Share News

బదిలీల రచ్చ

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:34 AM

జిల్లాలోని సచివాలయాల్లో బదిలీల అంశం ప్రహసనంగా మారింది. సచివాలయ కార్యదర్శుల బదిలీలు ఇంకా కొలిక్కి రాలేదు. పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ , సంక్షేమ శాఖల అధికారులు తమ చిత్తానుసారంగా జాబితాలు రూపొందించారని, 100 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు తమను బదిలీ చేశారని రోడ్డెక్కి ఆందోళనలు చేసే వరకు పరిస్థితి వెళ్లింది. సమస్య పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్‌ ఆదేశించినా స్పందన లేకపోవడంతో వారంతా నిరసన బాట పట్టారు. వ్యవసాయ శాఖలోని బదిలీలపై అసిస్టెంట్లు కోర్టును ఆశ్రయించారు. - మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి

బదిలీల రచ్చ
సోమవారం రాత్రి వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న ఆ శాఖ అసిస్టెంట్లు

జిల్లాలో కొలిక్కిరాని సచివాలయ ఉద్యోగుల బదిలీలు

రచ్చకెక్కుతున్న వివాదాస్పద జాబితాలు

తప్పులతడకగా మహిళా పోలీసుల లిస్టు

పంచాయతీ గ్రేడ్‌-5 కార్యదర్శుల బదిలీల్లో మతలబు

సంక్షేమ శాఖల్లో ఇష్టానుసారంగా మార్పులు

కోర్టును ఆశ్రయించిన వ్యవసాయ శాఖ అసిస్టెంట్లు

  • వ్యవసాయ శాఖలో కొలిక్కిరాని బదిలీలు

ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని గ్రామ సచివాలయాల్లో పనిచేసే వ్యవసాయ శాఖ అసిస్టెంట్లను ఇటీవల బదిలీ చేస్తూ జాబితా విడుదల చేశారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలనే నిబంధనతో ఈ బదిలీలు జరిగాయి. అయితే, శాసనసభ్యుల సిఫార్సు లేఖలను ఆధారంగా చేసుకుని అసిస్టెంట్లను కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సీనియారిటీ ఉన్నవారు కోరుకున్న ప్రాంతాల్లో కాకుండా 100 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు బదిలీ అయ్యారు. తమ కంటే జూనియర్లను వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేశారని, తమను మాత్రం దూరప్రాంతాలకు పంపారని సీనియర్లంతా కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నారు. కలెక్టర్‌కు తమ గోడు తెలుపుకొన్నారు. మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పట్టుబట్టారు. వీరి సమస్యను అధికారులు పరిష్కరించకపోగా, బదిలీల జాబితాలను విడుదల చేశామని, అందుకు అనుగుణంగా వెళ్లాలని హుకుం జారీచేశారు. దీంతో వ్యవసాయ శాఖ అసిస్టెంట్లు సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయం ఎదుట భైఠాయించారు. అయినా అధికారులు స్పందించలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు.

  • పంచాయతీరాజ్‌లో రెండో జాబితా

ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని పంచాయతీరాజ్‌ విభాగం అధికారులు బదిలీల జాబితాలను ఇష్టానుసారంగా తయారుచేసి విడుదల చేశారు. గ్రేడ్‌-5 సెక్రటరీలను ఒక్కో సచివాలయానికి ఒక్కరినే కేటాయించాలి. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు, ఇతరత్రా సిఫార్సులు వచ్చాయనే కారణాలు చూపి అధికశాతం సచివాలయాల్లో ఇద్దరేసి చొప్పున బదిలీ చేశారు. ఈ విషయాన్ని డీపీవో కార్యాలయ అధికారులకు తెలియజేయడంతో ఆ తప్పులను సరిదిద్ది, రెండో జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాపై కలెక్టర్‌తో సంతకం చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలను డీపీవో కార్యాలయంలో కాకుండా పెనమలూరు, గంగూరులో తయారు చేశారని, ఇందులో ఏదో మతలబు ఉందని సచివాలయ కార్యదర్శులు చెప్పుకొంటున్నారు. దివ్యాంగురాలైన ఓ మహిళా సచివాలయ కార్యదర్శి.. తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ నిబంధనల మేరకు దగ్గరలోని సచివాలయానికి బదిలీ చేయాలని కోరింది. ఆమె అభ్యర్థనను పట్టించుకోని డీపీవో కార్యాలయ అధికారులు 60 కిలోమీటర్ల దూరంలోని సచివాలయానికి బదిలీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • ఎటూ తేలని సాంఘిక సంక్షేమ శాఖ బదిలీలు

సాంఘిక సంక్షేమ శాఖలో బదిలీల జాబితాలను తయారుచేసి ఇంతవరకు విడుదల చేయలేదు. ఈ కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బంది ఈ జాబితాలను శాసనసభ్యుల కార్యాలయాలకు పంపారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యేలు తాము పంపిన సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోకుండా, ఇష్టారాజ్యంగా బదిలీలు ఎలా చేస్తారని మండిపడ్డారు. దీంతో ఈ శాఖకు చెందిన సచివాలయ ఉద్యోగుల బదిలీల జాబితాలు సిద్ధం కావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.

  • వివాదాస్పదంగా మహిళా పోలీసుల బదిలీలు

సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసుల బదిలీల్లోనూ తప్పులు దొర్లాయి. సమస్యను పరిష్కరించాలని వారు పలుమార్లు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. రెండోసారి మహిళా పోలీసులకు కౌన్సెలింగ్‌ నిర్వహించినా, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఈ ప్రక్రియ కూడా కొలిక్కి రాకపోవడంతో వారంతా ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:34 AM