మట్టి మాటలు కట్టిపెట్టోయ్..
ABN , Publish Date - May 27 , 2025 | 01:00 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం కుడికాల్వ మట్టి నిల్వలు కొల్లగొట్టడంపై జలవనరుల శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. ఓవైపు విజిలెన్స్ తనిఖీలు, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తులు వస్తుండటంతో అధికారుల్లో కలవరం మొదలైంది.
పోలవరం మట్టిమాయంపై జలవనరుల శాఖ దిద్దు‘పాట్లు’
లెక్కలు సరిచేసే పనిలో చిత్ర విచిత్రాలు
గన్నవరంలో పోయిన మట్టి ధవళేశ్వరానికి తరలించారట!
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం కుడికాల్వ మట్టి నిల్వలు కొల్లగొట్టడంపై జలవనరుల శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. ఓవైపు విజిలెన్స్ తనిఖీలు, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తులు వస్తుండటంతో అధికారుల్లో కలవరం మొదలైంది. పోలవరం కాల్వగట్టు వెంబడి నిల్వ చేసిన మట్టిని వైసీపీ హయాంలో కొందరు అక్రమంగా తరలించుకుపోగా, వారికి కొందరు అధికారులు సహకరించారు. దీంతో ఈ వ్యవహారంలో బాధ్యత వహించాల్సి వస్తుందేమోనన్న భయంతో జలవనరుల శాఖ అధికారులు లెక్కలు సరిచేసుకునే పని మొదలుపెట్టారు. దీంతో సమాచార హక్కు దరఖాస్తులకు అధికారుల నుంచి చిత్రమైన సమాధానాలు వస్తున్నాయి. పోలవరంలో కరిగిపోయిన మట్టి గుట్టల పరిమాణాన్ని తగ్గించేందుకు పావులు కదుపుతున్నారన్న విమర్శలూ లేకపోలేదు.
విచిత్ర సమాధానాలు
కనిపించకుండా పోయిన మట్టి కొంత ఇరిగేషన్ అవసరాల కోసం తరలించాల్సి వచ్చిందని, కొంత దొంగతనాలకు గురైందన్న వివరాలను కూడా జలవనరుల శాఖ అధికారులు పొందుపరుస్తున్నట్టు సమాచారం. పోలవరం సీఈ ఆదేశాల మేరకు ధవళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం భారీగా మట్టిని తరలించినట్టుగా కూడా చూపటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బీబీగూడెం, గన్నవరంలో 19,86,333 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించినట్టుగా చూపారు. ధవళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇక్కడి నుంచి మట్టి తీసుకెళ్లడమేమిటో అర్థంకాని విషయం. అక్కడే స్థానికంగా పెద్ద ఎత్తున మట్టి లభిస్తుంది. ఇక్కడి నుంచి తరలించడం వల్ల అధిక రవాణా వ్యయమవుతుంది. ఇంత ఖర్చుచేసి ధవళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు మట్టి తీసుకెళ్లాల్సిన అవసరమేమిటో అధికారులే చెప్పాలి.
గన్నవరంలో మట్టి హాంఫట్
గన్నవరం పరిధిలో కనిపించకుండా పోయిన పోలవరం మట్టికి అధికారులు కొత్త అర్థం చెబుతున్నారు. చైనేజీ నెంబర్లు 143లో 2,31,245 క్యూబిక్ మీటర్లు, చైనేజీ నెంబర్ 144లో 1,49,897 క్యూబిక్ మీటర్లు, చైనేజీ నెంబర్ 145లో 2,25,025 క్యూబిక్ మీటర్లు, చైనేజీ నెంబర్ 146లో 2,60,489 క్యూబిక్ మీటర్లు, చైనేజీ నెంబర్ 146.285లో 65,796 క్యూబిక్ మీటర్లు.. ఇలా మొత్తంగా 9,32,452 క్యూబిక్ మీటర్ల మట్టి దొంగతనానికి గురైందని సమాధానం ఇచ్చారు. అసలు ఇంత మట్టి దొంగతనానికి గురవుతుంటే, అధికారులు ఏం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి.