Share News

గన్నవరంలో అక్రమ మైనింగ్‌ ఉండదు

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:41 AM

అంపాపురంలో పంచాయతీ భవనాన్ని బుధవారం ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు.

గన్నవరంలో అక్రమ మైనింగ్‌ ఉండదు

ఇక అంతా సక్రమమే.. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసిన గత పాలకులు

ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే సహించం..ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరిక

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ‘గన్నవరం నియోజకవర్గంలో ఇక మీదట అక్రమ మైనింగ్‌ ఉండదు. అంతా సక్రమంగానే ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలో మైనింగ్‌ మాఫియా అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు జరిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజిలెన్స్‌ విచారణ జరిపేందుకు వీలుగా ప్రస్తుతం మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం లేదు. అనుమతులు ఇచ్చాక అక్రమ మైనింగ్‌ను ఉపేక్షించం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. అంపాపురంలో పంచాయతీ భవనాన్ని బుధవారం ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కక్షసాధింపు చర్యలు తనకు తెలియదన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు. ట్రిపుల్‌ఐటీ గచ్చిబౌలిని గన్నవరం తీసుకొచ్చేందుకు అందరితో మాట్లాడి ఒప్పిస్తేమేధా టవర్స్‌లో ఖాళీగా ఉన్న 37వేల చదరపు అడుగుల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అనుమతి వచ్చిందన్నారు. తర్వాత గన్నవరం విమానాశ్రయానికి దగ్గరలో 30 ఎకరాల భూమిని వారికి చూపించలేని పరిస్థితి ఉందన్నారు. గత పాలకుల దుర్మార్గం వల్ల ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణలకు గురయ్యాయన్నారు. ఉమామహేశ్వరపురంలోని శ్మశానవాటిక భూమిని అక్రమించారని అక్కడి నాయకులు ఫిర్యాదు చేశారని, రెండు రోజుల్లో ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ ఆస్తుల వ్యవహారంలో గతంలో తప్పుచేసిన అధికారులను వదిలిపెట్టబోమన్నారు. గతంలో అక్రమ మైనింగ్‌ జరిగిన మాట వాస్తమేనని, విజిలెన్స్‌ ఎంక్వయిరీ జరిగిందని, సిట్‌ ఎంక్వయిరీ జరుగుతోందని దానిపై తనకు స్పష్టత లేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాలసీ తీసుకున్న తరువాత గ్రావెల్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. మల్లవల్లి పారిశ్రామికవాడను రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో వారిలాగా మాకు కమీషన్లు అక్కర్లేదని నియోజకవర్గంలోని యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు మాత్రమే కావాలని పారిశ్రామికవేత్తలను కోరానన్నారు. పారిశ్రామికవాడలో సమస్యలను సింగిల్‌ విండో ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఐటీ ఉద్యోగాలు తప్ప మిగిలిన ఉద్యోగావకాశాలన్నీ నియోజకవర్గ యువతకు అందించేందుకు కృషి చేస్తానన్నారు. జర్నలిస్టుల స్థలాల కోసం అసెంబ్లీ వేదికగా ప్రశ్నించానన్నారు. నున్నలో అక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్లో అక్రమణలను తొలగించామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఆలోచించుకోవాలని, గోడలు కట్టినా గోడకు కొట్టిన సున్నంలా వృథా అవుతుందని హెచ్చరించారు.

Updated Date - Apr 17 , 2025 | 12:43 AM