Share News

విద్యుదాఘాతానికి ముగ్గురు బలి

ABN , Publish Date - May 25 , 2025 | 01:37 AM

విద్యుదాఘాతం ముగ్గురిని బలి తీసుకుంది. బెంజిసర్కిల్‌ సమీపాన ఉన్న నారా చంద్రబాబునాయు డు కాలనీలో శనివారం ఈ ఘటన జరిగింది.

విద్యుదాఘాతానికి ముగ్గురు బలి

విజయవాడలో దుర్ఘటన

విజయవాడ, మే 24(ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతం ముగ్గురిని బలి తీసుకుంది. బెంజిసర్కిల్‌ సమీపాన ఉన్న నారా చంద్రబాబునాయు డు కాలనీలో శనివారం ఈ ఘటన జరిగింది. ఐటీఐ విశ్రాంత ప్రిన్సిపాల్‌ పెరవళి రామకనక దుర్గాప్రసాద్‌ భార్య పెరవళి ముత్యావలి.. నారా చంద్రబాబునాయుడు కాలనీలో సాయి టవర్స్‌ జీఎఫ్‌2 ఫ్లాట్‌లో ఉంటున్నారు. దుర్గాప్రసాద్‌ చేసిన అప్పులు తీర్చకపోవడంతో కోర్టు ఆ ఫ్లాట్‌ను జప్తు చేసింది. ఫ్లాట్‌ ఖాళీ చేయాల్సి రా వడంతో ముత్యావలి అన్నయ్య, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సలాది ప్రసాద్‌, ఆయన సతీమణి ఊటుకూరి రాధ కొద్దిరోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. ఇంట్లోని సా మాన్లు పార్శిల్‌ చేస్తున్నారు. శనివారం ఉదయం ప్రసాద్‌ కుళాయి వద్ద దుస్తులు ఉతుకుతుండగా, ముత్యావలి తీగపై వాటిని ఆరేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలింది. ప్రసాద్‌ తన సోదరిని కాపాడే ప్రయత్నంలో ఆమెను పట్టుకున్నాడు. తడి చేతులతో పట్టుకోవడంతో ఆయన కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. భర్త ప్రసాద్‌ కేకలు విని, ఇంట్లో ఉన్న భార్య రాధ కూడా ఆయన్ను రక్షించే ప్రయత్నం చేయడంతో షాక్‌ తగిలింది. గుమ్మానికి ఎదురుగా ముత్యావలి, ప్రసాద్‌, కొద్దిదూరంలో రాధ పడిపోయారు. వీరి కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి వెంటనే ఫ్యూజులు లాగేశారు. అప్పటికే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.

ఇనుప రాడ్డే మృత్యువు

ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి..

రాజమండ్రి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

విజయవాడ, మే 24(ఆంధ్రజ్యోతి): మరో రెండు రోజులు ఆగితే ఆ ఇంటితో సంబంధమే తెగిపోతుంది. కోర్టు ఉత్తర్వులతో రుణం తీరిన ఆ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇనుప రాడ్డు మృత్యువుగా మారింది. దాని ద్వారా ప్రవహించిన విద్యుత్‌ క్షణాల వ్యవధిలో ముగ్గురి ప్రాణాలను చుట్టేసింది. పటమటలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీ సాయి టవర్స్‌లో ముగ్గురు దుర్మరణానికి ఇనుప రాడ్డు కారణమని విద్యుత్‌ సిబ్బంది, పోలీసులు గుర్తించారు. సాయి టవర్స్‌లో జీఎఫ్‌ 2లో ఉంటున్న పరిమళ ముత్యావలి, ఆమె సోదరుడు సలాది ప్ర సాద్‌, ఆయన భార్య ఊటుకూరి రాధా విద్యుదాఘాతంతో చనిపోయారు. పడమర వైపు ఉన్న గోడకు ఒక ఇనుపరాడ్డును దిగ్గొటారు. దానికి ఇనుప జియో తీగను గేటు వద్ద ఉన్న పిల్లర్‌కు బిగించారు. భవనం పాత పడిపోవడంతో గోడల నుంచి నీరు లీకవుతోంది. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి గోడలన్నీ తడిసి ముద్దయ్యాయి. దీనితో వైరింగ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. గోడలన్నీ తడిసిపోయి ఉండడంతో విద్యుత్‌ గోడకు ఉన్న ఇనుపరాడ్‌కు చేరింది. ముత్యావలి తీగపై ఉన్న దుస్తులను తీస్తుండగా ఆమెకు షాక్‌ తగిలింది. గేటు వద్ద దుస్తులు ఉతుకుతున్న ప్రసాద్‌ తడి నేలపై వెళ్లి ఆమెను పట్టుకోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ప్రసాద్‌ భార్య రాధాది ఇదే పరిస్థితి. ముత్యావలికి విద్యుత్‌ షాక్‌ తగిలిన తర్వాత ప్రసాద్‌ వెంటనే పక్కన ఉన్న వాచ్‌మన్‌ కుమార్తె ప్రభావతిని పిలిచాడు. ఆమెపై అంతస్తుల్లో ఉన్న వారిని పిలిచే వరకు ప్రసాద్‌ ఆగలేదు. ఆయన కొన్ని నిమిషాలు ఆగి ఉంటే ప్రసాద్‌, ఆయన సతీమణి రాధా ప్రాణాలతో బయటపడేవారు. ఈ ముగ్గురి మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. రాజమహేంద్రవరం నుంచి ప్రసాద్‌ పెద్దకుమార్తె అలేఖ్య, ఆమె మావయ్య మార్చురీ వద్దకు వచ్చారు. ముత్యావలీ ముందు భర్త కుమారుడు రాజమహేంద్రవరం నుంచి వచ్చాడు. రాధా అల్లుడు వంశీ, కుమార్తె ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఇద్దరు అక్కడ శాంతినగర్‌లో ఉంటున్న హోటల్‌లో పనిచేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న సలాది ప్రసా ద్‌ 2020వ సంవత్సరం నుంచి రాధాతో సహజీవనం చేస్తున్నాడు. ముత్యావలి ఐటీఐ విశ్రాంత ప్రిన్సిపాల్‌ దుర్గాప్రసాద్‌ను వివాహం చేసుకుని విజయవాడలో స్థిరపడ్డారు. కొద్దినెలలుగా వారి మధ్య వివాదాలు జరగడంతో దుర్గాప్రసాద్‌ పోరంకిలో వేరుగా ఉంటున్నారు. ఈ మూడు మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులు వేర్వేరుగా రాజమండ్రికి తీసుకెళ్లారు.

Updated Date - May 25 , 2025 | 01:37 AM