ఆపదేం లేదు.. అయినా అప్రమత్తం
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:00 AM
కృష్ణానదిలో వరద స్థిరంగా కొనసాగుతోందని, ముప్పేమీ లేదని, అయినా జిల్లా అధికార యంత్రాంగాన్ని, నదీ పరివాహకంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరదను పరిశీలించిన కలెక్టర్
విజయవాడ సిటీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : కృష్ణానదిలో వరద స్థిరంగా కొనసాగుతోందని, ముప్పేమీ లేదని, అయినా జిల్లా అధికార యంత్రాంగాన్ని, నదీ పరివాహకంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతోందని, రానున్న రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి మూడు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం మాత్రమే ఉందని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మొద్దని హితవు పలికారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలిన నీటిని బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఆర్.మోహనరావు, కృష్ణా రివర్ కన్జర్వేటివ్ ఈఈ రావెళ్ల రవికిరణ్, డీఈ ఎస్.అజయ్‌బాబు, బ్యారేజీ జేఈ సత్యరాజేశ్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న నీటితో పులిచింత ప్రాజెక్ట్ నిండుకుందన్నారు. పులిచింతల నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశామని, ఈ నీటి ఉధృతి కారణంగా బ్యారేజీ 55 గేట్లను అడుగు మేర, 15 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి విడుదల చేసినట్లు చెప్పారు. గురువారం ఉదయానికి లక్ష క్యూసెక్కులు, మరో రెండు రోజుల్లో రెండు లక్షల క్యూసెక్కుల నీరు నది ఎగువ నుంచి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇరిగేషన, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మునిసిపల్ అధికారులను సమన్వయం చేసి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఒక గ్రామానికి మాత్రమే మార్గం తెగిపోయే అవకాశం ఉందన్నారు. అయితే, ఆ గ్రామానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, ప్రమాదం తలెత్తితే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు మ్యాపింగ్ చేసుకుని సిద్ధంగా ఉన్నామన్నారు. నగరంలో డ్రెయినేజీలు పొంగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. బుడమేరు, పులివాడు, కోతుల వాగు పరివాహక ప్రాంతాల్లోనూ ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో నదిలో చేపల వేటకు వెళ్లొద్దని, లంక గ్రామాల్లోని ప్రజలు పశువులను నదిలోకి వదలొద్దని సూచించారు. వరద నేపథ్యంలో కలెక్టరేట్‌లో 9154971454 నెంబర్‌తో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.