విజయవాడ-హైదరాబాద్ బోయింగ్ వైడ్-బాడీ విమానాలు
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:10 AM
విజయవాడ విమానాశ్రయం నుంచి విజయవాడ-హైదరాబాద్ మధ్య వైడ్‌బాడీ విమానాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన కృషి ఫలించింది. ఢిల్లీలోని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన నాయుడు కార్యాలయంలో గురువారం ఇండిగో ఫ్లైట్ స్పెషల్ డైరెక్టర్ ఏకే సింగ్‌తో ఎంపీలు కేశినేని, జీఎం హరీశ్‌తో సమావేశం నిర్వహించారు.
పది రోజుల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు
ఫలించిన ఎంపీ కేశినేని శివనాథ్ కృషి
వన్‌టౌన్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ విమానాశ్రయం నుంచి విజయవాడ-హైదరాబాద్ మధ్య వైడ్‌బాడీ విమానాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన కృషి ఫలించింది. ఢిల్లీలోని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన నాయుడు కార్యాలయంలో గురువారం ఇండిగో ఫ్లైట్ స్పెషల్ డైరెక్టర్ ఏకే సింగ్‌తో ఎంపీలు కేశినేని, జీఎం హరీశ్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ- హైదరాబాద్ మధ్య ఏటీఆర్ విమానాల టికెట్ల వల్ల ప్రయాణికులపై పడే ఆర్థిక భారం, సీట్లు అందుబాటులో ఉండని విషయం, లగేజీ సమస్యలను వివరించారు. ఈ సమస్యలపై ఇండిగో ఫ్లైట్ స్పెషల్ డైరెక్టర్ ఏకే సింగ్ మాట్లాడుతూ వారం, పది రోజుల్లో విజయ వాడ-హైదరాబాద్ మధ్య బోయింగ్ వైడ్-బాడీ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ విమానాలు అందుబాటులోకి వస్తే టికెట్ ధర తగ్గటంతో పాటు సీట్లు అధికంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. లగేజీ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు. ఎంపీ శివనాథ్ కోరిన విధంగా విజయవాడ నుంచి వారణాసి, అహ్మదాబాద్, పుణె, కొచ్చిన, గోవా విమాన సర్వీసులు నడిపించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలైన వారణాసి, కొచ్చిన మధ్య విమాన సర్వీసులు త్వరగా ప్రారంభించాలని కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు ప్రత్యేకంగా కోరారు. తమ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించేందుకు కృషిచేసిన కేంద్రమంత్రి కె.రామ్మోహన నాయుడుకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.