అయోధ్యలో అక్రమాలు
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:56 AM
సాధారణంగా ఒక ఫ్లాట్ నచ్చి, డబ్బు మొత్తం చెల్లించి, రిజిసే్ట్రషన్ కూడా జరిగాక.. ఆ ఫ్లాట్ ఆ యజమానికి కాకుండా మరొకరి ఆధీనంలోకి వెళితే ఎలా ఉంటుంది? గన్నవరంలోని చంద్రిక అయోధ్య గ్రూప్ అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొన్నవారి పరిస్థితి ఇలాగే ఉంది. ఓ సంస్థను నమ్మి, ఆ సంస్థకు మొత్తం డబ్బు చెల్లించి, రిజిసే్ట్రషన్ కూడా జరిగాక.. సదరు సంస్థ మాయమై, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుయాయుడు గుర్రం నాని రంగంలోకి దిగడం, యాజమానిని తానే అని చెబుతూ డబ్బు డిమాండ్ చేస్తుండటం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఓ ఫ్లాట్ కొనుగోలుదారుడు బుధవారం మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేయడంతో బాధితుల జాబితా బయటపడుతోంది.
గన్నవరం చంద్రిక అయోధ్య అపార్టుమెంట్లలో వంశీ అనుయాయుడి దందా
అసలు సంస్థ రాకీ అవెన్యూస్ మాయం
రూ.లక్షలు పెట్టి ఫ్లాట్లు కొన్నవారు లబోదిబో
మాయమైన సంస్థ స్థానంలో వైసీపీ నేత గుర్రం నాని
తానే యజమానినని చెప్పుకొంటూ డబ్బు వసూలు
యజమానులకు ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బందులు
రెరాలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన సైనికోద్యోగి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గన్నవరంలో రాకీ అవెన్యూస్ అనే సంస్థ ‘చంద్రిక అయోధ్య’ పేరుతో గ్రూప్ అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని తలపెట్టింది. మొత్తం 670 ఫ్లాట్లతో కూడుకున్న ఈ అపార్ట్‌మెంట్లు పూర్తయ్యాక రాకీ అవెన్యూస్ సంస్థ కొనుగోలుదారులకు రిజిస్ర్టేషన్ చేసింది. ఫ్లాట్ పొజిషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చి తాళం ఇవ్వాల్సిన తరుణంలో సదరు సంస్థ అదృశ్యమైంది. సంస్థ కార్యాలయం కూడా ఖాళీ అయ్యింది. దీంతో రిజిస్ర్టేషన్ చేసుకున్నవారు ఆందోళన చెందారు. కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్ చేయించుకున్న ఫ్లాట్లను తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ‘చంద్రిక అయోధ్య’లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అనుయాయుడైన గుర్రం నాని ప్రత్యక్షమయ్యాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సదరు రాకీ అవెన్యూస్‌ను బెదిరించి పంపించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అనుమానాలను నిజంచేస్తూ గుర్రం నాని దీనిని టేకోవర్ చేసుకున్న విషయం బయటపడింది. తాము డబ్బు చెల్లించినా ఫ్లాట్లు అప్పగించట్లేదని కాజ రవికిరణ్ అనే సైనికోద్యోగి బుధవారం మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేయటంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనతో పాటు అనేక మంది బాధితులు ఉన్నారని రవికిరణ్ చెబుతున్నారు.
గుర్రం నాని ఎవరు?
గతంలో టీడీపీ నాయకుడు కాసన్నేని రాజాపై దాడి కేసులో గుర్రం నాని నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్‌పై తిరుగుతున్నాడు. ఇలాంటి నాని చేతికి ఇంత పెద్ద బహుళ అంతస్థుల భవనాల సముదాయం ఎలా వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాకీ అవెన్యూస్ ఏమైంది?
రాకీ అవెన్యూస్ అనే సంస్థ కొనుగోలుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అదృశ్యం కావటం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ‘చంద్రిక అయోధ్య’ గుర్రం నాని చేతిలోకి వెళ్లిందని తెలుస్తోంది. అసలు గుర్రం నాని.. రాకీ అవెన్యూస్ దగ్గర ఎంతకు కొన్నారు? ఏ ప్రాతిపదికన కొన్నారన్న దానికి సమాధానం లేదు. ఒకవేళ రాకీ అవెన్యూస్ సంస్థ ఎవరికైనా టేకోవర్ చేయాలంటే.. నిబంధనల ప్రకారం డీడ్ రాసుకోవాలి. ఆ తర్వాతే టేకోవర్ చేయాలి. ఈ విషయాన్ని కొనుగోలుదారులకు చెప్పాలి. కొత్త సంస్థను కొనుగోలుదారులకు పరిచయం చేయాలి. అప్పటి వరకు కొనుగోలుదారులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తాము చేసినవి ఏమిటి? చేయాల్సినవి ఏమిటి? తెలిపాలి. కానీ, ఇవేమీ జరగకుండానే చేతులు మారిపోవటం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
తానే యజమానినంటున్న గుర్రం నాని
రాకీ అవెన్యూస్ నుంచి తాము ఫ్లాట్లు కొనుగోలు చేసినట్టుగా గుర్రం నాని చెప్పినట్టు తెలుస్తోంది. మెయింటినెన్స్ చూడటానికి రాకీ అవెన్యూస్, తమకు మధ్య ఒప్పందం జరిగిందని, తమకు దీనిపై అన్ని హక్కులు ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. అన్ని లెక్కలు పక్కాగా ఉన్నాయని ఆయన కొనుగోలుదారుల దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
కొనుగోలుదారుల గగ్గోలు
చంద్రిక అయోధ్య ఫ్లాట్ ఓనర్స్ గ్రూప్ పేరుతో కొనుగోలుదారులంతా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా వీరంతా గూగుల్ మీట్ పెట్టుకున్నారు. నాలుగు అంశాల అజెండాతో జరిగింది. ఈ మీట్‌లో కొనుగోలుదారులంతా అనేక అంశాలను ప్రస్తావించారు. పూర్తి డబ్బు చెల్లించినా.. రాకీ అవెన్యూస్ అగ్రిమెంట్ ప్రకారం అరకొర పనులే చేసిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తమదే అని చెప్పుకొంటున్న సంస్థ కూడా ఈ విషయంలో బాధ్యత తీసుకోవట్లేదని, చట్టబద్ధమైన పోరాటం జరపాలని, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.
వంశీ అనుయాయుడి నుంచి కాపాడండి.. మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు
బిల్డర్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాదని, వల్లభనేని వంశీ అనుయాయుడు గుర్రం నాని తమను ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, అతని బారి నుంచి రక్షించాలంటూ సైనికోద్యోగి కాజా రవికిరణ్ బుధవారం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఆఫీసు ఏర్పాటు చేసుకుని కొనుగోలుదారులను ఇబ్బందులు పెడుతున్నాడని పేర్కొన్నారు. తాను 2018లో త్రిబుల్ బెడ్‌రూమ్ కొన్నానని, రూ.48 లక్షలు చెల్లించానని, ఆ తర్వాత రాకీ అవెన్యూస్ తనకు ఫ్లాట్‌ను రిజిస్ర్టేషన్ చేసిందని పత్రాలు చూపారు. ఫ్లాట్ పొజిషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేలోపు రాకీ అవెన్యూస్ అదృశ్యమైందని, ఫ్లాట్ పొజిషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వటం బిల్డర్ బాధ్యత అని, ప్రస్తుతం బిల్డర్ స్థానంలో ఉన్న గుర్రం నాని తమకు స్వాధీనం చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌తో సంబంధం లేకుండా రూ.3 లక్షలు చెల్లిస్తేనే తాళం ఇస్తానని అంటున్నాడని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఉండగా, మా అమ్మ ఫోన్‌చేసి ఆందోళన చెందటంతో గన్నవరం వచ్చానని, గుర్రం నానీని కలవగా, గతంలో ఏం జరిగిందో మాకు తెలియదని, రూ.3 లక్షలు చెల్లించాల్సిందేని పట్టుబడుతున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు చంద్రిక అయోధ్యలో ఏడుశాతం మంది ఆక్యుపెన్సీ అయ్యారని, అందులో చాలావరకు నానీకి సంబంధించిన వారే ఉంటున్నారని తెలిపారు. కొంతమంది డబ్బు చెల్లించి ఫ్లాట్లు స్వాధీనం చేసుకున్నా.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. ఇంటీరియర్ పనులు చేయించుకోవటానికి బయటి వారిని అనుమతించట్లేదని, తమవారే చేస్తారని బలవంతం చేస్తున్నారని, ఒకవేళ కాదంటే రూ.2 లక్షలు చెల్లించి బయటి వారితో చేయించుకోండి అంటున్నారని రవికిరణ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆయన కొద్దిరోజుల కిందట రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కి కూడా ఫిర్యాదు చేశారు. వారు.. రాకీ అవెన్యూస్‌కు నోటీసులు ఇచ్చారు. అయినా సమాధానం లేకపోవడంతో రెరాలో విచారణ సాగుతోంది. వినియోగదారుల కోర్టులో కూడా రవికిరణ్ కేసు వేయటంతో రాకీ అవెన్యూస్ యాజమాన్యానికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీ అనుయాయుల నుంచి తమను కాపాడి కొనుగోలుదారులకు ఫ్లాట్లు ఇప్పించాల్సిందిగా రవికిరణ్.. మంత్రి లోకేశ్‌ను మెయిల్ ద్వారా కోరగా, చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.