కృష్ణానదిలో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి
ABN , Publish Date - May 25 , 2025 | 01:42 AM
భవానీఘాట్ వద్ద కృష్ణానదిలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు బాలురిను మత్యువు కబళించింది.
విద్యాధరపురం, మే 24(ఆంధ్రజ్యోతి): భవానీఘాట్ వద్ద కృష్ణానదిలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు బాలురిను మత్యువు కబళించింది. భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. ఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గొల్లపూడి పంచాయతీ పరిధి రామరాజ్యనగర్ మిల్క్‌కాలనీలో మీసాల కృష్ణకిషోర్, భార్య, ఇద్దరు కుమారులతో ఉంటున్నాడు. కబేళా ప్రాంతంలో రంగుల కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని రెండో కుమారుడు రిత్విక్(15) భవానీపురంలోని ఓ ప్రైవేట్ స్కూలులో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. శుక్రవారం తాను చదివే స్కూల్‌కు వెళ్లి టీసీ తీసుకున్నాడు. భవానీపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్‌లో సోమవారం చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి అదే ప్రాంతానికి చెందిన కనుమూరి చైతన్య ఇతని సోదరుడు ఏడో తరగతి చదువుతున్న గిరీశ్వర్(12) బొడ్డు భార్గవ్, కాకర్లపూడి లోహిత్, రాయప్ప వర్మతో కలిసి నడుచుకుంటూ భవానీఘాట్ వద్ద కృష్ణానది వద్దకు వెళ్లారు. చైతన్య, భార్గవ్, లోహిత్ నది ఒడ్డున ఉండగా, గిరీశ్వర్, రుత్విక్‌లు నదిలో ఈత కు దిగారు. కొద్దిదూరం వెళ్లి మరలా బయటకు వచ్చే మార్గంలో ఒక చోట లోతుగా ఉండడంతో గిరీశ్వర్ మునిగిపోతూ రుత్విక్‌ను పట్టుకున్నాడు. రుత్విక్‌కు ఈత వచ్చినప్పటికీ నీటి ప్రవాహం, గిరీశ్వర్ పట్టుకోవడం వంటి కారణాల వల్ల ఇద్దరూ నీటిలో మునిగారు. ఒడ్డున ఉన్న చైతన్య గమనించి తన తల్లికి సెల్ ఫోన్ ద్వారా సమాచారం తెలిపాడు. ఆమె వెంటనే తమ ఇంటి సమీపంలో ఉన్న కృష్ణ కిషోర్‌ను తీసుకుని భవానీఘాట్ వద్దకు వచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, భవానీపురం పోలీసులు రంగంలోకి దిగి నదిలో మునిగి పోయిన ఇద్దరు బాలురు ఆచూకీ కోసం గాలించి, వారి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిఇకి తరలించారు. రిత్విక్ తండ్రి కృష్ణకి షోర్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గిరీశ్వర్ తండ్రి మోహనరావు గవర్నరుపేటలోని ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు.