అక్క‘డెక్క’డే..!
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:51 AM
పంటల సీజన్ ప్రారంభం కాక మునుపే నీటి ప్రవాహానికి అడ్డుగా డ్రెయిన్లలో పేరుకుపోయిన కిక్కిస, గుర్రపుడెక్కలను తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయం నీరుగారిపోయింది. గత ఏడాది డిసెంబరు, ఈ ఏడాది ఆరంభంలో డ్రెయిన్లలో కిక్కిస, గుర్రపుడెక్క తొలగింపునకు టెండర్లు పిలిచి రూ.లక్షల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ పనులు పూర్తి చేయకుండానే బిల్లులకు సిద్ధమైపోయారు. డ్రెయినేజీ అధికారులు కూడా వంత పాడుతుండటంతో పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు. - గుడివాడ, ఆంధ్రజ్యోతి
డ్రెయిన్లలో కిక్కిస, గుర్రపుడెక్క తొలగింపు పనులు నామమాత్రమే..
పైపై పనులతో సరిపెట్టిన కాంట్రాక్టర్లు
ఒకవైపు మాత్రమే తొలగించి మమ..
తూతూమంత్రపు పనులతో అవస్థలు
క్షేత్రస్థాయిలో పరిశీలించని డ్రెయినేజీ అధికారులు
బిల్లుల మంజూరుకు మాత్రం సిద్ధం
ఆత్కూరు డ్రెయిన్‌లో ఎక్కడి పనులక్కడే..
ఆత్కూరు యూటీ మీడియం డ్రెయిన్‌లో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పేరుకుపోయిన కిక్కిసను తొలగించేందుకు టెండర్లు పిలవగా, కాంట్రాక్టర్ రూ.15.59 లక్షలకు దక్కించుకున్నాడు. పనులు ప్రారంభించి డ్రెయిన్ లోపల రెండు పక్కలా కిక్కిసను తొలగించి చేతులు దులుపుకొన్నారు. మధ్యలో కిక్కిసను తొలగించకుండా వదిలేశారు. డ్రెయినేజీ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే బిల్లులు ఇచ్చేశారు.
దారుణంగా అరిపిరాల-రామాపురం భూమికోడు డ్రెయిన్
నందివాడ మండలంలో అరిపిరాల నుంచి రామాపురం వరకు సమారు 3.6 కిలోమీటర్ల మేర ఉండే భూమికోడు డ్రెయిన్ చుట్టూ ఆక్రమణలుండటంతో అధికారుల పర్యవేక్షణ ఉండదనే ఽధీమాతో ఓవైపు మాత్రమే కిక్కిసను తొలగించి చేతులు దులుపుకొన్నారు. ఎక్కడి పనులక్కడే ఉన్నా అధికారులు మాత్రం బిల్లుల చెల్లింపునకు సిద్ధపడ్డారు.
కుదరవల్లి డ్రెయిన్ల దుస్థితి
నందివాడ మండలంలోని కుదరవల్లి-బుడమేరు ఎగువ, పాతరామాపురం-కుదరవల్లి మధ్యస్థ, కుదరవల్లి-ఇలపర్రు మైనర్ డ్రెయిన్, భూమికోడు డ్రెయిన్లలో పేరుకుపోయిన కిక్కిస తొలగింపునకు ఒకే కాంట్రాక్టు కింద రూ.13.14 లక్షలకు టెండర్లు పిలిచారు. దాదాపు 38 శాతం తక్కువకు కాంట్రాక్టర్ టెండర్‌ను దక్కించుకున్నాడు. ఈ మూడు డ్రెయిన్ల పొడవు సుమారు 10 కిలోమీటర్లు. వీటి వెంబడి చెరువులుండగా, ఇక్కడే ఒకవైపు నుంచి మాత్రమే కిక్కిసను తొలగించారని, కేవలం 25 శాతం మేర మాత్రమే తొలగింపు జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కూడా డ్రెయినేజీ అధికారులు.. పనుల పర్యవేక్షణలో అలసత్వం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బిల్లులు చేసుకునేందుకు కాంట్రాక్టర్ సిద్ధపడగా, డ్రెయినేజీ అధికారులు సహకరించారని నీటి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
డ్రెయినేజీ అధికారుల నిర్లక్ష్యంతో..
లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా.. మూడు నెలలు తిరగక మునుపే డ్రెయిన్లలో కిక్కిస దర్శనమిస్తోంది. కిక్కిస తొలగింపు పూర్తిగా చేయకుండానే డ్రెయినేజీ అధికారులు బిల్లులు చెల్లించడానికి సిద్ధపడటంపై నీటి సంఘాలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ అలసత్వానికి అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నిజనిజాలను బహిర్గతం చేయాలని నీటి సంఘాలు, రైతులు కోరుతున్నారు.