇటీవల టవర్ల పొడిగింపునకు ఎన్‌హెచ్‌ అవకాశం ఇచ్చింది. హైకోర్టులో కూడా రైతులు వేసిన కేసులకు పరిష్కారం లభించింది. ఇక్కడ శ్లాబ్‌ పోర్షన్‌ పనులు చేపడితే సరిపోతుంది. ఇవి తప్ప మిగిలినచోట్ల ఆరు వరసల పనులు పూర్తయ్యాయి. ఆర్వోబీలు కూడా పూర్తయ్యాయి. ప్యాకేజీ-3లో ఈ పనులన్నీ పూర్తి కావటానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది.

ప్యాకేజీ-4లో పరిస్థితి ఇదీ..

గొల్లపూడి ఆర్వోబీ దిగిన దగ్గర నుంచి సూరాయపాలెం వరకు రోడ్డు పోర్షన్‌ పనులు, కృష్ణానదిపై 3 కిలోమీటర్ల వంతెనల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వెంకటాయపాలె ం టోల్‌గేట్‌ దాటాక మధ్యలో రెండు, మూడుచోట్ల కొంతమేర రోడ్డు స్ర్టెచ్‌ పనులు మిగిలి ఉన్నాయి. యాష్‌ డంపింగ్‌, ఎర్త్‌ వర్క్‌, రోడ్డు ఫార్మింగ్‌ పనులు జరుగుతున్నాయి. రైల్వే ఫ్లై ఓవర్‌కు ముందు ఉండే ఆర్వోబీ పనులు సగమే పూర్తయ్యాయి. మరో సగం పనులు పూర్తి కాలేదు. ఈ మధ్యలో చిన్నచిన్న గ్యాపులు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌కు ముందు భాగంగా సర్వీసు రోడ్ల పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. అన్నింటికంటే అతి ముఖ్యమైన కాజ ల్యాండింగ్‌ పోర్షన్‌ పనులు ప్రారంభమైనా ఇంకా పూర్తికాలేదు. ఈ ప్రాంతంలో పలు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. రోడ్డు పోర్షన్‌ పనులు మిగిలి ఉన్నాయి. పశ్చిమ బైపాస్‌లో ప్యాకేజీ-4 పనులు పూర్తి కావటానికి ఐదారు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

Updated Date - Nov 09 , 2025 | 12:40 AM