Share News

బుసలు కొడుతున్న బుసక వ్యాపారం

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:25 AM

బందరు నార్త్‌ మండలంలోని ముడా భూముల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వైసీపీ నాయకులతో కూటమి నేతలు జతకలిసి యథేచ్ఛగా మట్టిని అమ్ముకు తింటున్నారు. ఏకంగా రెండు రోజుల కిందట అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీ చేసుకోవడమే కాకుండా, బుసక అక్రమ రవాణాపై తీర్మానాలు కూడా చేసుకున్నారు. ఆదాయ, వ్యయాలపై లెక్కలు గట్టారు. రానున్న రోజుల్లో కూడా ఐకమత్యంగా ఉండి, రోజువారీ ఆదాయం తెచ్చి పెడుతున్న బుసక దందాను కొనసాగించాలని నిర్ణయించారు.

బుసలు కొడుతున్న బుసక వ్యాపారం
మంగినపూడి బీచ్‌ రోడ్డు వెంబడి టిప్పర్లతో బుసకను తరలిస్తూ..,

బందరు నార్త్‌ మండలంలో యథేచ్ఛగా తవ్వకాలు

రెండు రోజుల కిందట అక్రమార్కుల రహస్య సమావేశం

వైసీపీ నాయకులతో కలగలిసిన కూటమి నేతలు

వచ్చిన సొమ్మును సమంగా పంచుకోవాలని తీర్మానం

పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : బందరు నార్త్‌ మండలంలోని ముడా, ప్రభుత్వ భూములు 600 ఎకరాల్లో నుంచి ప్రభుత్వానికి ఒక్క రూపాయి సీనరేజీ చెల్లించకుండా బుసకను తవ్వేస్తున్నారు. వైసీపీ హయాంలో బుసకను తవ్వి విక్రయించడంలో అనుభవం ఉన్న వారితో కొందరు కూటమి నాయకులు కలిశారు. వీరంతా కలిసి ప్రభుత్వ భూముల నుంచి బుసకను తవ్వి లోడ్‌ చేసినందుకు టిప్పర్‌కు రూ.4,500, ట్రాక్టర్‌కు రూ.500 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములను తమ సొంతంగా భావించి ఇంత పెద్దమొత్తంలో వ్యాపారం చేస్తున్నా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు కన్నెత్తి చూడట్లేదు. బందరు పోర్టుకు మెటీరియల్‌ను రవాణా చేసే రహదారి వెంబడి పగలు, రాత్రి తేడా లేకుండా టిప్పర్లు, ట్రాక్టర్లు తరలిపోతున్నా పట్టించుకునేవారు లేరు.

చేతివాటాలపై అంతర్గత సమావేశం

బుసక అక్రమ రవాణా చేసే వారంతా రెండు రోజుల క్రితం మంగినపూడి బీచ్‌కు వెళ్లే రహదారి వెంబడి ఉన్న ఓ అమ్మవారి గుడి సమీపంలో సమావేశం నిర్వహించారు. కరగ్రహారం, గోపువానిపాలెం, తపశిపూడి, మంగినపూడి ప్రాంతాల్లో ఎక్కడ బుసక తవ్వకాలు చేపట్టినా, అందరం ఒకే ధరకు విక్రయించాలని నిర్ణయించారు. లెక్కలు మాత్రం కచ్చితంగా ఉండాలని, వారం చివర్లో లెక్కలు చూసుకుని, ఎవరి వాటాలు వారికి ఇవ్వాలని, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవద్దని ఒప్పందం చేసుకున్నారు. ఓ నాయకుడు అధికారులతో మాట్లాడతాడని, అతను చెప్పినట్టుగా నడుచుకోవాలని ఏకంగా తీర్మానం చేయడం గమనార్హం. వైసీపీ, కూటమి నాయకుల్లోని ఒక సామాజికవర్గానికి చెందినవారు ఈ సమావేశంలో పాల్గొని దందా యావత్తూ వారి చేతుల్లోనే నడవాలని, వేరెవరినీ రానివ్వకుండా అడ్డుకోవాలని హుకుం జారీ చేశారు. దీనిపై కొందరు కూటమి నాయకులు రుసరుసలాడుతున్నారు. పార్టీ కోసం అందరూ పనిచేశారని, కొందరు మాత్రం ఇదే అదనుగా భావించి బుసకను అక్రమంగా తవ్వేస్తూ సొమ్ము చేసుకోవడం ఎంతవరకు సమంజసమనే వాదనను వినిపిస్తున్నారు. సముద్ర తీర గ్రామాలకు ముప్పుతెచ్చేలా ఈ తవ్వకాలు జరుగుతున్నాయని, పార్టీకి చెడ్డపేరు వస్తుందని, భవిష్యత్తులో ప్రజలు ఈ విషయంపై ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని వారు చర్చించుకుంటున్నారు.

ఎవరా చోటా నాయకుడు

సముద్ర తీరంలోని ప్రభుత్వ భూముల నుంచి బుసకను అక్రమంగా తరలిస్తున్న అంశంపై ఈ చోటా నాయకుడిపై సీఎంవోకు అనేక ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ మంగినపూడి పరిసర గ్రామాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న కొందరు పెద్దలు బుసక రవాణాకు అండగా నిలుస్తున్నారు. ఈ చోటా నాయకుడు స్థానిక ప్రజాప్రతినిధికి, ప్రతిపక్ష నాయకుడికి కూడా అనుకూలంగా ఉంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకులతో అంటకాగుతున్న ఈ చోటా నాయకుడు మైనింగ్‌ విభాగం అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని బుసక అక్రమ రవాణావైపు రాకుండా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి మాటకన్నా, ఈ చోటా నాయకుడు చెప్పినట్టుగానే మైనింగ్‌ అధికారులు వ్యవహ రిస్తున్నారని చెబుతున్నారు. బుసక అక్రమ తవ్వకాలు, విక్రయాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న కొందరు తాము చెప్పినట్టుగానే మండలంలోని రాజకీయం, ఇతరత్రా వ్యవహారాలు నడుస్తాయని తప్పుడు సంకేతాలు ఇస్తుండటంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది.

చినయాదరలో వేగవంతం

పెదయాదర పంచాయతీ శివారు చినయాదరలోని తుమ్మాచెరువు నుంచి మట్టి అక్రమ తవ్వకాలను రెండు రోజులుగా వేగవంతం చేశారు. గతంలో ట్రాక్టర్ల ద్వారా మాత్రమే మట్టిని తరలించిన స్థానిక ప్రజాప్రతినిధి.. రెండు రోజులుగా టిప్పర్లను రంగంలోకి దించి మట్టిని తరలిస్తున్నాడు. దీనిపై స్థానికులు ఫొటోలు తీసి మరీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అటువైపు చూడలేదు.

Updated Date - Jul 11 , 2025 | 12:25 AM