సంతృప్తిగా తినండి
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:03 AM
రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి, వారు స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డ్వాక్రా గ్రూపు మహిళలతో తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. నగరంలోని వన్‌టౌన్ పంజా సెంటర్‌లో ఏర్పాటుచేసిన తృప్తి క్యాంటీన్‌ను శనివారం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.తేజ్ భరత, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు.
డ్వాక్రా గ్రూపు సభ్యులతో రుచికరమైన ఆహారం
పీ4లో భాగంగానే క్యాంటీన్ల నిర్వహణ
మహిళా పారిశ్రామికీకరణకు సీఎం శ్రీకారం
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్
పంజా సెంటర్‌లో తృప్తి క్యాంటీన్ ప్రారంభం
వన్‌టౌన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి, వారు స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డ్వాక్రా గ్రూపు మహిళలతో తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. నగరంలోని వన్‌టౌన్ పంజా సెంటర్‌లో ఏర్పాటుచేసిన తృప్తి క్యాంటీన్‌ను శనివారం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.తేజ్ భరత, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 750 క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెల్లూరులో తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయగా, రోజూ 10 వేల నుంచి 15 వేల వరకు ఆదాయం డ్వాక్రా మహిళలకు వస్తోందన్నారు. 30 వేల మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. అందులో భాగంగానే పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు తృప్తి క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను అందిస్తున్నామని చెప్పారు. నెల్లూరులో ఏర్పాటుచేసిన తొలి క్యాంటీన్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారని తెలిపారు. తక్కువ ధరకే ప్రజలకు భోజనం అందించటంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించటమే తృప్తి క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. ఆ లక్ష్య సాధన దిశగా కృషిచేస్తూ డ్వాక్రా మహిళల జీవనోపాధి పెంచేలా కృషి చేస్తామన్నారు. విజయవాడ నగరంలో మరికొన్ని చోట్ల అన్న క్యాంటీన్ల మాదిరిగా తృప్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీఎస్టీతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం రూ.14,51,400 అవుతుందన్నారు. అందులో 75 శాతం డ్వాక్రా మహిళలు, 25 శాతం సారాస్ ఏజెన్సీ లోన్ ద్వారా సమకూరుస్తారన్నారు. నలుగురు మహిళా సభ్యులను ఒక యూనిట్‌గా ఏర్పాటుచేసి వారికి క్యాంటీన్ అప్పగిస్తామన్నారు. నిర్వహణ కోసం కంటైనర్‌ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను సారా ప్రాజెక్టు మేనేజింగ్ పార్టనర్ జె.సాయినాథ్ పర్యవేక్షిస్తారని సురేష్ చెప్పారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.తేజ్ భరత మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త, ఒక ఉద్యోగి ఉండాలనే ముఖ్యమంత్రి కార్యాచరణకు అనుగుణంగా తృప్తి క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగరంలో 11 అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయని, వాటికి అనుగుణంగా డ్వాక్రా మహిళలతో తృప్తి క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. ఈ క్యాంటీన్లలో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయన్నారు. నగరంలో మరో రెండు క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం డ్వాక్రా మహిళలకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అందించిన రూ.10,88,550 రుణ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ హర్జితసింగ్, డ్వాక్రా మహిళలు, వివిధ విభాగాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.