Share News

రవాణాకు బ్రేక్‌

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:34 AM

మొంథా తుఫాను ప్రభావం రవాణా రంగంపై భారీగా పడుతోంది. తుఫాను తీరం దాటక ముందే ముఖ్యమైన రవాణా వ్యవస్థలు బంద్‌ అవుతున్నాయి. భారీగా రైళ్లు, ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. అలాగే, విజయవాడ విమానాశ్రయం నుంచి విమానాలు సైతం రద్దయ్యాయి.

రవాణాకు బ్రేక్‌

మొంథా తుఫానుతో అతలాకుతలంగా..

రికార్డుస్థాయిలో రైళ్ల రద్దు.. బస్సులు స్వల్పంగా..

36 విమానాలు కూడా క్యాన్సిల్‌

అత్యవసర ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మొంథా తుఫాను ప్రభావం రవాణా రంగంపై భారీగా పడుతోంది. తుఫాను తీరం దాటక ముందే ముఖ్యమైన రవాణా వ్యవస్థలు బంద్‌ అవుతున్నాయి. భారీగా రైళ్లు, ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. అలాగే, విజయవాడ విమానాశ్రయం నుంచి విమానాలు సైతం రద్దయ్యాయి.

రికార్డుస్థాయిలో 100 రైళ్లు రద్దు

విజయవాడ డివిజన్‌ పరిధిలో రికార్డు స్థాయిలో 95 రైళ్లు రద్దయ్యాయి. సోమవారం నాటి మొదటి బులెటిన్‌లో 54 రైళ్లు, రెండో బులెటిన్‌లో 16 రైళ్లు, మూడో బులెటిన్‌లో మరో 25 రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇవన్నీ విజయవాడ డివిజన్‌ పరిధిలో కోస్తా ప్రాంతాలను అనుసంధానం చేసేవే. ఇవికాకుండా ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే కూడా మచిలీపట్నం, విజయవాడ.. ఆపైకి వెళ్లే రైళ్లను రద్దు చేసింది. రాత్రి 8 గంటల నాటికి మొత్తం 100కు పైగా రద్దు చేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం, నర్సాపూర్‌, భీమవరం, తిరుపతి, కడప, కాకినాడ పోర్టు, రాజమండ్రి, రేపల్లె, తెనాలి, నిడదవోలు, భీమవరం టౌన్‌, ఒంగోలు మధ్య రాకపోకలు సాగించే రైళ్లన్నీ దాదాపు రద్దయ్యాయి. అలాగే, భువనేశ్వర్‌, షాలిమార్‌, హౌరా, పూరి, బెంగళూరు, పుదుచ్చేరి, చెన్నై మధ్య కూడా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వేషన్‌ ప్రయాణికులకు రిఫండ్‌ చెల్లించేందుకు రైల్వే అధికారులు ప్రత్యక కౌంటర్లు సిద్ధం చేశారు.

రోడ్డు రవాణాపై స్వల్ప ప్రభావం

తుఫాను ప్రభావం ఆర్టీసీపై కాస్త తక్కువగా ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రికి నడిచే 22 సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో విశాఖపట్నం నడిచేవి రెండు ఏసీ బస్సులు కాగా, మిగిలినవన్నీ ఆల్ర్టా డీలక్స్‌ సూపర్‌ లగ్జరీ బస్సులు. రోజూ విజయవాడ నుంచి విశాఖపట్నం 70 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 10 మాత్రమే తగ్గించారు. కాకినాడ, రాజమండ్రి రూట్లలో 54 ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా, 12 తగ్గించారు. ప్రస్తుతం రవాణా అధికారుల తనిఖీల నేపథ్యంలో ప్రైవేట్‌ బస్సులు చాలావరకు నిలిచిపోయాయి. ప్రైవేట్‌ బస్సుల్లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారంతా ఆర్టీసీ బస్సులవైపు వస్తున్నారు. మంగళవారం పరిస్థితిని బట్టి మరిన్ని ఆర్టీసీ సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉంది.

విమానాలు సగం రద్దు

విజయవాడ విమానాశ్రయం నుంచి భారీగా విమానాలు రద్దయ్యాయి. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్‌ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి మొత్తం మంగళవారం నడిచే 36 విమాన సర్వీసులు రద్దయ్యాయి. రద్దు చేసిన వాటిలో విజయవాడ నుంచి షార్జా, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు సర్వీసులు ఉన్నాయి. 80 శాతం విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Oct 28 , 2025 | 12:35 AM