Share News

‘విజయ’పథంలో..

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:24 AM

కృష్ణామిల్క్‌ యూనియన్‌ మరోమారు ‘విజయా’ల రికార్డులను తిరగరాసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,210 కోట్ల టర్నోవర్‌ సాధించి దుమ్ము దులిపింది. ముగిసిన ఆర్థిక సంవత్సరాల ఫలితాలను కృష్ణామిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు సోమవారం చిట్టినగర్‌లోని మిల్క్‌ఫ్యాక్టరీలో మీడియాకు వెల్లడించారు.

‘విజయ’పథంలో..

విజయ డెయిరీ 2024-25 టర్నోవర్‌ రూ.1,200 కోట్లు

కృష్ణామిల్క్‌ యూనియన్‌కు రూ.29 కోట్ల నికర లాభం

రూ.92 కోట్ల నుంచి రూ.230 కోట్లకు చేరిన రిజర్వు నిధులు

2025-26కు రూ.1,350 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం

బుడమేరు ముంపు సమస్యను ఎదుర్కొని విజయం దిశగా..

వార్షిక వివరాలను వెల్లడించిన చైర్మన్‌ చలసాని

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/చిట్టినగర్‌) : కృష్ణామిల్క్‌ యూనియన్‌ మరోమారు ‘విజయా’ల రికార్డులను తిరగరాసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,210 కోట్ల టర్నోవర్‌ సాధించి దుమ్ము దులిపింది. ముగిసిన ఆర్థిక సంవత్సరాల ఫలితాలను కృష్ణామిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు సోమవారం చిట్టినగర్‌లోని మిల్క్‌ఫ్యాక్టరీలో మీడియాకు వెల్లడించారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విజయ డెయిరీ రూ.29 కోట్ల నికర ఆదాయాన్ని పొందింది. నాలుగు త్రైమాసికాల్లో రూ.46 కోట్లను బోనస్‌గా ఇచ్చినప్పటికీ ఇంత భారీ ఆదాయాన్ని సాధించటం గమనార్హం. ప్రస్తుత ఏడాది విజయాకు రూ.23 కోట్ల నిధులు రిజర్వులో ఉన్నాయి. చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు వచ్చాక ఆరేళ్ల పాలకవర్గంలో రూ.92 కోట్ల రిజర్వు నుంచి రూ.235 కోట్ల రిజర్వు స్థాయికి ఎదిగింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,350 కోట్ల టర్నోవర్‌ సాఽధించాలని కృష్ణామిల్క్‌ యూనియన్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

మేలుజాతి పశువుల దిగుమతి వల్లే..

మేలుజాతి పశువులను దిగుమతి చేసుకుని పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా అత్యుత్తమ విజయాన్ని సాధించామని చైర్మన్‌ చలసాని ఆంజనేయులు తెలిపారు. సోమవారం చిట్టినగర్‌ పాలఫ్యాక్టరీలో జరిగిన పాలకవర్గ సమావేశంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి టర్నోవర్‌ను పాలకవర్గం ప్రకటించింది. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా యూనియన్‌ పాటు పడుతోందన్నారు. పాడి రైతులకు అత్యధిక పాల సేకరణ ధరతో పాటు ఏటా రూ.46 కోట్ల బోనస్‌ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారంతో మేలుజాతి పెయ్యదూడల సెమన్‌ (వీర్యం) రూ.500 ఉండగా, ప్రభుత్వం రూ.350 సబ్సిడీ ఇవ్వగా, యూనియన్‌ రూ.100 భరించి రైతుకు రూ.50కే అందిస్తోందన్నారు. పాల ఉత్పత్తి పెంచేందుకు దాణాపై కిలోకు రూ.3 నష్టాన్ని యూనియన్‌ భరిస్తోందని చెప్పారు. ప్రభుత్వం సహకరిస్తే ప్రతి గ్రామంలో గోకుల హాస్టళ్లు పెట్టేందుకు యూనియన్‌ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే నందిగామలోని మునగచర్లలో గోకుల హాస్టల్‌ ఏర్పాటు చేశామన్నారు. గేదెలు కొనేందుకు కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. రుణం చెల్లించిన వెంటనే దానిపై వడ్డీని యూనియన్‌ భరిస్తుందన్నారు. క్షీరబంధు పథకంలో భాగంగా మరణించిన పాడి రైతు కుటుంబానికి రూ.50 వేల చొప్పున 2 వేల మందికి ఇచ్చామని చలసాని తెలిపారు. పాడి రైతుల ఇళ్లలో జరిగే వివాహ కార్యక్రమాలకు కల్యాణమస్తు పథకం కింద రూ.20 వేల విలువైన బంగారు నాణేలను మొత్తం 3,500 మందికి అందజేశామన్నారు. రైతులు వారి కుటుంబ ఆరోగ్యం కోసం హెల్త్‌కార్డులు అందజేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు బాసటగా నిలిచి పాల పదార్థాలు, ఆర్గానిక్‌ పిండివంటలు వంటివి చేసుకునేలా చేయూత నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు

అవరోధాలను అధిగమించి..

కృష్ణామిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ‘విజయ’పథం కొనసాగుతోంది. బుడమేరు ముంపు సమయంలో ముంపు బారిన పడి 49 రోజుల పాటు చిట్టినగర్‌ పాలఫ్యాక్టరీ మూతపడింది. సుమారు రూ.50 కోట్ల మేర నష్టం వచ్చింది. బుడమేరు వరదల కంటే ముందే రూ.200 కోట్లతో వీరవల్లిలో కంప్యూటరైజ్డ్‌, మెకనైజ్డ్‌ డెయిరీని నిర్మించారు. వీరవల్లిలోని పాలఫ్యాక్టరీ ద్వారా బుడమేరు వరదల్లో కూడా పాలకు కొరత రాకుండా విజయా డెయిరీ చర్యలు తీసుకుంది. ఏటా రైతులకు బోనస్‌ ఇవ్వటం అనేది సంస్థకు ఖర్చుతో కూడుకున్న విషయమే అయినా బుడమేరు వంటి విపత్తులో కూడా బోనస్‌ను ప్రకటించింది. ప్రతి త్రైమాసికానికి బోనస్‌ను ప్రక టించడం విజయాకే దక్కింది. ముగిసిన ఆర్థిక సంవత్సర ంలో రూ.46 కోట్లను బోనస్‌గా ప్రకటించింది. మరో రూ.15 కోట్ల మేర పాడి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసింది. మిల్క్‌ఫ్యాక్టరీకి జరిగిన నష్టాన్ని కూడా పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేసి గణనీయంగా పూడ్చారు. విజయా డెయిరీకి ఇప్పుడు అప్పులు అనేవి దాదాపు లేవు. నికర నిల్వలోనే ఉండటం డెయిరీలకు ఆదర్శంగా నిలిచింది.

Updated Date - Sep 09 , 2025 | 12:24 AM