Share News

చెత్త..శుద్ధి కావాలి

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:04 AM

వర్మీ కంపోస్టు ప్లాంట్లు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉండగా నగరంలో ఓ వెలుగు వెలిగిన ఈ ప్లాంట్లు ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించ ట్లేదు. సేంద్రియ వ్యర్థాల నుంచి వర్మీ కంపోస్టును తయారుచేసే ఈ ప్లాంట్లు అప్పట్లో విజయవంతం కాగా, కాలక్రమంలో మూతపడ్డాయి. ప్రస్తుతం నగరంలో 300 టన్నుల వరకు సేంద్రియ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో తిరిగి వర్మీ ప్లాంట్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చెత్త..శుద్ధి కావాలి

నగరంలో వర్మీ కంపోస్టు ప్లాంట్ల ఏర్పాటు అవసరం

రోజూ 300 టన్నుల మేర సేంద్రియ వ్యర్థాల ఉత్పత్తి

సద్వినియోగం చేసుకోలేకపోతున్న అధికార యంత్రాంగం

ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 30 వర్మీ ప్లాంట్లు

నాడు ప్రపంచ బ్యాంకు గుర్తింపు.. జాతీయస్థాయిలో మూడోస్థానం

నేడు కనిపించకుండాపోయిన వర్మీ ప్లాంట్లు

మళ్లీ ఏర్పాటుచేస్తే ఎంతో ఉపయుక్తం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలో రోజుకు 750 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 300 టన్నుల సేంద్రియ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే, వీటిలో పొడిచెత్తను జిందాల్‌ కంపెనీకి పంపించి సద్వినియోగం చేసుకుంటుండగా, ప్లాస్టిక్‌ వంటి వ్యర్థాలను ఫైర్‌ ఉడ్‌ కేటగిరీ కింద అమ్మి ఆదాయాన్ని సాధిస్తున్నారు. కానీ, సేంద్రియ వ్యర్థాల విషయంలో మాత్రం అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యర్థాల ద్వారా కూడా సంపద సృష్టించుకునే అవకాశాలున్నా కార్యరూపంలోకి తీసుకొచ్చేలా నిర్ణయాలు ఉండట్లేదు.

వర్మీ కంపోస్టు ప్లాంట్లు అవసరం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, నగరంలో సేంద్రియ వ్యర్థాల సద్వినియోగంతో పాటు సంపద సృష్టించేలా వర్మీ కంపోస్టు ప్లాంట్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. నగరంలో 30 వరకు ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్‌ ద్వారా నెలకు 3 నుంచి 4 టన్నుల వర్మీ కంపోస్టు ఉత్పత్తి జరిగే ది. అప్పట్లో వర్మీ కంపోస్టు టన్ను రూ.4 వేలు పలికితే, ఇప్పుడు రూ.10 వేలకు చేరింది. ప్రస్తుతం నగరంలో ఉత్పత్తి అయ్యే 300 టన్నుల సేంద్రియ వ్యర్థాల నుంచి 100 టన్నుల వర్మీ కంపోస్టును ఉత్పత్తి చేయవచ్చు. నాడు పెద్దగా ఖర్చు లేకుండా కాలనీ అసోసియేషన్లు, ఎన్‌జీవోల సహకారంతో ఈ ప్లాంట్లు ప్రారంభించగా, ప్రస్తుతం నగరంలో ఒక్కటి కూడా కనిపించట్లేదు. కార్పొరేషన్‌ అధికారులు, జిల్లా యంత్రాంగం ఈ అంశంపై దృష్టిసారించి తిరిగి వర్మీ కంపోస్టు ప్లాంట్లకు ప్రోత్సహించడం ద్వారా సేంద్రియ వ్యర్థాల సద్వినియోగంతో పాటు సంపద సృష్టి దిశగా అడుగులు వేయొచ్చు. వర్మీ కంపోస్టు ప్లాంట్‌ పెట్టడానికి గరిష్టంగా రూ.3 లక్షలు అయ్యే అవకాశముంది. కార్పొరేషన్‌ స్థలాల్లో పక్కా భవనాలు కాకుండా, పాకలు వేసి ప్లాంట్లకు ఏర్పాటుచేయొచ్చు. ప్రతి కాలనీ సంఘానికి వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగించటం ద్వారా వర్మీ ప్లాంట్లను మరింత సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.

సేంద్రియ వ్యర్థాలంటే..

కుళ్లిపోయే స్వభావం కలిగిన వ్యర్థాలనే సేంద్రియ వ్యర్థాలు అంటారు. రైతుబజార్లలో కూరగాయల వ్యర్థాలు, కల్యాణ మండపాల్లో భోజనాలు, హోటళ్లు, హాస్టళ్లలో వ్యర్థాలు ఈ సేంద్రియ కేటగిరీలోకి వస్తాయి. గతంలో సేంద్రియ, అసేంద్రియ వ్యర్థాల పేరుతో ఇంటింటికీ ప్రత్యేకంగా గ్రీన్‌, ఎల్లో ప్లాస్టిక్‌ డస్ట్‌బిన్లు ఇచ్చేవారు. వర్మీ కంపోస్టు ప్లాంట్లు ఏర్పాటుచేసిన ప్రాంతాల పరిధిలో డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ జరిగేది. ప్రస్తుతం ఈ విధానంలో ఎక్కడా చెత్త సేకరణ జరగట్లేదు.

గతమెంతో ఘనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, నగర పరిధిలో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు ప్లాంట్ల వ్యవస్థను ప్రపంచ బ్యాంకు గుర్తించింది. ఆ బ్యాంకు బృందం నగరానికి వచ్చి వర్మీ కంపోస్టు ప్లాంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ ప్లాంట్లలో వానపాములను పెంచి సేంద్రియ వ్యర్థాలను కరిగిస్తూ కంపోస్టును ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించింది. తమ వంతు సహకారం అందిస్తామని హామీ కూడా ఇచ్చింది. వీరి పర్యటనతో దేశస్థాయిలో నగరంలోని వర్మీ కంపోస్టు ప్లాంట్లకు మంచి పేరు వచ్చింది.

దేశంలోనే మూడోస్థానం

అప్పట్లో శ్రీరామ్‌ ఎనర్జీ ప్లాంట్‌ ద్వారా చెత్త నుంచి విద్యుత తయారుచేసే ప్రాజెక్టును కార్పొరేషన్‌ చేపట్టింది. మాంసం వ్యర్థాల నుంచి గ్యాస్‌ తయారుచేసి, దానిద్వారా విద్యుతను తయారుచేసే బయోమెథపైజేషన్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. చెత్త నుంచి కంపోస్టు, పిల్లెట్లు తయారుచేసే యూనిట్లను ఏర్పాటు చేసింది. కాలక్రమంలో ఇవన్నీ మూతపడ్డాయి. ఇవి మూతపడిన క్రమంలో వచ్చిన వర్మీ కంపోస్టు ప్లాంట్లు చాలావరకు సమర్థవంతంగా పనిచేశాయి. దీంతో జాతీయ స్థాయిలో విజయవాడ మూడో స్థానాన్ని సాధించింది. స్వచ్ఛతలో విజయవాడకు దక్కిన గౌరవమిది.

Updated Date - Jun 10 , 2025 | 01:04 AM