పగతోనే జంట హత్యలు
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:01 AM
ఇద్దరు స్నేహితులు మరో ఇద్దరితో కలిసి మందు పార్టీలు ఏర్పాటు చేసుకునేవారు. అదే గదిలో ఉంటున్న రౌడీషీటర్‌కు అది నచ్చేది కాదు. ఇక్కడి నుంచి మొదలైన వివాదమే జంట హత్యలకు దారితీసింది.
మద్యంతో మొదలై.. డబ్బు పంపకాల వరకూ..
రౌడీషీటర్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
విజయవాడ, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : ఇద్దరు స్నేహితులు మరో ఇద్దరితో కలిసి మందు పార్టీలు ఏర్పాటు చేసుకునేవారు. అదే గదిలో ఉంటున్న రౌడీషీటర్‌కు అది నచ్చేది కాదు. ఇక్కడి నుంచి మొదలైన వివాదమే జంట హత్యలకు దారితీసింది. గవర్నరుపేటలో అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా ఉన్న వీధిలో రాజు, వెంకటరమణను దారుణంగా హత్య చేసిన రౌడీషీటర్ జమ్ము కిషోర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించారు. నైజాంగేటు ప్రాంతానికి చెందిన జమ్ము కిషోర్ భార్యతో గొడవలు పడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. క్యాటరింగ్ పనులు చేస్తున్న కిషోర్ గదికి వచ్చేసరికి పలుమార్లు రాజు, వెంకటరమణ మందు పార్టీ చేసుకుంటూ కనిపించేవారు. శివ భక్తుడైన కిషోర్ పూజ చేసుకునే సమయంలో ఆ స్నేహితులిద్దరూ సెల్‌ఫోన్‌లో పాటలు వినేవారు. పూజ చేసుకునేటప్పుడు పాటలు పెట్టడం వల్ల ఇబ్బందిగా ఉంటోందని వారితో గొడవలు పడ్డాడు. ఈ మొత్తం గొడవలతో వారిపై కిషోర్ పగ పెంచుకున్నాడు. డబ్బు పంపిణీలో వచ్చిన వివాదంతో ఈ పగ మరింత పెరిగింది. 16వ తేదీన జరిగిన గొడవలో రాజు, వెంకటరమణను కత్తితో పొడిచి పారిపోయాడు. ఏలూరు రోడ్డు మీదకు వెళ్లి ఆటో ఎక్కి హనుమాన్‌పేటలో దిగాడు. అక్కడ ఉన్న విశ్వేశ్వరయ్య పార్కు వద్దకు నడుచుకుంటూ వెళ్లి కత్తిని పాలిథిన్ కవర్‌లో చుట్టి పార్కులో ఉన్న పొదల్లోకి విసిరేశాడు. అక్కడి నుంచి నైజాంగేటుకు చేరుకుని రైల్లో సికింద్రాబాద్ పారిపోయాడు. సాంకేతికంగా గుర్తించిన పోలీసులు అతడ్ని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు. కిషోర్‌ను విజయవాడ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు.
రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
జంట హత్యల్లో విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉన్న రాజు మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం చేశారు. రాజు, వెంకటరమణ మృతదేహాల్లో రాజు మృతదేహం మార్చురీలో ఉండిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘అంతిమంగా విడిపోయారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇంట్లో జరిగిన వివాదంతో రాజు బయటకు వచ్చి వేరుగా ఉంటున్నాడు. రాజు చనిపోయాడని పోలీసులు సమాచారం ఇచ్చినా గురువారం వరకు అతడి కుటుంబ సభ్యులు రాలేదు. వైఎస్సార్ కాలనీలో ఉంటున్న ఆయన అన్నయ్య అప్పలనాయుడు ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. పోస్టుమార్టం పూర్తిచేసి రాజు మృతదేహాన్ని ఆయనకు అప్పగించారు.