కృష్ణమ్మ దరికి గోదారి
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:32 AM
కృష్ణమ్మ దరికి గోదావరి పరవళ్లు తొక్కింది. పట్టిసీమ పంపుల నుంచి పరుగులు తీసిన గోదారమ్మ బుధవారం కృష్ణమ్మ చెంతకు చేరింది. ఈ కలయికను స్వాగతిస్తూ ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి ఇచ్చారు.
పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలోకి చేరిన గోదావరి జలాలు
పట్టిసీమ నుంచి 5,600 క్యూసెక్కుల నీరు రాక
ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటిమట్టం
కృష్ణాడెల్టా రైతుల మోముల్లో ఆనందం
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : కృష్ణమ్మ దరికి గోదావరి పరవళ్లు తొక్కింది. పట్టిసీమ పంపుల నుంచి పరుగులు తీసిన గోదారమ్మ బుధవారం కృష్ణమ్మ చెంతకు చేరింది. ఈ కలయికను స్వాగతిస్తూ ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి ఇచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య పాల్గొన్నారు. గోదావరి జలాల రాకతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం పవిత్ర సంగమాన్ని తాకిన గోదావరి జలాలు సాయంత్రానికి బ్యారేజీ వద్దకు చేరాయి. దీంతో డెల్టా ప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పట్టిసీమ నుంచి 16 పంపుల ద్వారా గోదావరి జలాలను కృష్ణానదిలోకి వదిలారు. మొత్తం 5,600 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఒక్కో పంపు నుంచి రోజుకు 350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.
బ్యారేజీ వద్ద పెరుగుదల
బ్యారేజీకి దిగువన తూర్పు డెల్టాలో మొత్తం 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ డెల్టాలో ఖరీఫ్ సాగుకు 155.40 టీఎంసీల నీరు అవసరం. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి పరిమాణం 3.07 టీఎంసీలు. ప్రస్తుతం ఇక్కడ 2.83 టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీకి ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జున సాగర్‌కు చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండాక దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఈ నీరు వస్తే గానీ పులిచింతల గేట్లు ఎత్తే పరిస్థితి ఉండదు. ఈలోగా గోదావరి జలాలతో బ్యారేజీ వద్ద ఉన్న నీటిమట్టాన్ని పెంచాలన్న ఆలోచనలో జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు. పట్టిసీమ నుంచి 2015-16 సంవత్సరంలో 8.50 టీఎంసీలు, 2016-17 సంవత్సరంలో 55.60 టీఎంసీలు, 2017-18 సంవత్సరంలో 105.00 టీఎంసీలు, 2018-19 సంవత్సరంలో 26.88 టీఎంసీల నీటిని కృష్ణాకు తరలించారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు మాత్రమే పట్టిసీమ నుంచి నీటిని తీసుకుంది. పట్టిసీమ నీటి సామర్థ్యం 8,500 టీఎంసీలు. ఇక్కడ 24 పంపులు ఉన్నాయి. ఒక్కో పంపు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయవచ్చు. ప్రస్తుతం పట్టిసీమ నుంచి 5,600 క్యూసెక్కుల నీరు కృష్ణానదిలోకి వచ్చి చేరుతోంది. గడిచిన వ్యవసాయ సంవత్సరంలో మొత్తం 20.06 టీఎంసీల నీరు పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి చేరింది.