నిండు నిర్లక్ష్యం
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:42 AM
విజయవాడ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. నగరంలోని మ్యాన్‌హోల్‌లో పడి ఒకరు, డ్రెయిన్ వెంబడి నీటిలో పడి మరొకరు మృతిచెందగా, భారీగాలులకు రోడ్లపై పడిన చెట్లను సకాలంలో తొలగించక చీకట్లో చెట్టును ఢీకొని ఇంకొకరు మృతిచెందారు. - వన్‌టౌన్/గుణదల
కార్పొరేషన్ అధికారుల అలక్ష్యానికి ముగ్గురు మృతి
కొత్తపేటలో ఇద్దరు.. గుణదలలో మరొకరు
వర్షపు నీటిలో కనిపించని మ్యాన్‌హోల్స్, డ్రెయిన్లు
కొత్తపేట మ్యాన్‌హోల్‌లో పడి టీడీపీ నేత..
వర్షపునీటిలో పడి మరొకరు..
గుణదలలో రోడ్డుపై నేలకొరిగిన చెట్టును ఢీకొని..
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
మ్యాన్‌హోల్‌లో మునిగిపోయి..
కొత్తపేట గులాం మొహిద్దీన్ వీధి రోడ్డులో అభివృద్ధి పనులు జరుగుతున్న మ్యాన్‌హోల్‌లో పడి టీడీపీ 53వ డివిజన్ అధ్యక్షుడు, మెడికల్ వ్యాపారి తిరువాయిపాటి మధుసూదన్‌రావు (52) మృతిచెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తిరుమల మెడికల్ ఏజెన్సీ పేరుతో మెడికల్ వ్యాపారం చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట టీడీపీలో చేరి క్రియాశీలకంగా ఉంటున్నారు. దీంతో ఆయన్ను పార్టీ 53వ డివిజన్ కమిటీ సెక్రటరీగా నియమించారు. కాగా, 53వ డివిజన్ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు మరుపిళ్ల తిరుమలేశ్వరరావును నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించారు. ఈ సందర్భంగా కొత్తపేట కోమల విలాస్ సెంటర్ దగ్గర రాత్రి 10.30 గంటల వరకు తిరమలేశ్వరరావుతో పాటు స్థానిక టీడీపీ నాయకులతో మధుసూదన్‌రావు ఆనందంగా గడిపారు. అనంతరం మోటార్ సైకిల్‌పై బయటకు వెళ్లారు. ఈ క్రమంలో భారీవర్షం కురవటంతో అర్ధరాత్రి ఒంటిగంటకు రోడ్డంతా వర్షపునీరు చేరింది. దీంతో రాయల్ హోటల్ దగ్గర బండిని పార్క్ చేసి, అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి బయల్దేరారు. గులాం మొహిద్దీన్ రోడ్డులో మూడు మ్యాన్‌హోల్స్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్డు మీద భారీగా వర్షపు నీరు నిలిచిపోవటంతో నడుచుకుంటూ వెళ్తున్న మధుసూదన్‌రావు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్ వద్ద మట్టిదిబ్బపై అడుగు వేశారు. ఆ మట్టి పెళ్లలు విరిగిపడటంతో పాటు ఆయన కూడా జారి మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. స్థానికులు బయటకు తీసి పక్కనే ఉన్న ఇంటిమెట్లపై కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి ఆయన మామూలు స్థితికి వచ్చారు. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి స్థానికులు ప్రయత్నించగా, వద్దని ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులకు చెప్పటంతో వారు గవర్నర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మధుసూదన్‌రావు చనిపోయాడని నిర్ధారించారు. ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా మురుగు నీరు వెళ్లటంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
వర్షపునీటిలో పడి..
కొత్తపేట జెండాచెట్టు సమీపంలో వించిపేటకు చెందిన షేక్ ముర్తాజ్ (46) వన్‌టౌన్‌లోని ఓ బంగారం వర్క్‌షాపులో ఆభరణాలు, పాత ఐరన్ వ్యాపారం చేస్తున్నారు. మంగళవారం రాత్రి బైకుపై ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వర్షం భారీగా కురవటంతో రోడ్లు జలమయమయ్యాయి. బైకును జెండాచెట్టు సమీపంలో పార్క్ చేయగా, ప్రమాదవశాత్తు వర్షపునీటిలో పడిపోయారు. బుధవారం తెల్లవారుజామున జెండాచెట్టు ఎదురుగా, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పక్కనే ఉన్న చెట్టు వద్ద మృతదేహం కనిపించింది. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొత్తపేట పోలీసులు మృతులు మధుసూదన్‌రావు, ముర్తాజ్ ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నేలకూలిన చెట్టును ఢీకొని..
వర్షం కారణంగా మంగళవారం రాత్రి ఆంధ్రా లయోల కళాశాల ప్రఽధాన గేటు దగ్గర భారీచెట్టు నేలకొరిగింది. రాత్రి సమయంలో చెట్టు కూలడం, అదే సమయంలో వర్షం కురుస్తుండటంతో అటుగా బైకుపై వెళ్తున్న తుల్లూరి మహేశ్‌బాబు(36) చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోయారు. ఇది గమనించిన వాహనచోదకులు పోలీసులకు సమాచారం అందించారు. మాచవరం సీఐ ప్రకాశ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు గుణదల హరిజనవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. మహేశ్‌కు భార్య స్వాతి, పాప, బాబు ఉన్నారు. యనమలకుదురు శివాలయం వద్ద ఎలకి్ట్రకల్ షాప్ నడుపుతున్నారు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన తన భర్త విగతజీవిలా మారడంతో భార్య స్వాతి హృదయవిదారకంగా విలపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.