Share News

కన్నీటి లంక

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:32 AM

వరద ప్రవాహానికి లంక గ్రామాలు అల్లాడిపోతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి నిరంతరాయంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ అడ్డుగా ఉన్న గ్రామాలను, పంటలను ముంచేస్తూ సముద్రంవైపు పరుగులు పెడుతోంది. గురువారం వరద మరింత పెరగడంతో పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది. పులిగడ్డ ఆక్విడెక్టును తాకతూ ప్రవాహం ముందుకు కదులుతుండగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

కన్నీటి లంక
పులిగడ్డ ఆక్విడెక్టును తాకుతూ వరద

కృష్ణానది వరదతో మునుగుతున్న గ్రామాలు

ఇళ్లు, పంటలు నీటమునక.. రైతులకు తీవ్రనష్టం

ప్రకాశం బ్యారేజీ నుంచి 5 లక్షల క్యూసెక్కులకుపైగా విడుదల

పులిగడ్డ ఆక్విడెక్టును తాకుతూ ప్రవహిస్తున్న వరద

కోతకు గురవుతున్న యడ్లంక కాజ్‌వే.. రాకపోకలు బంద్‌

పడవలపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న లంకవాసులు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి లక్షలాది క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో ఆ నీరంతా ప్రకాశం బ్యారే జీ నుంచి సముద్రంలోకి చేరుతోంది. మధ్యలో ఉన్న లంక గ్రామాలను ముంచేస్తోంది. ఈనెల 28 వరకు వివిధ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వచ్చి చేరుతుందని జలవనరుల శాఖ అధికారుల అంచనా. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు, మూడు నెలల పాటు వరద కొనసాగుతుందని, అప్పటి వరకు లంక గ్రామాలకు పడవ ప్రయాణాలు తప్పవని స్థానికులు చెబుతున్నారు.

జలదిగ్బంధంలో..

కృష్ణానదికి 15 రోజులుగా వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో చల్లపల్లి, తోట్లవల్లూరు, ఘంటసాల, మోపిదేవి తదితర మండలాల్లోని లంక గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. రెండు రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని సముద్రంలోకి వదులుతుండటంతో గ్రామాలకు పడవలే ఆధారమయ్యాయి. తోట్లవల్లూరు మండలంలోని పాముల్లంక, తోడేళ్లదిబ్బ, తుమ్మలపచ్చిక, కనిగిరిలంక, పొట్టిదిబ్బలంక, ములకలలంక, చల్లపల్లి మండలంలోని ఆముదార్లంక తదితర లంకగ్రామాల చుట్టూ వరదనీరు చేరింది. ఈ గ్రామాల్లోని పాఠశాలలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.

కొట్టుకుపోతున్న యడ్లంక కాజ్‌వే

అవనిగడ్డకు అత్యంత సమీపంలోని యడ్లంక కాజ్‌వే వరదలు వచ్చిన ప్రతిసారీ కొట్టుకుపోతోంది. గతనెలలో కృష్ణానదికి వరద వచ్చిన సమయంలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం వస్తున్న వరదనీటి కారణంగా కాజ్‌వే మరింత కోతకు గుర వుతోంది. ఈ కాజ్‌వే బదులు వంతెన నిర్మించాలని యడ్లంకవాసులు కోరుతున్నా ప్రయోజనం లేదు. దీంతోపాటు తోట్లవల్లూరు మండలం పాముల్లంక వద్ద వంతెన నిర్మిస్తామని పాలకులు చెబుతున్నా, కొన్నేళ్లుగా ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.

5 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..

ప్రకాశం బ్యారేజీ నుంచి గురువారం సాయంత్రం 6 గంటలకు 5.08 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో పులిగడ్డ ఆక్విడెక్టును తాకుతూ వరదనీరు ప్రవహిస్తోంది. 8 నుంచి 10 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వదిలితే సురక్షిత ప్రాంతాలకు వస్తామని లంక గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

పంటపొలాలు మునక

కృష్ణానది లంక గ్రామాల్లో చెరకు, కంద, మొక్కజొన్న, తమలపాకు, పసుపు, పూలు, కూరగాయలు, మల్బరీతోటలను ఎక్కువగా సాగు చేస్తారు. ప్రస్తుతం వస్తున్న వరదనీటి కారణంగా లంక భూముల్లోని పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. వారానికి పైగా నీరు పంటపొలాల్లో నిలబడి ఉంటే కంద, పసుపు, కూరగాయల తోటలు చనిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చల్లపల్లి మండలం నడకుదురు గ్రామ పరిధిలోని కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు భూముల్లో సాగు చేసిన పసుపు, కంద తోటలు నీటమునిగాయి. కందపంట మరో రెండు నెలల్లో చేతికి వస్తుందని, ఈ తరుణంలో నీటమునగడంతో దుంపలు భూమిలోనే కుళ్లిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు సాగు చేసి రెండు నెలలైందని, మొక్కదశలో ఉన్న పసుపు పైరు వారానికి పైబడి నీటిలోనే ఉండిపోతే చనిపోతుందంటున్నారు. మోపివేవి మండలం కే కొత్తపాలెం, మోపిదేవివార్పు, బొబ్బర్లంక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో పంటపొలాల్లోకి వరద నీరు చేరుతోంది.

Updated Date - Aug 22 , 2025 | 12:32 AM