Share News

తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక.. నేటికి వాయిదా

ABN , Publish Date - May 20 , 2025 | 01:06 AM

తీవ్ర ఉద్రిక్తతల నడుమ తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదా పడింది. సరిపడా సభ్యులు (కోరం) లేకపోవడంతో చైర్‌పర్సన్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారిణి, ఆర్డీవో కె.మాధురి ప్రకటించారు. ఈ ఎన్నికకు సోమవారమే అన్ని ఏర్పాట్లు చేశారు.

తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక.. నేటికి వాయిదా
తిరువూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ నేతల మోహరింపు

కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి నిర్ణయం

మున్సిపల్‌ కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ ఘర్షణ

తమను కార్యాలయంలోకి రానివ్వలేదని వైసీపీ నిరసన

తమ వారిని నిర్బంధించారని టీడీపీ ఆరోపణ

ఇరువర్గాల బాహాబాహీ.. చెదరగొట్టిన పోలీసులు

తిరువూరు, మే 19 (ఆంధ్రజ్యోతి) : తీవ్ర ఉద్రిక్తతల నడుమ తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదా పడింది. సరిపడా సభ్యులు (కోరం) లేకపోవడంతో చైర్‌పర్సన్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారిణి, ఆర్డీవో కె.మాధురి ప్రకటించారు. ఈ ఎన్నికకు సోమవారమే అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలుత టీడీపీ కౌన్సిలర్లను పోలీసులు నిలిపివేయడంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలగజేసుకుని, బారికేడ్లను పక్కకు తోసి తమ సభ్యుల్ని లోపలకు పంపించారు. ఆ తర్వాత ప్రత్యేక వాహనంలో వచ్చిన వైసీపీ సభ్యులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరిని మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారంతా బారికేడ్లను తొలగించుకుని ముందుకొచ్చేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు.. వైసీపీకి చెందిన ఇతరులను అడ్డుకున్నారు. అయితే, అధికార పార్టీ నాయకులు తమను లోపలకు వెళ్లనీయడం లేదని వైసీపీ కౌన్సిలర్లు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కార్యాలయం వద్ద అరుపులు, తోపులాటతో అంతా గందరగోళం ఏర్పడింది. ఇటీవల తమ పార్టీలో చేరిన కొందరు సభ్యుల్ని వైసీపీ నాయకులు అక్రమంగా నిర్బంధించారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. కాగా, సోమవారం ఉదయం 11 నుంచి 12 గంటల్లోపు చైర్‌పర్సన్‌ ఎన్నిక జరగాల్సి ఉండగా, సమావేశ మందిరంలోకి కేవలం ఏడుగురు సభ్యులే హాజరుకావడంతో ఎన్నిక సమయం పూర్తై, మంగళవారానికి వాయిదా వేశారు. వాయిదా ప్రకటన రాగానే, వైసీపీ కౌన్సిలర్లు ప్రత్యేక వాహనంలో వెళ్లిపోయారు.

ఇరువర్గాల మోహరింపు

సోమవారం ఉదయం నుంచే టీడీపీ, వైసీపీ శ్రేణులు మున్సిపల్‌ కార్యాలయం వద్ద మోహరించాయి. ఓవైపు ఎమ్మెల్యే కొలికపూడితో పాటు టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయానికి భారీగా చేరుకోగా, మరోవైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు.. టీడీపీ శ్రేణులపై కవ్వింపు చర్యలకు పాల్పడంతో వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రశాంత వాతావరణం నెలకొంటున్న సమయంలో బయట నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు తిరిగి మున్సిపల్‌ కార్యాలయం వద్ద గొడవ చేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వాసం మునియ్య, కొందరు టీడీపీ కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి.

Updated Date - May 20 , 2025 | 01:06 AM