తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు
ABN , Publish Date - May 21 , 2025 | 12:52 AM
తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దైంది. మంగళవారం జరిగిన ఎన్నికకు సభ్యులెవరూ హాజరుకాకపోవడంతో ఎన్నిక రద్దు చేస్తున్నట్లు ఎన్నికల అధికారిణి, ఆర్డీవో కె.మాధురి ప్రకటించారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సమావేశ మందిరంలో ఆమె సభ్యుల కోసం వేచి చూశారు. గడువు ముగిశాక కూడా టీడీపీ, వైసీపీ సభ్యులు రాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, తదుపరి చర్యల కోసం ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపుతామని తెలిపారు.
కోరం లేకపోవటంతో రద్దు చేసిన ఎన్నికల అధికారులు
వైసీపీ సభ్యులంతా గైర్హాజరు
టీడీపీకి మద్దతుగా ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు
తిరువూరు, మే 20 (ఆంధ్రజ్యోతి) : తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దైంది. మంగళవారం జరిగిన ఎన్నికకు సభ్యులెవరూ హాజరుకాకపోవడంతో ఎన్నిక రద్దు చేస్తున్నట్లు ఎన్నికల అధికారిణి, ఆర్డీవో కె.మాధురి ప్రకటించారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సమావేశ మందిరంలో ఆమె సభ్యుల కోసం వేచి చూశారు. గడువు ముగిశాక కూడా టీడీపీ, వైసీపీ సభ్యులు రాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, తదుపరి చర్యల కోసం ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపుతామని తెలిపారు.
కార్యాలయం వద్దే వేచి ఉన్న టీడీపీ కౌన్సిలర్లు
టీడీపీ మద్దతు తెలిపిన వైసీపీకి చెందిన ఐదుగురు సభ్యులతో పాటు టీడీపీ చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు మద్దతు ప్రకటించిన మరో ఇద్దరు కౌన్సిలర్లను వైసీపీ నాయకులు నిర్బంధించారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. కార్యాలయం వద్ద ఉన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు 8 మంది టీడీపీ కౌన్సిలర్లు సమావేశ మందిరంలోకి వెళ్లారు. అయితే, కోరం పూర్తికాదని, మరో ఇద్దరు కౌన్సిలర్ల కోసం వేచి చేశారు. ఎన్నిక రద్దయినట్లు అధికారులు ప్రకటించడంతో వారు కూడా వెళ్లిపోయారు. 13వ వార్డు కౌన్సిలర్ ఇనపనూరి చిన్నారిని వైసీపీ నాయకులు నిర్బంధించారంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు వైసీపీ నాయకుడు నల్లగట్ల స్వామిదాసు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.
నిర్మానుష్యంగా మున్సిపల్ కార్యాలయం రోడ్డు
తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో సోమవారం ఇరువర్గాలతో కిటకిటలాడిన మున్సిపల్ కార్యాలయం రోడ్డు మంగళవారం మాత్రం బోసిపోయింది. పోలీసు బందోబస్తు నేపథ్యంలో నిర్మానుష్యంగా కనిపించింది. దాదాపు పట్టణం మొత్తం పోలీసుల నిఘాతో నిండిపోయింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పట్టణ శివార్లకే పరిమితమయ్యారు.
భారీ బందోబస్తు
తిరువూరులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఏడీసీపీ, నలుగురు ఏసీపీలు, ఇద్దరు డీసీపీలు, మైలవరం ఏసీపీ, సీఐలు 8 మంది, పలువురు ఎస్సైలు తమ సిబ్బందితో సోమ, మంగళవారాల్లో గస్తీ నిర్వహించారు.